.
ప్రదీప్ రావత్..! ఎక్కువగా తెలుగు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరక్టర్లే చేశాడు… చాన్నాళ్లుగా కేన్సర్ పీడితుడు, 74 ఏళ్ల వయస్సులో నిన్న కన్నుమూశాడు… ఆ పేరు వినగానే బుర్ర మీసాలతో రఫ్, రస్టిక్ లుక్కులో ఉన్న తను లేతప్రాయపు టీన్స్ నితిన్‌తో రాజమౌళి తీసిన సై సినిమాయే గుర్తొస్తుంది… అంత ముద్ర వేశాడు తను…
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ తన నేటివ్,, ఢిల్లీలో పుట్టాడు, ఓ సైనిక కుటుంబంలో… తను ఓసారి చావు అంచుల దాకా వెళ్లి, బతికాడు, అదొక్కసారి చెప్పుకుందాం… తరువాత మరికొన్ని విశేషాలు…
Ads
ప్రదీప్ రావత్, వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం ‘మహాసంగ్రామ్ ‘… పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఒక ఓడలో జరుగుతోంది… వినోద్‌ఖన్నా ఇతడిని కొట్టుకుంటూ వచ్చే సన్నివేశంలో ఓడ చివరకు రాగానే ఇతను తప్పించుకోవాలి… కానీ ఇతను ఓడ పైనుండి సముద్రంలో పడిపోయాడు… బాగా ఈత వచ్చు గానీ, స్విమ్మింగ్‌పూల్‌లో కొట్టే ఈత వేరు. నదిలో ఈత వేరు.
ఇవన్నీ సముద్రంలో అస్సలు పనిచేయవు. అలలు ఎగసిపడుతూ ఉంటాయి. కెరటాలు విసిరికొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఓడ గుండ్రంగా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి…
ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజను ఇతడికి తగిలేదే, అది ఘోరంగా దెబ్బ తీసేదే గానీ, అక్కడ ఒక ఇనుప కమ్మీ తన అదృష్టం కొద్దీ ఆసరాగా దొరికింది. ఆ కమ్మీ గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాడు. ఓడ పైకి ఇతడిని లాగడం సాధ్యం కాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు ఇతడి అరుపులు విని ఇతడి దగ్గరకు వచ్చారు.
వెంటనే ఓడ పై నుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబ్స్, తాళ్ళు జాలరులకు ఓడ పై నుంచి అందించారు. వాళ్ళు ఆ తాళ్ళు ఇతడి దగ్గరకు విసిరి సేఫ్టీ ట్యూబ్ కూడా అందించారు. వెంటనే ఆ ట్యూబ్‌లోకి దూరి తాడు పట్టుకున్నాడు. జాలరులు ఎలాగో ఇతడిని లాగి ప్రాణాలు రక్షించారు…

- తను మొదట్లో యూకో బ్యాంకు ఉద్యోగి… నాటకాలు తప్ప సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదు… కానీ అప్పట్లో మెగా హిట్ టీవీ సీరియల్ మహాభారత్‌లో చాన్స్ రావడంతో ఇటువైపు వచ్చేశాడు, అందులో అశ్వత్థామ పాత్ర… పెద్ద విశేషం ఏమిటో తెలుసా, ఆ పాత్రకు తనను రికమెండ్ చేసింది ఎవరో తెలుసా..? మహానటి స్మితా పాటిల్!! తను రాజ్‌బబ్బర్ నాటకసంస్థ ద్వారా ఎన్నో నాటకాల్లో నటించాడు…
1990లో బాఘిచిత్రం సూపర్‌హిట్ కావడంతో ఇతని దశ తిరిగి ఇతడి సినీనట జీవితం గాడిన పడి, ఒక దశలో దర్శకులకు కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేనంత బిజీ అయిపోయాడు… తనకు హిందీలో మంచి పేరు తెచ్చిపెట్టినవి అపరాధి, ఇన్‌సానియత్, దుష్మని, రాజ్‌కుమార్, కోయల, ‘దీవార్’ , షరాబి, లగాన్, గజని చిత్రాలు…
లగాన్ చూశాకే రాజమౌళి తన సై చిత్రంలో చాన్స్ ఇచ్చాడు, ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ! రాజమౌళి మరో చిత్రం ఛత్రపతిలో కూడా తనే విలన్… తను తెలుగులో దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు శీను, లయన్, నాయక్, రగడ, బలదూర్ తదితర చిత్రాలు చేశాడు…

తను పెళ్లిచేసుకున్నది తెలుగు మహిళనే… పేరు కల్యాణి… అదీ 54 ఏళ్ల లేటు వయస్సులో చేసుకున్నాడు… స్టాలిన్ షూటింగ్ సమయంలో చూసి, ఏదో వర్కవుట్ చేశాడు గానీ కుదరలేదు, తరువాత పరిచయం పెరిగి, ప్రణయంగా మారి, చివరకు పెళ్లాడేశాడు..!!
Share this Article