Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!

August 18, 2026 by M S R

.

నవ్వే వాడి ఎదుట, తిట్టేవాడి ఎదుట, అకారణంగా బురద గుమ్మరించేవాడి ఎదుట… జారిపడ్డట్టు..!! అవును, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరు నానాటికీ తీసికట్టు అన్నట్టుగా… ప్రత్యేకించి రెవిన్యూ మంత్రిత్వ శాఖ, అనగా పొంగులేటి పనితీరు, వ్యవహారశైలి కాంగ్రెస్ పార్టీకి తలవంపులు తీసుకొస్తోంది… నిష్ఠురనిజం…

22 ఏ… అనగా నిషేధిత జాబితా… అసలే రియల్ ఎస్టేట్ కుదేలు విశ్వనగరంలో… దానికితోడు వేలాది మంది సొంత ఆస్తులపై ఈ నిషేధాలు… లావాదేవీలు లేవు, పట్టించుకునేవాడు లేడు, అసలు ఎవడు జవాబుదారీయో తెలియదు… అసలే అడ్డగోలు అవినీతికి అడ్డాలు రిజిస్ట్రేషన్, రెవిన్యూ శాఖలు… దానికితోడు అడ్డదిడ్డంగా ప్రైవేటు ఆస్తుల్ని కూడా నిషేధ జాబితాలోకి చేర్చి చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…

Ads

చివరకు… ఎహెహె, సీఎం ఇల్లు కూడా నిషేధ జాబితాలో ఉంది అని ఆ హరీశ్ రావు కూడా వెక్కిరిస్తున్నాడు… ఎందుకూ కొరగాని కాగితం నమస్తే తెలంగాణ కూడా ఇష్టారాజ్యంగా రాస్తూ, కూస్తూ వెక్కిరిస్తోంది… వేలాది ఎకరాల్ని అస్మదీయుల కోసం, అక్రమాల కోసం ధరణి పోర్టల్‌లో తప్పుడు లిస్టుల జాబితాల్లో చేర్చి, ఉసురుపోసుకున్న దుస్థితిలో… అవన్నీ సరిదిద్దుతామని భూభారతి తీసుకొస్తున్న క్రమంలో… ధరణే బెటర్ అని సూత్రీకరిస్తోంది ఈ గులాబీ క్యాంపు… లక్ష కోట్ల సమస్య అని గాలిలో లెక్కలేస్తోంది… నగుబాటు..!!

ఇదీ గాడినపడదు, పైగా 22ఏ పేరిట వేలాది మందిపై పిడుగు..! కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు… చివరకు సంబంధిత మంత్రి తెలంగాణ సమాజానికి, ప్రత్యేకించి వేలాది మంది బాధితులుగా ఉన్న విశ్వనగరవాసులకు క్షమాపణ చెప్పడం అంటే… ఖచ్చితంగా అది స్వీయ అభిశంసన..!!!

చివరకు కోర్టు కూడా అసలు ఈ నిషేధ జాబితాను నెట్‌లో ఎందుకు పెట్టలేదు అనడుగుతోంది… కేసీయార్ హయాంలో చోటుచేసుకున్న అనేకానేక లక్షల కోట్ల అక్రమాల్ని దిద్దుతూ… లక్షల కోట్ల అప్పుల్ని చెల్లిస్తూ… ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, స్వచ్ఛమైన క్యూర్, నీటివనరుల పునరుద్ధరణ, కాలుష్య పరిశ్రమల తరలింపు వంటి ఎన్నో యూనిక్ అడుగుల వైపు వెళ్తూ.,. ఈ 22ఏ మరకలు ఏమిటి..?

నిజానికి ఈ 22ఏ కష్టాల తాజావేమీ కావు, చాన్నాళ్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి… చివరకు స్లాట్ బుక్ చేసుకుని, స్టాంప్ డ్యూటీలు కట్టాక, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోలేవు అంటే… ఎవడూ అమ్మలేడు, కొనలేడు, కట్టిన డబ్బు వాపస్ రాదు… ఇదొక నరకం… రేవంత్ టీమ్‌లో ఉన్న ఉన్నతాధికారులు, మంత్రులు నిజంగా  పని చేస్తున్నారా..? ఇంకా మా గులాబీ ప్రభుత్వమే ఉందనే ఫీలింగుతో ఉన్నారా..?

ప్రత్యేకించి విశ్వనగరం పరిధిలోకి వచ్చే మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో ఇదొక విషమ సమస్య ఇది… సరే, పొంగులేటికి చేతకావడం లేదు, సారీతో సరి అంటున్నాడు… ఏదో హైలెవల్ కమిటీ అంటున్నాడు గానీ ఆ కమిటీలతో ఒరిగేదేమిటో అందరికీ తెలుసు… బట్, సీఎం స్వయంగా రంగంలోకి దిగాలి కదా… కొరడా పట్టుకుని దిద్దుబాటుకు దిగాలి కదా… ఈ మరకలతో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్తారా..?

22a

అసలేంటీ ’22A’ కథ…

సాధారణంగా ప్రజల మధ్య జరిగే ఆస్తి లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదు. కానీ, కొన్ని భూములు మాత్రం అత్యంత సున్నితమైనవి. ప్రభుత్వం చేతిలో ఉండాల్సినవి లేదా వివాదాల్లో నలుగుతున్నవి. ఇలాంటి ఆస్తులను ఎవరూ ఇష్టానుసారంగా విక్రయించకుండా, అన్యాక్రాంతం కాకుండా 1908 నాటి భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం ఒక అస్త్రం ఇచ్చింది. అదే సెక్షన్ 22A…

ఈ సెక్షన్ కింద ప్రభుత్వం ఏయే భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదో స్పష్టమైన జాబితా (POB List) తయారుచేస్తుంది…

* సర్కారు పోరంబోకు భూములు, పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు

* మున్సిపాలిటీలు, ప్రభుత్వ సంస్థల స్థలాలు

* దేవాదాయ (ఆలయాలు),  వక్ఫ్ బోర్డు ఆస్తులు

* అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) మిగులు భూములు, అటవీ స్థలాలు

* గిరిజన ప్రాంతాల రక్షణ కోసం తెచ్చిన 1/70 చట్టం (Regulation 1 of 1970) పరిధిలోని ఏజెన్సీ భూములు

* కోర్టుల స్టే ఉన్న వివాదాస్పద ఆస్తులు

ఈ జాబితాలో ఏ సర్వే నంబర్ అయితే ఉంటుందో, ఆ భూమిని ఏ ఒక్కరూ కొనుగోలు చేయడానికి లేదా రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్‌రిజిస్ట్రార్లు అంగీకరించరు.

22a

సమస్య ఎంత పెద్దది? కారణం ఏంటి?

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే సుమారు 93 లక్షల ఎకరాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నట్లు అంచనా. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే 50 శాతానికి పైగా సమస్య కేంద్రీకృతమై ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట్ వంటి ప్రముఖ ప్రాంతాల్లోని వందలాది ఆస్తులు ఈ జాబితాలో చిక్కుకున్నాయి…

చట్టం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, గతంలో రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్ చేసే క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన జరగలేదు. అధికారుల యాంత్రికమైన లోపాల వల్ల అసలైన ముప్పు వచ్చిపడింది. గుడ్డిగా పెద్ద పెద్ద సర్వే నెంబర్లను యథాతథంగా అప్‌లోడ్ చేశారు…

బాధితులు ఏం చేయాలి?

మీ ఆస్తి నిజంగానే 22A లిస్టులో ఉందో లేదో తెలుసుకోవడానికి [తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్](https://registration.telangana.gov.in/) ద్వారా సర్వే నంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఈ 22A డేటా “రివ్యూ కింద” కొనసాగుతోంది. ఒకవేళ పొరపాటున ఆ జాబితాలో పడి ఉంటే, మీ దగ్గరున్న పాత సేల్ డీడ్స్, లింక్ డాక్యుమెంట్స్, నిర్మాణ అనుమతుల పత్రాలతో పాటు స్థానిక కలెక్టర్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది…

ఇదొక ప్రయాస… అధికారగణం చేసిన తప్పిదాలకు ప్రజలు చెల్లించే మూల్యం… వ్యయం, తిరగడం, తలనొప్పి, చిక్కులు… పొంగులేటితో ఇవి చక్కబడవు గానీ, సీఎం కొరడా పట్టుకుంటే గానీ సమస్య తెగదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?
  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions