Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!

August 7, 2026 by M S R

.

ముందుగా ఓ వార్త చదవండి… ‘‘సృష్టిలో తల్లి ప్రేమను మించింది లేదనడంలో సందేహంలేదు. అందుకే భారతీయ సమాజంలో మాతృ దేవోభవ అని తొలిపీట వేశారు. మానవజాతిలోనే కాదు, సృష్టిలోని ఏ జీవి అయినా సరే, తను కన్న పిల్లల్ని అలాగే ప్రేమిస్తుంది…

సముద్రాల్లో ఆనందంగా తిరుగాడే డాల్ఫిన్లలో కూడా మాతృప్రేమకు తిరుగులేదనే ఘటన గత వారాంతంలో పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగిందని జియోగ్రాఫ్ మెరైన్ పరిశోధకులు గుర్తించారు…. బన్‌బరీ నగరానికి సమీపంలోని లెషెనాల్డ్ ఉప్పుకయ్య (నదీ ముఖద్వారం)లో ఒక ఆడ డాల్ఫిన్ చనిపోయిన తన రెండు వారాల డాల్ఫిన్ కళేబరాన్ని తన వీపుపై వేసుకొని అలాగే తిరుగాడింది.

Ads

డ్రోన్ కెమెరాలో రికార్డైన భావోద్వేగ దృశ్యాలు తన బిడ్డ ప్రాణం పోయినా వదల్లేని మాతృప్రేమను ఈ ఘటన చాటింది. ఫ్రాగిల్ అని పిలువబడే ఈ డాల్ఫిన్… తనకు పుట్టిన రెండు వారాలకే చనిపోయిన తన పిల్ల జీవాన్ని వదల్లేక రోజుల తరబడి నీటిపై మోస్తూ కనిపించింది. శ్వాసకోశ సమస్యల వల్ల ఆ పిల్ల డాల్ఫిన్ చనిపోయినట్లు జియోగ్రాఫ్ మెరైన్ పరిశోధకులు గుర్తించారు. దురదృష్టవశాత్తూ ఈ తల్లి డాల్ఫిన్‌కు ఇది వరుసగా నాలుగో సంతాన నష్టం…

చనిపోయిన బిడ్డను పదే పదే నీటిపైకి నెడుతూ, అది ఈదాలని, ఇంకా బతికే ఉందని తను పడుతున్న ఆరాటం చూసి తీర ప్రాంత ప్రజలు కన్నీరు పెట్టారు… మానవుల తరహాలోనే డాల్ఫిన్లలో కూడా అత్యంత బలమైన సామాజిక బంధాలు ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తీవ్ర దుఃఖంలో ఉన్న ప్రాగిల్‌ను ఒంటరిని చేయకుండా, ఆ జలసంధిలోని తోటి డాల్ఫిన్లతోపాటు సముద్ర తీర ప్రాంతానికి చెందిన ఇతర డాల్ఫిన్లు కూడా వచ్చి దాని చుట్టూ చేరాయి. ఈ క్లిష్ట సమయంలో తల్లి డాల్ఫిన్‌కు మిగతా గుంపు ఎంతగానో మద్దతుగా నిలిచినట్లు డ్రోన్ వీడియోల ద్వారా స్పష్టమైంది…

fragile

సాధారణంగా తిమింగలాలు, డాల్ఫిన్లు తమ గుంపులోని జీవులు చనిపోయినప్పుడు వాటిని రక్షించుకోవడానికి లేదా వాటి మరణాన్ని జీర్ణించుకోలేక ఇలా ప్రవర్తిస్తాయని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. సైన్స్ భాషలో దీనిని పోస్ట్ మార్టమ్ అటెంటివ్ బిహేవియర్ అంటారు. అయితే, ఇలా రోజుల తరబడి శవాన్ని మోయడం వల్ల తల్లి డాల్ఫిన్ సరిగ్గా ఆహారం తీసుకోలేదు….



ఇక్కడ మరికొన్ని విషయాలూ చెప్పుకుందాం… డాల్ఫిన్లు, తిమింగలాలు… ఇవి రెండూ సెటాసియా (Cetacea) అనే సముద్ర క్షీరదాల (Marine Mammals) వర్గానికి చెందినవి… ఇవి చేపల్లా కనిపించినప్పటికీ, జీవశాస్త్రపరంగా ఇవి క్షీరదాలే… నీటిలో నివసించినప్పటికీ, చేపల్లా కాకుండా ఇవి క్షీరదాల లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాయి…

చేపల్లాగా నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను మొప్పల ద్వారా పీల్చుకోలేవు ఇవి. మనుషుల్లాగే ఊపిరితిత్తులతో శ్వాస తీసుకుంటాయి. అందుకే ఇవి తరచూ నీటి ఉపరితలానికి వచ్చి శ్వాసనాళం (Blowhole) ద్వారా గాలిని పీల్చుకుంటాయి…

చేపలు గుడ్లు పెడతాయి, కానీ డాల్ఫిన్లు పిల్లలకు జన్మనిచ్చి, తమ క్షీర గ్రంథుల ద్వారా పాలు తాపి పెంచుతాయి. ఇవి వేడి రక్తపు జీవులు (Warm-blooded).

డాల్ఫిన్ల నాడీ వ్యవస్థ, మెదడు నిర్మాణం మనుషుల్లాగే అత్యంత అభివృద్ధి చెంది ఉంటాయి. సెరిబ్రల్ కార్టెక్స్ (Cerebral Cortex)…: మనుషులలో ఆలోచనలు, జ్ఞాపకశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యానికి కారణమైన ఈ భాగం డాల్ఫిన్లలో కూడా అత్యంత సంక్లిష్టంగా, ముడతలు పడి ఉంటుంది… సేమ్, తిమింగలాల్లో కూడా…

ఆత్మ-స్పృహ (Self-Awareness)…: అద్దంలో తమను తాము గుర్తించుకోగల అరుదైన జీవులలో డాల్ఫిన్లు కూడా ఒకటి. (మనుషులు, ఏనుగులు, చింపాంజీల వలె). ఇవి సంకేతాల ద్వారా సంభాషించుకుంటాయి,  ప్రతి డాల్ఫిన్‌కు ఒక ప్రత్యేకమైన పేరు (Signature Whistle) కూడా ఉంటుంది…

ఉద్వేగాలు (Emotions) ఉంటాయా? ప్రదర్శిస్తాయా? ఖచ్చితంగా ఉంటాయి. డాల్ఫిన్లు చాలా భావోద్వేగ జీవులు.

ప్రేమ, ఆప్యాయత…: ఇవి తమ కుటుంబ సభ్యులతో, తోటి డాల్ఫిన్లతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటాయి. ఒకదానినొకటి ఆప్యాయంగా తాకడం, ఈత కొట్టడం చేస్తుంటాయి. మనుషుల్లాగే ఇవీ సంఘజీవులు…

దుఃఖం (Grief)…: తమ గుంపులో లేదా తోటి డాల్ఫిన్ చనిపోతే, ఆ మృతదేహాన్ని వదిలిపెట్టలేక కొన్ని రోజుల పాటు దానితోటే ఉంటూ తీవ్రమైన విషాదాన్ని, నిరాశను ప్రదర్శించిన సందర్భాలు శాస్త్రవేత్తలు ఎన్నో గుర్తించారు….

ఆనందం, ఆటవిడుపు…: అలల మీద ఎగరడం, నీటిలో గెంతులేయడం, బొమ్మలతో ఆడుకున్నట్లుగా సామూహికంగా ఆటలాడుకోవడం ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తాయి.

సానుభూతి (Empathy)…: ప్రమాదంలో ఉన్న తోటి డాల్ఫిన్లకు లేదా ఇతర సముద్ర జీవులకు, కొన్నిసార్లు మనుషులకు కూడా ఇవి సహాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Algorithmocracy – అల్గారిథం రాజ్యం ! రిథమ్ తప్పిన బానిస మనిషి !
  • అమ్మ ప్రేమ ! మనుషుల్లోలాగే ఉద్వేగాలు – దుఃఖం – వ్యక్తీకరణ !!
  • శకునాలు చెప్పిన తెహల్కా బల్లి కుడితి తొట్టెలో పడింది !!
  • ఇక గుడ్డివాళ్లే ఉండరు ! ఎలన్‌మస్క్ కంపెనీ అద్భుత ఆవిష్కరణ !!
  • నాకెంత? నీకెంత? – కేటీఆర్ చెప్పే లొట్టపీసు కేసులో చాలా పెద్ద కథ !!
  • ఐనవాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!
  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!
  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions