నిజం… కేంద్ర జలశక్తి శాఖకు ఓ సోయి లేదు, ఓ దిశ లేదు… సేమ్, కరోనా మీద కార్యాచరణలాగే… దేవుడా… ఈ ప్రభుత్వానికి పాలన అంటే ఏమిటో తెలియచేయి స్వామీ అని ఆ రాముడిని వేడుకోవడమే..! అంతర్రాష్ట్ర నదీజలాలపై ఈరోజుకూ మోడీ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు అనేది నిజం… ప్రస్తుతం కృష్ణా, గోదావరి బోర్డులకు సర్వాధికారాలు ఇస్తూ గెజిట్ నోటిఫై చేయడం తాజా ఉదాహరణ… అదేమిటి..? అత్యుత్తమ పరిష్కారం కదా అంటారా..? అదెలా..? రాష్ట్రాలను విభజిస్తున్నాం కాబట్టి, రేప్పొద్దున రెండు రాష్ట్రాల నడుమ జలవివాదాలు రావొచ్చు, అందుకని బోర్డులు ఏర్పాటు చేసి, మొత్తం అధికారాలూ వాటి చేతుల్లో పెట్టండి అని విభజన చట్టం చెప్పిందిగా… ఇంకేముంది..? కేవలం ఆ ఒక్క పాయింట్ ఆధారంగా, ఇప్పుడు ఏపీ, తెలంగాణ కీచులాడుకుంటున్నాయి కాబట్టి రెండు బోర్డులకూ సర్వాధికారాలు ఇస్తున్నారు, గుడ్… కొత్త ప్రాజెక్టులు, నీటి విడుదల, విద్యుదుత్పత్తి నుంచి ప్రతి అంశం మీద వాటిదే అధికారం… కేంద్ర బలగాల రక్షణ కూడా ఇస్తారట… డబుల్ గుడ్… కానీ..?
- తెలంగాణ వాటాల్నే పునర్నర్వచించాలని కోరుతోంది… సుప్రీంలో కేసు వేసింది… తరువాత విత్ డ్రా అంటోంది… ఏం లిఖిత హామీ వచ్చిందని వెనక్కిపోతోందో ఎవరికీ తెలియదు, పోనీ, ఇప్పటిదాకా సమర్థవాడకం దిశలో ఏమైనా నిర్మాణాత్మక పనులు చేపట్టిందా, అదీ లేదు… ఊదు కాలింది లేదు, పీరు లేచిందీ లేదు… తెలంగాణ కాగితాలపై చూపిన బోలెడు ప్రాజెక్టులను చూపి ఏపీ గాయిగత్తర చేస్తోంది… మరోవైపు తనే దూకుడుగా సీమ లిఫ్టు, ఆర్డీసీ, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి ప్రాజెక్టులపై వెళ్తోంది… ఇన్నేళ్లూ ఏ సోయి లేని తెలంగాణ ఇప్పుడు రుసరుసలాడుతోంది… రేప్పొద్దున హుజూరాబాద్ ఎన్నిక అయ్యాక మళ్లీ సైలెన్సే…
- ఇప్పటికిప్పుడు బోర్డుకు సర్వాధికారాలు వస్తయ్… పవర్ జనరేషన్, వాటర్ రిలీజ్ అంతా బోర్డుల ఇష్టం… కానీ తెలంగాణ కోరుతున్న వాటాల పునర్విభజన సంగతేమిటి..? అసలు అదేమిటో తేలకుండా ఈ బోర్డుల పెత్తనాలేమిటి..? ఇప్పుడు తెలంగాణ సుప్రీంకు వెళ్తుందేమో, మీరే కదా కొత్త ట్రిబ్యునల్, కొత్తగా వాటా పంపిణీ మీద వేసిన కేసు విత్ డ్రా చేసుకున్నది..? మళ్లీ ఇదేమిటి అని గనుక సుప్రీం అడిగితే తెలంగాణ దగ్గర జవాబు ఏముంది..?
- మా వాదన నెగ్గింది, ఇష్టారాజ్యంగా పవర్ జనరేట్ చేయకుండా తెలంగాణను నియంత్రించగలం అనుకుంటుందేమో ఏపీ… అదీ తప్పే… ఆర్డీఎస్ ఆగుతుంది, సీమ లిఫ్టు ఆగుతుంది… అనుమతుల్లేని పనులన్నీ ఆగుతాయి… ఆయా రాష్ట్రాల నిర్ణయాధికారం కృష్ణాలో పడి కొట్టుకుపోతుంది…
- నిజానికి మోడీ ప్రభుత్వానిదే తప్పు… ఇప్పుడేదో చేతులు దులుపుకుంటున్నది గానీ… నిజంగా చేయాల్సింది ఏమిటి..? రివర్ బేసిన్ అథారిటీలు ఏర్పాటు చేయాలి… పరీవాహకంలోని అన్ని రాష్ట్రాలనూ చేర్చాలి… కేవలం ఏపీ, తెలంగాణ మాత్రమే కాదు… ఇవే కృష్ణా, గోదావరి బోర్డుల్లోకి మహారాష్ట్ర, కర్నాటకలనూ చేర్చాలి… ఆలమట్టి, నారాయణపూర్ తదితర ప్రాజెక్టుల్లో పవర్ జనరేషన్ నుంచి నీటివిడుదల దాకా అన్నీ ఆ అథారిటీల పరిధిలోకి రావాలి… నిజానికి కర్నాటక తలపెట్టిన స్థాయిలో ఆలమట్టి ఎత్తు గనుక పెంచితే ఏపీ, తెలంగాణ రెండూ కలిపి బోరుమని ఏడ్వాలి… అది కదా అసలు సమస్య… బ్రిజేష్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు కర్నాటకకే అనుకూలంగా ఉన్నయ్… ఏపీ, తెలంగాణ ఎప్పుడైనా వాటి మీద సీరియస్‌గా ఉన్నయా..? రెండు రాష్ట్రాల ఖర్మ… అంతే…
- ఇప్పటికే కర్నాటక మేకదాటు వంటి ప్రాజెక్టులపై దూకుడుగా వెళ్తోంది… ఎగువ రాష్ట్రం కాబట్టి, ప్రతి చుక్కనూ నా రాష్ట్ర పరిధిలోనే ఆపేసుకుంటాను అంటోంది… మరి ఏపీ, తెలంగాణలకు బోర్డులు అంటున్నారే సరే, మరి కర్నాటక, తమిళనాడు పరిస్థితి ఏమిటి..? సో, రివర్ బేసిన్ అథారిటీలే అంతిమ శరణ్యం… ఏపీ, తెలంగాణకు ఆ అంతిమ పరిష్కారం మీద దృష్టి లేదు, వీళ్లు పరస్పరం తన్నుకుంటున్నారు… అదీ అసలు సమస్య… కాదు, కాదు… కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగల స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడం… ఎక్కడో, ఇంకేవో కారణాలతో కేంద్ర జలశక్తి శాఖను నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించే స్థితిలో లేకపోవడం..!!
- ఈ రెండు నదుల పరీవాహకమే కాదు, ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులను కూడా ఈ బోర్డుల్లో నియమించకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందా..?
- (ఈ స్టోరీ మీకు నచ్చితే దిగువన code scan చేసి ముచ్చటకు అండగా ఉండండి…)
Share this Article
Ads