Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!

August 13, 2026 by M S R

.

గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు!
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్!
ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరీ అయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది.

ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Rc.No.Spl/Ser.IV/2026, తేదీ: 11-08-2026 జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ, చర్యలు తీసుకోవడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు పాలనా వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫండమెంటల్ రూల్స్, లీవ్ రూల్స్, సీసీఏ రూల్స్, 1991 ప్రకారం ఇకపై అనధికారిక గైర్హాజరీ టీచర్లపై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి.

Ads

ఉత్తర్వులో ముఖ్యాంశాలు:

సెలవు గరిష్ట పరిమితి: ఏ ప్రభుత్వ ఉద్యోగికీ వరుసగా 5 సంవత్సరాలకు మించి ఎలాంటి సెలవు మంజూరు చేయరు.

డైస్ నాన్: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఆ కాలాన్ని ‘డైస్ నాన్’గా పరిగణిస్తారు. దీనివల్ల వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఉద్యోగం నుంచి తొలగింపు: వరుసగా ఒక సంవత్సరం పాటు అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే, సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ జరిపి ఏకంగా ఉద్యోగం నుంచే తొలగిస్తారు.

రాజీనామాగా పరిగణన: అనుమతి లేకుండా ఏడాదికి పైగా గైర్హాజరైనా, లేదా సెలవుతో/ సెలవు లేకుండా వరుసగా 5 ఏళ్లు విధులకు దూరంగా ఉన్నా, సదరు ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే భావిస్తారు.

క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు!

వెంటనే చర్యలు: ఉద్యోగి అనధికారికంగా గైర్హాజరైనట్లు తెలిసిన వెంటనే హాజరు రిజిస్టర్‌లో నమోదు చేసి, గైర్హాజరీకి గల కారణాలను వివరించాలని షో కాజ్ నోటీసు జారీ చేయాలి.

వేచి చూడాల్సిన పనిలేదు: క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడానికి గైర్హాజరీకి నిర్దిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఒక రోజు గైర్హాజరైనా సరే, తక్షణమే విచారణ ప్రారంభించవచ్చు.

రిజిస్టర్ నిర్వహణ: ఎంఈఓ, డీఈఓ, ఆర్‌జెడి కార్యాలయాల్లో గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు, వారిపై తీసుకున్న చర్యలతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి.

పకడ్బందీ పర్యవేక్షణ: హెడ్మాస్టర్లు, ఎంఈఓలు, డిఈఓలు, ఆర్జేడీలు గైర్హాజరీ ఉపాధ్యాయుల వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించాలి. చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైతే ఇకపై పర్యవేక్షణ అధికారులనే వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తారు.

టీచర్లూ… బహుపరాక్!
ఈ నిబంధనలన్నీ ఇప్పటికే ఉన్నాయి. అయితే, పాఠశాల విద్యాశాఖ వాటన్నిటిని క్రోడీకరించి పూర్తి స్పష్టతతో ఇచ్చిన ఉత్తర్వు ఇది. ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా నోటీస్ జారీ చేయాలనే తాజా ఉత్తర్వులో పేర్కొన్న చాలా సీరియస్ పాయింట్‌తో మాత్రం కొత్తది. ఈ ఉత్తర్వులతో అనుమతి పొందకుండా ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. కాబట్టి, విద్యాశాఖ జారీ చేసిన ఈ తాజా మార్గదర్శకాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఇతర సిబ్బందికి స్పష్టమైన హెచ్చరిక. కేవలం వాట్సాప్‌లోనో, ఉత్తరం రాసి పంపడమో లేదా ఒక లీవ్ లెటర్ టేబుల్‌పై పడేసి విధులకు దూరంగా ఉంటామంటే ఇకపై కుదరదు.

అధికారికంగా లీవ్ మంజూరు పత్రం పొందితేనే అది చట్టబద్ధమైన సెలవుగా మారుతుంది. లీవ్ లెటర్ ఇచ్చాం కదా అనే ధీమాతో విధులకు గైర్హాజరైతే అది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడి, ఉద్యోగానికే ముప్పు తెచ్చిపెడుతుంది. ఆబ్సెంట్ ‘డైస్ నాన్’గా మారితే ఇంక్రిమెంట్లు, పెన్షన్ సెలవులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఒక్క రోజు గైర్హాజరీపై కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే విచారణ జరపాలనే నిబంధన ఉన్నందున, ప్రతి ఒక్కరూ సెలవు పెట్టె ముందు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. స్వల్ప నిర్లక్ష్యం కూడా ఉద్యోగానికే ఎసరు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండడమే శ్రేయస్కరం!
-మానేటి ప్రతాపరెడ్డి.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ దరిద్రుడు, నరకం చూపించాడు ! అనుపమ వేదనాగీతం !!
  • ప్రకాష్‌రాజ్ నిర్మాతగా ఓ నాసి మూవీ – బాలచందర్ పరువూ గల్లంతు !!
  • అడాప్టివ్ టెస్టింగ్ ! నీట్- పోటీ పరీక్షల అక్రమాలకు రియల్ చెక్ !!
  • PTG Colony – అరకు ​హైవే మెరిసింది… కనీస గౌరవం మరిచింది!
  • చంద్రముఖి ! హీరోలు, భాషలు మారేకొద్దీ అష్టవంకర్లు పోయిన అసలు కథ !
  • గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు! ఉత్తర్వులు జారీ!
  • ఆయన కేరళలోని గంగ… ఈయన ఇక్కడే కిమ్స్… ఏమిటీ తేడా..?!
  • ఇది మరో తండ్రి శవం కథ..! అనుబంధం- ఆత్మీయత అంతా ఒక బూటకం !!
  • FCRA – అసలు ఏమిటి ఈ నియంత్రణ చట్టం ? ఎందుకోసం ?
  • హీరోతో హీరోయిన్ రొమాన్స్ – కెమిస్ట్రీ – ఇదే మీడియా ప్రయారిటీ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions