ఏదైనా కమర్షియల్ రాకెట్ ప్రయోగించినా సరే… ఇస్రోకు మంచి కవరేజీ ఇస్తుంది మన మీడియా… గుడ్… రోజూ చదివే వేల క్షుద్ర వార్తలతో పోలిస్తే మేలు… కానీ మొన్న బుధవారం ఒక ప్రయోగం జరిగింది కానీ మీడియాకు పెద్దగా పట్టలేదు, ఎందుకో మరి… నిజానికి దానికి ప్రాధాన్యం ఉంది… ప్రపంచమంతా స్పేస్ టూరిజం గురించి, స్పేస్ రీసెర్చుల గురించి మాట్లాడుకుంటోంది ఇప్పుడు… మొన్న బ్రాన్సన్ స్పేస్ ప్రయాణం, త్వరలో జెఫ్ బోజెస్ ప్రయాణం… అసలు మనం ఎక్కడున్నాం..? ఈ ఆస్ట్రోనాట్ల విషయంలో ఇండియా సాధించింది ఎంత..? 1961లో రష్యాకు చెందిన తొలి వ్యోమగామి యూరీ గగారిన్ అంతరిక్షానికి వెళ్లాడు… 60 ఏళ్లయింది, ఇండియా సంగతేమిటి మరి..? సొంతంగా ఎవరినైనా ఆస్ట్రోనాట్‌ను పంపిందా..? స్పేస్‌లోకి వెళ్లి, తిరిగి భూమికి క్షేమంగా వచ్చే స్పేస్ క్యాప్సూల్ తయారు చేసుకోగలిగిందా..? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు సమాధానం… లేదు…!
అప్పుడెప్పుడో రాకేష్ శర్మ అనే వ్యోమగామిని రష్యా ఖగోళవాహనంలో పంపించాం… అంతే… సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా నాసా ఉత్పత్తులు… బండ్ల శిరీష ఓ ప్రైవేటు ఆస్ట్రోటూరిస్టు… కాబోయే ఆస్ట్రోనాట్ చారి కూడా నాసా ఉత్పత్తే… మనం చప్పట్లు చరచాల్సిందే తప్ప మన ఓన్ కాదు… ఇస్రో అంతరిక్ష ఘనవిజయాలు అని ఎప్పటికప్పుడు రాసుకుంటున్నాం తప్ప ప్రపంచ ఖగోళ కమ్యూనిటీ కోణంలో చూస్తే ఇస్రో విజయాలు మరీ కాలర్లు ఎగరేసే రేంజ్ కాదు… ఆమధ్య మోడీ ప్రకటించాడు, వ్యోమగాముల్ని మనమే పంపించి, క్షేమంగా తీసుకురాగల ప్రాజెక్టు చేపడుతున్నట్టు…! 10 వేల కోట్లు అన్నారు… గగన్‌యాన్ అని పేరు కూడా పెట్టారు… రకరకాల కారణాలతో కుంటినడక నడుస్తోంది… ఆ ప్రయోగాలకు కావల్సిన ఇంజన్‌ను మూడోదఫా పరీక్షించింది ఇస్రో మొన్న… అదీ వార్త… లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజన్ అది… పేరు వికాస్… 240 సెకండ్లు మండించి, ఆశించినట్టే పనిచేస్తుందంటూ సైంటిస్టులు సంతృప్తిని వ్యక్తపరిచారు…
Ads
https://twitter.com/isro/status/1415312724876095492
మరి వ్యోమగాములు..? అప్పుడే కాదు… చాలా టైముంది… ముందుగా ఒక మరబొమ్మను పంపించబోతున్నాం… నిజమే… వ్యోమగాముల్ని పంపించడానికి ముందు ‘‘మనుషుల్లేని క్యాప్సూళ్లు’’ రెండుసార్లు పంపిస్తాం… సక్సెసయ్యాక నలుగురు వ్యోమగాముల్ని పంపిస్తాం… ఆ మరబొమ్మ ‘హాఫ్ హ్యూమనాయిడ్’ పేరు తెలుసా..? వ్యోమమిత్ర…! ఓ రోబో… మహిళరూపం… ఈ వివరాల్ని కూడా ఇస్రో వెల్లడించి ఏడాదిన్నర దాటింది…
ఇవన్నీ సరే… ఆ నలుగురు వ్యోమగాములు ఎవరు..? (చివరలో ముగ్గురు లేదా ఇద్దరే ఉండవచ్చు అనే వార్తలూ వచ్చాయ్)… భద్రత కారణాల రీత్యా ఇస్రో బయటికి వెల్లడించడం లేదు వాళ్ల పేర్లు… నిజానికి నాసా వంటి ఖగోళ సంస్థలు శిక్షణలో ఉన్నప్పుడే ఆస్ట్రోనాట్ల అన్ని వివరాలూ చెబుతాయి… మనవాళ్లు ఏమిటో మరి..?! మన ఎయిర్‌ఫోర్స్‌కే చెందిన 25 మందిని ఎంపిక చేసి, ప్రాథమిక దశలో శిక్షణ, పరీక్షలు పూర్తిచేసి, చివరగా నలుగురిని వడబోశారు… వారికి రష్యా స్పేస్ రీసెర్చ్ సంస్థ Roscosmos లో శిక్షణ ఇస్తున్నారు… దాదాపు అయిపోయింది… వాళ్లకు ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ పరిశోధన సంస్థ cnes లో కూడా శిక్షణ ఇస్తారు… వారిలో ఒక్కరి పేరు మాత్రం వెల్లడైంది… అదీ ఇస్రో చెప్పలేదు… ఒడిశా పొలిటిషియన్స్ బయటపెట్టారు… తన పేరు నిఖిల్ రాత్…
ఈయన బాలంగీర్‌కు చెందిన ఓ సీనియర్ లాయర్ అశోక్ రాత్ కొడుకు… తల్లి కుసుమ్ రాత్, వుమెన్ కమిషన్ సభ్యురాలు… నిఖిల్ రాత్ 2003లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు… రాత్ పెదనాన్న సీఆర్పీఎఫ్లో పనిచేస్తూ మిజోరంలో మరణించాడు… మిగతా ముగ్గురు కూడా సేఫ్‌గా ఉన్నారని ఆమధ్య రస్కోస్మాస్ ప్రకటించింది… నిజానికి ఇప్పటివరకు ఎందరు వ్యోమగాములు స్పేస్‌లోకి వెళ్లారో తెలుసా..,? 553 మంది..! మొత్తం 37 దేశాలకు చెందినవాళ్లు… అంతరిక్షంలో 1998లో అంతర్జాతీయ ఖగోళ కేంద్రం ఏర్పాటైంది కదా… వచ్చీపోయే వ్యోమగాములకు అదే అడ్డా… ఇప్పటికీ స్పేస్‌లో పది మంది వ్యోమగాములు ఉన్నారు… ఇన్నేళ్లలో రోదసిలోనే మరణించినవారి సంఖ్య మూడు… ఈ చరిత్రలో మన ఇండియన్స్ పేర్లు ఎప్పుడు ఎక్కుతాయో…!! ఇంకా మనవాళ్లు ఎగరలేదు గానీ, ఓ సంకరనామం మాత్రం పెట్టేశారు… రష్యా కాస్మోనాట్స్ అంటుంది, అమెరికా సహా ఇతర దేశాలు ఆస్ట్రోనాట్స్ అంటాయి… మనమేమో వ్యోమనాట్స్ అంటాం… వ్యోమ సంస్కృతపదం, అంటే అంతరిక్షం అని అర్థం… నాట్స్ ఆంగ్లం… రెండూ కలిస్తే వ్యోమనాట్స్… నాటీ పేరు కదా…!! అవునూ, గగనయాన్ బదులు వ్యోమయాన్ అని పేరు ఎందుకు పెట్టలేదు ఈ ప్రాజెక్టుకు..?! (ఎన్నెన్నో రెఫరెన్సులు జల్లెడ పడితే గానీ ఇలాంటి స్టోరీలు రావు… సో, ఈ స్టోరీ నచ్చితే దిగువన ఉన్న కోడ్ స్కాన్ చేసి ముచ్చటకు అండగా నిలవండి)…
Share this Article