.
చప్పట్లకు గడువు ఉంటుంది… జీవితానికి ఉండదు! వృద్ధాశ్రమంలో మాజీ హీరో మోహన్ శర్మ… ఈ వార్త చదివిన వెంటనే చాలామంది “అయ్యో!” అనుకుని ముందుకు వెళ్లిపోవచ్చు. కానీ కాసేపు ఆగి ఆలోచిస్తే ఇది ఒక్క మోహన్ శర్మ కథ కాదు. సినిమా ప్రపంచం గురించి మనం మరిచిపోతూ ఉండే ఒక చేదు నిజం.
ఒకప్పుడు హీరో. అవార్డు గ్రహీత. దర్శకుడు. నిర్మాత. రచయిత. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు. పోయెస్ గార్డెన్‌లో ఇల్లు. గౌరవం, పేరు, ప్రతిష్ఠ… అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం చెన్నై సమీపంలోని ఓ వృద్ధాశ్రమంలో మందుల కోసం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి.
Ads
ఇది చదివాక ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం కాదు.
తెలుగులో మహానటి సావిత్రి చివరి రోజులు ఎవరికీ తెలియనివి కావు. ఒకప్పుడు కోట్లాది మంది ఆరాధించిన నటి, చివరికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో పోరాడాల్సి వచ్చింది. ఇటీవల ఫిష్ వెంకట్ చికిత్స కోసం సహాయం కోరిన వార్తలు చూశాం. పావలా శ్యామల ఆర్థిక కష్టాలు కూడా మీడియాలోకి వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదే.

ఇక్కడ అసలు ప్రశ్న… “ఇంత సంపాదించిన వాళ్లు చివరికి ఇలా ఎందుకు అయ్యారు?”
దానికి ఒకే ఒక్క సమాధానం ఉండదు.
కొంతమంది వ్యాపారాల్లో నష్టపోయారు. కొందరు తీసిన సినిమాలే వారిని అప్పుల పాల్జేశాయి. కొందరి కుటుంబ జీవితం విచ్ఛిన్నమైంది. కొందరిని అనారోగ్యం కుంగదీసింది. ఇంకొందరిని ఒంటరితనం మింగేసింది. మరికొందరికి నమ్మినవాళ్లే మోసం చేశారు.
సినిమా అనేది అత్యంత అనిశ్చిత రంగం. ఈరోజు స్టార్… రేపు అవకాశాల కోసం ఎదురుచూసే పరిస్థితి రావచ్చు. ఒక హిట్ జీవితం మార్చేస్తుంది. ఒక ఫ్లాప్ జీవితాన్నే తలకిందులు చేస్తుంది.
అందుకే సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే ముఖ్యం. పేరు సంపాదించడం ఒక విజయం అయితే, ఆ విజయాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం మరో విజయం.
అయితే ప్రతిదీ ప్లానింగ్‌తోనే జరుగుతుందా? కాదు.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కుటుంబం చెదిరిపోవచ్చు. అనుకోని నష్టాలు రావచ్చు. కొన్నిసార్లు దురదృష్టం కూడా మనిషిని వెంటాడుతుంది. అందుకే జీవితంలో ఆర్థిక ప్రణాళికతో పాటు అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఇలాంటి ఉదాహరణలు గుర్తు చేస్తుంటాయి.
(ఇది మాతృభూమి పత్రికలో మోహన్ శర్మ దురవస్థ మీద ప్రచురితమైన కథనం)
మోహన్ శర్మ ఒక మాట అన్నారు… “చనిపోయిన తర్వాత డబ్బు ఎవరికి కావాలి?”
ఆ మాటలో ఒక వ్యక్తి నిస్సహాయత మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యంపై ఆవేదన కూడా ఉంది. సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు పనిచేసిన కళాకారులు చివరి రోజుల్లో మందుల కోసం చేయి చాచాల్సి వస్తే, అది కేవలం వారి వ్యక్తిగత వైఫల్యంగా మాత్రమే చూడలేం. కళాకారుల సంక్షేమంపై సినీ పరిశ్రమ, సంఘాలు, ప్రభుత్వాలు మరింత బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.
చప్పట్లు శాశ్వతం కావు. అభిమానుల హర్షధ్వానాలు కూడా కాలంతో కలిసి మసకబారిపోతాయి. మిగిలేది మనిషి జీవితం మాత్రమే.
మోహన్ శర్మ కథ… మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసింది.
Share this Article