ఏదేని రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా సరే, నేషనల్ మీడియాకు సరిగ్గా ఆనదు… అదే ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ చిన్న ఇష్యూను కూడా పది భూతద్దాలు పెట్టి మరీ చూపిస్తుంది… పెగసాస్ గురించి దివైర్ న్యూస్ సైట్, ఇతర మీడియా ఉమ్మడిగా చేస్తున్న హంగామా అలాగే అనిపిస్తోంది… పెగసాస్ కథేమిటీ అంటారా..? అది ఇజ్రాయిల్‌లో NSO అనే సంస్థ రూపొందించిన ఒక టూల్… లేదా స్పైవేర్… దాని ఆధారంగా ఎంత సెక్యూర్డ్ ఫోన్ అయినా సరే హ్యాక్ చేసేయొచ్చు… కాల్ డేటా సేకరించడమే కాదు, అవసరమైతే ఆ ఫోన్ కెమెరాను, మైక్రోఫోన్‌ను కూడా హ్యాండిల్ చేయొచ్చు, రికార్డు చేయొచ్చు… సదరు ఫోన్ ఓనర్ ఎటెటు తిరిగాడో కూడా ట్రాక్ చేయొచ్చు… మా ఎన్క్రిప్టెడ్ సంభాషణల్ని, చాటింగును ఎవడూ ట్యాప్ చేయలేరు అని వాట్సప్ గొప్పగా చెబుతుంది కదా… దాన్ని కూడా బ్రేక్ చేయగలదు ఈ స్పైవేర్… ఇప్పుడు వివాదం ఏమిటయ్యా అంటే… సదరు NSO డేటాబేస్ దొరికినట్టుంది… దాని ప్రకారం ఎవరెవరి నంబర్లను హ్యాక్ చేశారో మీడియా సంస్థలు తవ్వుతున్నయ్… ఖచ్చితంగా మంచి పరిశోధన కథనాలే… ప్రొఫెషనలే…
జర్నలిస్టులు, విపక్షనేతలు, మంత్రులు, రాజ్యాంగపదవుల్లో ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఆందోళనకారులు గట్రా వందల మందిపై ప్రభుత్వం ఈ నిఘాను కొనసాగిస్తున్నదనేది తాజా వార్తల సారాంశం… ఆ జర్నలిస్టుల పేర్లను కూడా బయటపెట్టినట్టున్నారు… ఇక దశలవారీగా తమ దగ్గర ఉన్న డేటాబేస్ తవ్వుతూ, ప్రభుత్వ నిఘాకు గురవుతున్న పేర్లను వెల్లడిస్తామని మీడియా చెబుతోంది… సుప్రీంకోర్టులో కేసు వేస్తానని అప్పుడే సుబ్రహ్మణ్యస్వామి చెబుతున్నాడు… ఒక్కొక్క నాయకుడే గళం విప్పుతున్నారు… కేంద్రం ఠాట్, అదేమీ లేదుపో అనేసింది… సహజమే కదా… నిజానికి మన చట్టాల ప్రకారం ఫోన్ ట్యాపింగే నేరం… ఇక ఫోన్ హ్యాక్ చేయడం ప్రజల ప్రైవసీకి గొడ్డలిపెట్టు… అయితే మనం ఇంకాస్త రియాలిటీలోకి వెళ్దాం…
Ads
- ఇది గత సాధారణ ఎన్నికల ముందు సాగించిన నిఘా… నిజంగానే స్పయింగ్, హ్యాకింగ్ జరిగిందో లేదో తెలియదు, ఇప్పుడు చెబుతున్న డేటా బేస్ ప్రామాణికత కూడా తెలియదు… ఎందుకంటే, ఫోన్ల హ్యాకింగ్‌కే అత్యంత ఎఫీసియెంట్ స్పైవేర్ చేసిన సంస్థ నుంచి డేటా లీక్ కావడం అంత సులభమా..?
- పలు రాష్ట్రాలు ఇజ్రాయిల్ నుంచి ఈ పెగాసస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆధునిక పరికరాల్ని కొన్నాయి… ఏపీలో అప్పట్లో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీద కేసు ఇదే కదా… తెలంగాణ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, బోలెడు మందిని ట్రాక్ చేస్తోందనే టాక్ ఉండనే ఉంది… చట్టప్రకారం ట్యాపింగ్, ట్రాకింగ్, హ్యాకింగ్ ఏదైనా తప్పే… కానీ ‘రాజ్యం’ తనకు సందేహమున్న ప్రతి ఒక్కరి కదలికల్ని ట్రాక్ చేయడం పరిపాటే… ఎప్పట్నుంచో ఉంది… ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా చేస్తుంది… ప్రత్యేకించి ప్రతిపక్షనేతలు, జర్నలిస్టులు, ముఖ్య అధికార్లపై ఇంటలిజెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది… మావోయిస్టులను చావుదెబ్బ తీసింది కూడా మొబైల్ ఫోన్ల ట్రాకింగ్తోనే కదా…
- అసలు ఇదే కాదు, శాంతిభద్రతలు కోణంలో మనమెప్పుడో ఎలక్ట్రానిక్ నిఘాకు మన జీవితాల్ని అప్పగించేశాం, ఇక ప్రైవసీ ఎక్కడుంది..? ఇల్లు కదిలిన దగ్గర్నుంచి, మళ్లీ ఇల్లు చేరేవరకు మనల్ని కొన్ని వందల సీసీకెమెరాలు ట్రాక్ చేస్తున్నయ్, రికార్డు చేస్తున్నయ్… మన ఐరిష్ సహా అన్ని వివరాలూ ఆధార్ డేటాలో చేరి, ఎక్కడెక్కడికో ఎప్పుడో వెళ్లిపోయింది… మన ఫోన్లు, మన కంప్యూటర్లు ఎప్పుడూ భద్రం కాదు… ఈ స్థితిలో నాలుగు రోజులు ఈ వార్తల హడావుడి ఉన్నా సరే… రాజకీయాలు కాస్త కంపు చేసినా సరే… మళ్లీ మళ్లీ ఇంకా కొత్త స్పైవేర్లు, టూల్స్ సాయంతో ‘‘ఇంటలిజెన్స్, నిఘా’’ తప్పదు… ఏ ప్రభుత్వమూ బహిరంగంగా అంగీకరించదు… కానీ ఈ పని చేయించకుండా ఉండదు..!! ఇది ఫోన్ల హ్యాకింగును సమర్థించడం కాదు… రియాలిటీని నెమరేసుకోవడం…!! అన్నట్టు చెప్పనేలేదు కదూ… NSO సంస్థ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే ఈ స్పైవేర్ అమ్ముతుంది… అంటే ప్రభుత్వాలు తాము టార్గెట్ చేసిన ఫోన్లను ట్యాప్, హ్యాక్ చేస్తున్నట్టే కదా…!! (స్టోరీ నచ్చితే దిగువన డొనేట్ బటన్ వద్దకు వెళ్లి ముచ్చటను సపోర్ట్ చేయండి)
Share this Article