Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నారప్ప..! అనంతపురం యాసను నరికేశాడే… అంతా కృతకమైన భాష…!!

July 17, 2021 by M S R

నారప్ప అనే సినిమా తీశారు కదా, త్వరలో ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు… అందులో వెంకటేష్ హీరో… అసురన్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్… ఇది అందరికీ తెలిసిందే కదా… ట్రెయిలర్ రిలీజ్ చేశారు మొన్న… రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ ఉన్నయ్… సో, నిర్మాతలూ హేపీ… ట్రెయిలర్ చూస్తుంటే సీన్లు బాగానే చిత్రీకరించారనీ, అవసరమైన ఎమోషన్లు, సీన్ల నాణ్యత గురించి దర్శకుడు కాస్త తపించాడనీ తెలుస్తూనే ఉంది… ఎటొచ్చీ భాష విషయంలోనే అసంతృప్తి… మనస్సులు చివుక్కుమనిపించేలా ఉంది… మన తెలుగు నిర్మాతలు, దర్శకులు ఇంకా మారలేదు… మారడం ఇష్టం లేదు… ఒక ప్రాంత మాండలికాన్ని ఒక పాత్రకు ఎంచుకున్నప్పుడు, అందులో విరుపు, సొగసు ముందుగా సదరు నటుడికి అర్థం కావాలి… లేదంటే ఆ యాసను అపహాస్యం చేసినట్టే లెక్క… తెలిసి చేసినా, తెలియక చేసినా… ముందుగా ఒక మిత్రుడి అభిప్రాయం చదవండి…

narappa

మౌ ళి…..  నారప్ప సినిమా రీమేక్ అనంతపురం జిల్లా నేపథ్యంలో తీస్తున్నారని మొదట ప్రకటించారు. కానీ ట్రైలర్ చూస్తే ఆ మాటల్లో ఎక్కడా మా అనంతపురం యాస కనపల్యా…

Ads

ప్రియమణి డైలాగ్: వాడి తల తీసుకొచ్చింటే ఇంకా సంతోషపడేదాన్ని…
మా యాస: వాని తలకాయ తెచ్చింటేగిన ఇంగా బలె ఉంటాండ్య…
వెంకటేష్: మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు. డబ్బులుంటే లాగేసుకుంటారు…
మా యాస: మనకు సేనుంటే(చేను-పొలం) తీసకపోతారు. దుడ్లుంటే గుంచకపోతారు…
మిగిలిన‌ డైలాగులు కూడా అంతే… అసలు “నుంచోవడం” అనే పదమే ఇక్కడ వాడము…
కృతకంగా ఉంది యాస. అట్లాంటప్పుడు రాయలసీమ‌ నేపథ్యం అని చెప్పడం ఎందుకు..? చంపుకోవడానికి, నరుక్కోవడానికి రాయలసీమను సింబాలిక్ గా చూపించడం తప్పు… నారప్ప, శీనప్ప అనే పేర్లు వాడితే సినిమా అనంతపురందేనని మేము నమ్మాల్నా..
అసలు అనంతపురంలో తిండి గురించి వీళ్లకి తెలుసా.. ఎంతసేపూ ఆవకాయ, గోంగూర అంటారు. ఉగ్గాని-బజ్జి కాంబినేషన్‌ ఎప్పుడైనా తిన్నారా…‌ పూతరేకులు, పాలకోవా అంటారు గానీ ఒకసారైనా పాలలోకి ఓళిగ వేసుకొని ఆరగించారా… పనసపొట్డు కూర అంటే లొట్డలేసుకుంటారుగానీ, కాచరకాయలతో వంట చేసుకొని తిన్నారా… అసలు ఉగ్గాని, ఓళిగ, కాచరకాయలపేర్లు ఎప్పుడైనా విన్నారా…
పాంకోవడం, బిరింగ, అవులాయి, బారాకట్ట, జంపు… ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా… ఎప్పుడైనా పల్లెల్లోకి వస్తే తెలుస్తుంది…
రాయలసీమ పేరు చెప్పి రక్తపాతాలు చూపించడం తప్ప ఇక్కడి మంచిని, గొప్పతనాన్ని చూపించడం చేతకాదా…

narappa1

ఇది ఎప్పుడూ ఉన్న విమర్శే కదా… ఉత్తర కోస్తా, రాయలసీమ, తెలంగాణ… తరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ భాషల్ని, ఈ యాసల్ని ఖూనీ చేసింది… సీమ అనగానే రక్తపాతాలు, వేటకొడవళ్లు, నాటుబాంబులు… ఉత్తర కోస్తా అనగానే పనిమనుషులు… తెలంగాణ అనగానే ఆకురౌడీలు, లేదా కమెడియన్లు… ఇక ఆ పాత్రలు పోషించే నటీనటులు వాడే అత్యంత కృతకమైన భాష… డైలాగ్ రైటర్లకు ఆయా మాండలికాలు ఏమీ తెలియవు… కోట్లకుకోట్లు ఖర్చుపెడతారు కదా సినిమా నిర్మాణానికి… ఆయా ప్రాంతాల యాస తెలిసిన ఎవరైనా రైటర్లతో రాయించుకోవచ్చు కదా… పోనీ, నటీనటులకు ఈ యాస పలకడం చేతకాదనుకుందాం, డబ్బింగ్ పెట్టొచ్చు కదా… మళ్లీ ఇక్కడ ఇగో సమస్య… అన్నింటికీ మించి, మనమెలా తీసినా చూస్తారులే అనే ఓ తేలికతనం… తెలంగాణ వచ్చాక కాస్త తెలంగాణ భాష పట్ల, తెలంగాణ పాత్రల పట్ల జాగ్రత్త కనబడుతోంది… కొంచెమే… కానీ సీమ, ఉత్తరకోస్తా సంస్కృతి, భాషల మీద మునుపటి వివక్ష, కించపరిచే ధోరణి అలాగే కొనసాగుతోంది… సాగుతూనే ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions