.
( రమణ కొంటికర్ల ) …. కంటెంట్ ఉంటే కటౌట్లక్కర్లేదని నిరూపించిన మరో థ్రిల్లర్!
బిగి సడలకుండా సినిమా చూడాలంటే… తెరకెక్కించేందుకు భారీ బడ్జెట్స్ అవసరం లేదని చెబుతోంది ఈ సినిమా. కేవలం 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తే… 783 శాతం లాభాలతో దూసుకుపోతోంది ఈ క్రైమ్ థ్రిల్లర్. జీ5 ఓటీటీలో వీక్షకుల మనసు దోచుకుంటున్న ఈ సినిమా పేరు సిరాయ్.
Ads
కొన్ని సినిమాలు భారీ బడ్జెట్, అంతకుమించిన ప్రీమియర్ షోస్, అంతకంతకూ హైప్ తీసుకొచ్చే ప్రచారాలతో ఆకాశాన్నంటే అంచనాల మధ్య విడుదలైతాయి. ఆ స్థాయిలో హిట్టయ్యే వాటి సంఖ్య యావరేజ్ గా చూస్తే చాలా తక్కువ. మరికొన్ని ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలోకి, ఓటీటీల్లోకి వచ్చి దుమ్మురేపుతాయి. కథాబలముంటే ఎలాంటి ప్రచారాలు కూడా అక్కర్లేకుండా వర్డ్ ఆఫ్ మౌత్ తో దూసుకుపోతాయి. అలా అందరినీ ఆశ్చర్యపర్చే అండర్ డాగ్ మూవీనే ఈ సిరాయ్.
ఇది తమిళంలో నిర్మించిన ఓ కోర్ట్ రూమ్ డ్రామా. సిరాయ్ అంటే చెరసాల, జైలు అని అర్థం. ఇదో క్రైమ్ థ్రిల్లర్. థియేటర్లలో తక్కువ ప్రచారంతో విడుదలై పెట్టిన పెట్టుబడికి మించి రాబడి సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకాదరణ పొందుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్, కోర్ట్ డ్రామాస్ ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ సిరాయ్.
సిరాయ్ గురించి ఎందుకింత చర్చ..?
2025 డిసెంబర్ లో విడుదలైన ఈ సిరాయ్ లో విక్రమ్ ప్రభు, ఎల్. కే. అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. ప్రచారం అంతకన్నా లేదు. కానీ సస్పెన్స్ తో నిండిన ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ చివరి వరకూ ఉత్కంఠను కొనసాగిస్తుంది. థియేటర్ల నుంచి వెళ్లిపోయినా.. ఓటీటీల్లో కూడా ఇప్పుడు ఈ సినిమా ట్రెండింగ్ లో ఉండటం విశేషం.
గతంలో కూడా బడ్జెట్ తక్కువే అయినా… చాలా క్రైమ్ థ్రిల్లర్స్ స్టార్ పవర్ నుంచి మించి అభిమానులను సంపాదించుకున్నాయి. కంటెంట్ ఉంటే కటౌట్లు అవసరం లేదని నిరూపించిన మరో సినిమా ఇది.
- సిరాయ్ సాధించిన వసూళ్లు కూడా ఓసారి పరిశీలిస్తే ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపర్చేలా నమోదయ్యాయి. పెట్టిన పెట్టుబడి కేవలం 3 కోట్లైతే… బాక్సాఫీస్ వద్ద ముప్పై ఒకటిన్నర కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ సినిమా. ఈ లాభం అంచనా ఓసారి పరిశీలిస్తే పెట్టిన పెట్టుబడి కంటే 783 శాతం ఎక్కువ అని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
క్రిస్ మస్ సెలవుల సమయంలో విడుదలవ్వడం కూడా ఈ సినిమాకు ప్లస్సైంది. తక్కువ నిర్మాణ వ్యయంతో బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన తమిళ సినిమాల్లో ఇప్పుడు ఈ సిరాయ్ కూడా ఒకటి.
మరి సిరాయ్ లో ఏముందని..?
క్రైమ్ సినిమాల విజయం ఊహించని మలుపులున్నప్పుడే సాధ్యం. సిరాయ్ కూడా ఆ కారణంతోనే ప్రశంసలందుకుంది.
కోర్ట్ రూమ్ డ్రామాకు, మిస్టరీని మేళవిస్తూనే.. ఆఖరువరకూ ఉత్కంఠ కొనసాగించిన సినిమా ఇది. భారీ యాక్షన్ సన్నివేశాలవంటివేవీ లేకుండా కథనం.. నటీనటుల ప్రదర్శనతో ఆసక్తి రేకెత్తించే సినిమా. పెద్ద స్టార్స్ కు బదులు కొత్త నటీనటులుండటమే ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.
రెండు గంటలకు పైగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో విభిన్న భాషల్లో అందుబాటులో ఉంది. మంచి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఉంటే భారీ బడ్జెట్స్, ఊదరగొట్టే ప్రచారాలు అవసరమే లేదని మరోసారి భారీ విజయాన్నందుకున్న ఈ సిరాయ్ నిరూపించింది.
Share this Article