.
ప్చ్… హైదరాబాద్ ఒకప్పుడు మిర్చి బజ్జీలకు ఫేమస్… రాత్రనక, పగలనక నూనెలో వేగుతూనే ఉండేవి పాపం… ఇప్పుడు హైదరాబాద్ తన టేస్ట్ మొత్తం కోల్పోయింది… ఎందుకంటారా..? మీకూ తెలుసు…
బజ్జీ దొడ్డు మిర్చికి నిలువునా గాటుపెట్టి, గింజలు సాంతం తీసేసి, కాస్త చింతపండు రసమో, వాము పొడో మిర్చి లోపల రుద్ది, అప్పుడు శెనగపిండి ద్రావణంలో ముంచి, ఫుల్లు ఫ్రై చేసి ఇచ్చేవాళ్లు… ఇప్పుడా..? కొందరు కనీసం గాటు కూడా పెట్టడం లేదు, అలా పిండిలో ముంచడం, బాణలిలో వేసేయడం…
Ads
మంచి పేరున్న హోటళ్లలో అంతే, స్ట్రీట్ ఫుడ్ బండ్లలో అంతే, చివరకు పర్మిట్ రూమ్స్, బార్లలోనూ అంతే… అసలు దాన్ని బజ్జీ మిర్చి అనొచ్చా! హవ్వ!! ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… టైమ్ అవుట్ వాడు ప్రపంచంలోకెల్లా ఫేమస్ టాప్ 50 స్ట్రీట్ ఫుడ్ జాబితా ఒకటి వెలువరించాడు… అందులో రాజస్థాన్ మిర్చి బడ కూడా ఉంది…

అక్కడ మిర్చి బడ అంటారు లెండి… కాకపోతే వాళ్లు మిర్చి గింజలను తీసేసి, అందులో మెత్తగా మెదిపిన ఆలూ, మసాలాను కూరతారు… మరి దానికి వచ్చిన ప్రాధాన్యం మిర్చి బజ్జీలకు ఎందుకు రాలేదు..? అసలు ఘాటు నషాళానికి అంటే మిర్చి బజ్జీలకు మనం కదా గతంలో ఫేమస్… జీఐ గుర్తింపుకై ఎవరూ అప్లయ్ చేయలేదు గానీ, మనకే వచ్చేది…
అవునూ, ఇదొక్కటేనా? మరి మన స్ట్రీట్ ఫుడ్ పరిస్థితేమిటి ఆ టైమ్ అవుట్ వాడి జాబితాలో అంటారా..? టాప్ 10 లో కూడా ఒకటి ఉంది… అది ముంబై స్ట్రీట్ ఫుడ్, పెద్ద స్పెషలేమీ కాదు, హైదరాబాదులో కూడా గల్లీకొక బండీ… వడా పావ్, పావ్ భాజీ, భేల్ పూరీ…

అసలు ఇవి ముంబైలోనే తమ ప్రాశస్త్యాన్ని కోల్పోయాయి, ఇతర నగరాల్లో పాపులర్ అయిపోయాయి.., అన్నట్టు ఈ టాప్ 50 జాబితాలో మరో నగరమూ ఉంది, అది మన రాజధాని ఢిల్లీ…
ఇక్కడ గోల్గప్ప, ఛోలే భటూరే, చాట్, కబాబ్ ఫేమస్ అట… గోల్ గప్ప ఈరోజు ప్రతి ఊరికీ పాకిందిగా… ఇక ఢిల్లీ స్పెషాలిటీ ఏముంది..? మరీ కొన్నిచోట్ల అందులో దానిమ్మ గింజలు కూడా వేస్తూ చెడగొట్టేశారు… ఛోటే భటూరే, చాట్ కూడా అన్ని నగరాల స్ట్రీట్ ఫుడ్డే ఇప్పుడు…
జైపూర్ (రాజస్థాన్) మిర్చి బడ గురించి చెప్పుకుంటున్నాం కదా… అక్కడ దాంతోపాటు ప్యాజ్ కచోరీ, లోకల్ జలేబీ ఫేమస్… పొద్దున మనం పూరీలు, బోండాలు లాగించినట్టే అక్కడ జిలేబీతో బ్రేక్ ఫాస్టులు బోలెడు మంది… ప్యాజ్ కచోరీ అంటే అదేదో చాలా ఫేమస్ వెరయిటీ అనుకోకండి… మనకూ హైదరాబాద్ రాజస్థాన్ స్వీట్ హౌజుల్లో దొరికే కచోరీలే, కాస్త ప్యాజ్ తగిలిస్తారు, పానీపూరీలాగే…
ఇదంతా స్ట్రీట్ ఫుడ్ గురించి, అదే టైమ్ అవుట్ వాడు ‘ప్రపంచంలోని టాప్ 20 ఉత్తమ ఆహార నగరాలు’ (World’s Best Cities for Food) జాబితా కూడా రిలీజ్ చేశాడు, అందులో మాత్రం బెంగళూరు 13వ స్థానాన్ని దక్కించుకుంది… ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ నగరం బెంగళూరు కావడం విశేషం…
స్ట్రీట్ ఫుడ్ కంటే కూడా బెంగళూరులోని లెజెండరీ టిఫిన్ రూమ్స్ (Darshinis), మిల్టరీ హోటళ్లు, మైసూర్ మసాలా దోశ, బెన్నే దోశ, బిసిబేలే బాత్, అలాగే సరికొత్త కేఫ్ కల్చర్, ప్లాట్‌ఫారమ్ బ్రూవరీలు, గ్లోబల్ క్యుసినరీ కల్చర్‌కు టైమ్ అవుట్ ఈ గుర్తింపునిచ్చింది… ఏదేమైనా రకరకాల దోశెలకు ఫేమస్ మన హైదరాబాద్ ఈ రెండు జాబితాలలోనూ లేకపోవడం దోశకు ఘోరావమానం..!!
Share this Article