మంగ్లీ..! తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు… ఆమధ్య ‘సారంగదరియా’ పాటతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… తన గొంతులో ఏదో మాయ ఉంది… మనల్ని మైమరిపించే ఏదో మత్తుంది… అది ఆమెకు దేవుడిచ్చిన వరం… ఈమధ్య ఏదో బోనాల పాట పాడింది… యూబ్యూటులో చూస్తే 43 లక్షల దాకా వ్యూస్ ఉన్నయ్… మామూలు విషయం కాదు… కానీ అకస్మాత్తుగా ఓ వివాదం… ఆమె మీద… ఏమనీ అంటే… ‘‘ఆమె రాయలసీమ బిడ్డ, తెలంగాణతనం తెలియదు, గ్రామీణదేవతలనూ వదల్లేదు కొందరు హిందూ ద్వేషులు.., మోతువారి, చెట్టు కింద కూసుని చోద్యం చూస్తున్నవ్ అంటూ దేవతను కించపరిచారు’’……… ఇదీ ఆరోపణ…! ఇక్కడ మనం రెండుమూడు కోణాల్లో ఇష్యూను చూడాలి… తప్పనిసరిగా… హిందూసమాజానికి అత్యంత అవసరం… తోచినట్టు తిట్టేయడం కాదు, ఎవరిని తిడుతున్నాం, ఎందుకు తిడుతున్నాం, తిట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి..? హిందుత్వకు నష్టం చేస్తున్నామా..? మంచి చేస్తున్నామా..? ప్రతిదీ కెలకడం వల్ల సీరియస్ ఇష్యూస్‌కు జరిగే నష్టం ఏమిటి..?
ఎస్, మంగ్లీ ఇంత పాపులర్ గాకమునుపు… వీ6లో పనిచేస్తున్నప్పుడు నాకు స్వల్ప పరిచయం… ఆమె ఓ పాటల పిచ్చిది… నోటికొచ్చినట్టు కూయడం కాదు, ఆమె ట్రెయిన్డ్… శ్రావ్యమైన గొంతు… అన్నింటికీ మించి, తను పుట్టింది రాయలసీమలోనే అయినా… బంజారా గుడిసెల్లోనే అయినా… తెలంగాణతనాన్ని ఆవాహన చేసుకుంది, ఓన్ చేసుకుంది… కొన్ని సినిమా చాన్సులొచ్చినయ్, ఏవో తిప్పలు పడింది… అవి క్లిక్కయినయ్… మంచి పాపులారిటీ వచ్చింది… మంచిదే కదా, తెలంగాణను తనదిగా భావించిన ఓ ఔత్సాహిక గాయనిని ప్రోత్సహించాలి కదా… తెలంగాణ సమాజం కూడా ఆమెను తమ బిడ్డగా అక్కున చేర్చుకోవాలి కదా… ఆమె ఇతర మతస్థురాలు కాదు, ఒకవేళ ఐనా తప్పులేదు… మరి ఎందుకు ఈమధ్య కొందరు ఆమెను హిందూ ద్వేషిగా ముద్రవేస్తున్నారు..? దాంతో వచ్చేదేమిటి..? హిందూ ఒరిజినల్ అడాప్టబులిటీ కేరక్టర్‌కు భిన్నం కాదా ఇది..?
Ads
https://www.youtube.com/watch?v=kGfkL50mz5A
ఆ పాటంతా చూశాను… ఎస్, ఆమె అమ్మవారిని నిందిస్తున్నది… మంచిదే కదా… హిందూ ప్రార్థనాగీతాల్లో ఉత్కృష్టమైనది నిందా స్తుతి… పైగా ఆ పాటలో వాడిన మోతువారి… ఒరిజినల్ పదం మోతుబరి… తిట్టు కాదు… పెద్దమనిషి అని..! మరి మంగ్లీ చేసిన తప్పేమిటి..? ఆమె సింగర్, పాడుతూనే ఆడుతుంది… అదొక ప్యాషన్ ఆమెకు… మంచిదేగా… సరే, ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాను… నిజానికి ఆ పాట ఇప్పటిది కాదు… ఓసారి దిగువన ఓ ఫోటో చూడండి… 2008లో రిలీజైన పాట ఇది… రచయిత రాంస్వామి… పాడింది కాసర్ల శ్యాం… ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న సినిమా పాటగాడు… ప్యూర్ ఓరుగల్లు బిడ్డ… తెలంగాణ సంస్కృతికి అడ్డా అది… తనకు తెలియదా ఆ పాటలో వైశిష్ఠ్యం ఏమిటో…
మంగ్లీ ఒక సింగర్… ఆమెకు పాట తప్ప మరో లోకం తెలియదు… పాడుతుంది, ఆడుతుంది… ఎన్నో ఏళ్లుగా ఏ గుర్తింపుకీ నోచక టీవీ స్టూడియోల్లో పిచ్చి ప్రోగ్రాములు చేసుకుంటూ బతికింది… మన బంజారా మహిళే… బంజారేతర సంస్కృతులనూ ఓన్ చేసుకున్నదే… మరి ఆమెను హిందూ సమాజం ఓన్ చేసుకోవాలా..? తిరస్కరించాలా..? చిన్న చిన్న ఇష్యూస్ మీద హిందూ సమాజం తన శక్తియుక్తులను వృథా చేసుకుంటే, కీలకమైన అనేక ఇష్యూస్ డైల్యూట్ అయిపోవా..? తప్పు ఉంటే తప్పనే అనాలి, కానీ లేనివి తప్పులుగా ముద్రవేసి వేధించడం వల్ల, అదీ హిందూ మహిళనే వేధిస్తే వచ్చేదేమిటి..? బంజారాలు హిందువులే… ఆమె అవిశ్వాసి కాదు… ఆమె వీడియోకు సహకరించినవాళ్లు, ఇతర మతస్తులు కూడా నాస్తికులేమీ కాదు… హిందూ దేవుళ్లను కించపరచాలనే ఆలోచన ఉన్నవాళ్లు కూడా కాదు… ఇప్పుడు మంగ్లీ మీద నోళ్లుపారేసుకునేవాళ్లకు ఆ సోయి ఉందా….!! ఈ పాట రాసిన రాంస్వామి చాలా గొప్ప రచయిత… ఆయన పాటల్లోని వైరాగ్యం తెలియని వాళ్లు ఏదేదో నోరుపారేసుకోవద్దు…!! (ఎక్కడ జాతర జరిగినా మాయదారి మైసమ్మా అనే పాట డీజే వేసి ఎగుర్తారు… అది ఏం పాటో తెలుసా ఎగిరేవాళ్లకు..? అందుకే కొంత సంయమనం అవసరం అనేది)
ఆమె సీమ బిడ్డయితేనేం..? తెలంగాణ బిడ్డయితేనేం..? నిఖార్సయిన ఓ హిందూ బంజారా యువతి… ఆమె తప్పు లేనప్పుడు, ఆమె పనిలో తప్పులేనప్పుడు… చేతనైతే అభినందిద్దాం… తప్పులేదు… అడ్డుపడటమే తప్పు…!! ఆమె శివుడి మీద ఒక పాట కోసం కాశికి వెళ్ళింది… ఆ విశ్వనాథుడి ఎదుట సాష్టాంగంగా సాగిలపడింది… మొన్నటికి మొన్న ఆదిగురువు దగ్గరకు వెళ్లి పాటపాడింది… అంతేకాదు, మీకెవరికీ తెలియని విషయం… ఆమె 35, 40 లక్షలు పెట్టి సొంతంగా హనుమంతుడి గుడి కట్టించుకుంది… సరిపోయిందా…? ఏడ్వకండి… భుజం తట్టండి… (ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే దిగువన డొనేట్ బటన్ దగ్గరకు వెళ్లి ముచ్చటకు అండగా నిలవండి…)
Share this Article