బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు…. ఇది రజినీకాంత్ పాపులర్ డైలాగ్…. కానీ 25 ఏళ్లుగా చెబుతున్నా సరే, ఇప్పటికి ఒక్కసారి కూడా నిజం కాలేదు… అదే తను పాలిటిక్సులోకి ఎంట్రీ ఇవ్వడం… అయితేనేం, ఎట్ లాస్ట్… ఇప్పుడిక బండి కదిలింది… 70 ఏళ్ల వయస్సులో… మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో…
తమిళనాడు కోసం ప్రాణాలిస్తా… జీవితాన్ని త్యాగం చేస్తా… ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు… మార్పు తీసుకొస్తా… అద్భుతాలు జరగబోతున్నాయి… వంటి సినిమా డైలాగులు వల్లిస్తున్నాడు… మరిన్నాళ్లూ ఏమైపోయావ్ రజినీ అని అడక్కండి… అసలే హీరోలు అంటే ఫ్యాన్స్‌కు దేవుళ్లు… మేం దేవుళ్లం కాదురా మొర్రో అని సాక్షాత్తూ వాళ్లే చెప్పినా సరే… ఛస్, నీకు తెలియదు, నువ్వూరుకో, నువ్వు దేవుడివే అని దబాయిస్తారు… సో, మరో దేవుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు…
Ads
ఎంజీఆర్, కరుణానిధిల కాలం నుంచి మొన్నటి ఎన్నికల వరకూ… సినిమా వ్యక్తులదే తమిళ రాజకీయం అంటే…! జయలలిత, కరుణానిధి కాలం చెల్లిపోయినా సరే, ఇంకా సినిమాలే అక్కడి రాజకీయాల్ని శాసిస్తున్నాయ్… జనసేనలాగా, కమల్‌హాసన్ పార్టీలాగా చతికిలపడతాడా… సక్సెస్ అవుతాడా అనేది కాలం చెబుతుంది… కానీ తన రాజకీయాల్లో నిజాయితీ పాలెంత అనేది మాత్రం చర్చనీయాంశమే… తను చెప్పే లౌకిక ఆధ్యాత్మిక రాజకీయాలు అనే మాటే ఓ చిత్రమైన తమిళ డైలాగు… నిజానికి ఎన్టీయార్ తరువాత రాజకీయాల్లో క్లిక్కయిన హీరో ఎవరూ లేరు… అద్భుతమైన పాపులారిటీ ఉన్న చిరంజీవి కూడా విఫలుడై, చివరకు పార్టీని కూడా కాంగ్రెస్‌కు వదిలేసుకుని, రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు… మరి రజినీ..? అసలు సినిమా డైలాగులకు ప్రజలు పడిపోయే రోజులేనా ఇవి..? కాదని వర్తమానకాలం గట్టిగానే చెబుతోంది…
మే 2021కల్లా తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువు తీరాలి… అంటే నాలుగైదు నెలల కాలం మిగిలి ఉంది… షెడ్యూల్, నోటిఫికేషన్ ప్రకటనలు మార్చి, ఏప్రిల్‌లో జరగాలి… అంటే తనకున్నది మహా అయితే జనవరి, ఫిబ్రవరి… ఇన్నేళ్లు జనంలో లేడు సరే, కానీ ఇప్పుడు..? తన ఆరోగ్యం బాగాలేదు… కరోనా పీడదినాలు… రాష్ట్రమంతటా చుట్టేయడం కష్టం… అంటే మరికొన్ని సినిమా డైలాగులకు పదును పెట్టి, జనంలోకి వదిలి… చకచకా టికెట్లు కట్ చేసి, అదృష్టాన్ని పరీక్షించుకోవడమే…
తనకు టైం తక్కువ ఉంది కాబట్టి… ఏదో ఒక పార్టీతో కలిసి సాగుతాడా..? అప్పుడే అన్నాడీఎంకే కలిసి పనిచేయడానికి మేం సై అంటోంది… ఎలాగూ బీజేపీ, అన్నాడీఎంకే మిత్రపక్షాలే… ఈయన గారిది ఆధ్యాత్మిక పార్టీయే… సో, ముగ్గురూ కలిసి సాగుతారా..? ఆల్రెడీ ఓ బీజేపీ వ్యక్తికి స్టేట్ కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టేశాడు రజినీ… ఇదంతా ఒకెత్తు అయితే… సుబ్రహ్మణ్యస్వామి జోస్యాలు, బాష్యాలు మరో ఎత్తు…
Good that “will he or will he not” about Rajnikant joining politics has ended. The key battle will be probably between Rajnikanth and Sasikala. BJP will be in a dilemma
— Subramanian Swamy (@Swamy39) December 3, 2020
వస్తే వచ్చాడు, సంతోషం… ఇక పోరు ప్రధానంగా రజినీకాంత్, శశికళ నడుమే అంటున్నాడు… నవ్వొచ్చేలా ఉంది… రజినీకాంత్‌కు కనీసం రెండుమూడు నెలల టైమయినా ఉంది… శశికళ విడుదలయ్యేదే జనవరి చివరలో… ఆమె కాలూచెయ్యీ కూడదీసుకునేలోపు ఎన్నికలు అయిపోతాయ్… ఆమె వర్గం కకావికలై ఉంది… చాలా ఆస్తులు ఈడీ స్వాధీనంలోకి వెళ్లాయి… శశికళ మళ్లీ తమిళరాజకీయాల్లో యాక్టివ్ కావద్దనే భావనతోనే బీజేపీ ఆమె ముందస్తు విడుదలకు అడ్డుపడింది…
పైగా అన్నాడీఎంకే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్లస్ అది బీజేపీతో అంటకాగడం మీద వ్యతిరేకత కలిసి… తమిళ ప్రజల్లో డీఎంకే కూటమికి సానుకూలత పెరిగింది… అందులో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నయ్… స్టాలిన్ రాజకీయాల్లో బాగా ముదిరిపోయిన కేరక్టరే… సీట్ల పంపిణీలో కూడా ఆ కూటమి పార్టీల నడుమ పట్టూవిడుపులు, సమన్వయం బాగున్నయ్… ఈ స్థితిలో రజినీకాంత్ అన్నాడీఎంకే, బీజేపీతో కలిసి నడిచినా పెద్ద ఫాయిదా ఉంటుందా అనేది డౌటే… ఏమోలెండి… అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన రోబో సినిమా తరువాత తనకు ఒక్క హిట్టూ లేదు… ఏమో… ఈ సినిమా సూపర్ హిట్ కావచ్చునేమో…!!
Share this Article