చాలామంది సినిమావాళ్ల పిచ్చిమాటలకన్నా దగ్గుబాటి సురేష్ మాటలు కాస్త రియలిస్టిక్‌గా ఉంటయ్… నేల విడిచి సాము చేయడు తను… నిజాల్ని అంగీకరిస్తాడు… నారప్ప సినిమా విడుదల సందర్భంగా… తను చెప్పిన చాలా అంశాలు వాస్తవానికి దగ్గరగా, ఓ బిజినెస్‌మ్యాన్ మాట్లాడుతున్నట్టే ఉన్నయ్… ప్రత్యేకించి ఓటీటీలు, థియేటర్ల భవిష్యత్తు మీద కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు… ‘‘ఓటీటీల్ని ఆపలేం, మినీ థియేటర్లు వస్తయ్, పెద్ద కమ్యూనిటీల్లో థియేటర్లను చూస్తాం… ఏమో, హాస్పిటల్స్ కూడా థియేటర్లను ఓపెన్ చేస్తాయేమో… (పెద్ద మాల్స్‌కు అనుబంధంగా స్క్రీన్స్ అనేది పాత విషయమే కదా)… భవిష్యత్తులో హైఫై థియేటర్లు మిగులుతయ్, వాటితోపాటు ఓటీటీల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయకతప్పదు… ప్రస్తుతానికి మేం ఓటీటీ ఏదీ స్టార్ట్ చేయడం లేదు…’’ అన్నీ నిజాలే… థియేటర్లను రక్షించుకోవడానికి, ఓటీటీల్ని అడ్డుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు… థియేటర్లలో రిలీజ్ చేశాక నెలకు గానీ ఓటీటీ జోలికి పోవద్దనీ ఆంక్షలు పెట్టారు, చివరకు కరోనా వచ్చి అవన్నీ తుడిచేసింది…
ఓటీటీ అనే రియాలిటీని అంగీకరించి, తలవంచాల్సి వచ్చింది… చాలామంది హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఫాల్స్ ఇగోలకు పోయి… సినిమాలు పూర్తయినా సరే నెలల తరబడీ వడ్డీలు కట్టి… తడిసి మోపెడై… థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని ఎదురుచూశారు… చివరకు తత్వం బోధపడి, వెనకా-ముందూ మూసుకున్నారు… నిజమే, ప్రేక్షకుడికి థియేటర్ అనుభవం ఎప్పుడూ స్పెషలే… కానీ… ‘‘థియేటర్‌కు ఈ స్థితిలో మనమే వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు, ప్రేక్షకుడిని ఎలా రమ్మంటాం…’’ అన్న సురేష్ మాటల్లో నిఖార్సయిన నిజాయితీ ఉంది… ‘‘నా సొంత సినిమా అయితే ఆపేవాడినేమో.., కాస్త నష్టానికి రెడీ అయ్యేవాడినేమో.., మాకు నష్టమైనా, లాభమైనా సినిమా ఇండస్ట్రీలోనే కాబట్టి రిస్క్ తీసుకునేవాడినేమో, కానీ నా సహనిర్మాత అభిప్రాయాన్ని కాదనలేను కదా… మా సొంత సినిమాల్ని ఎలా, ఎప్పుడు రిలీజ్ చేయాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది… ఏపీలో థియేటర్లు ఓపెన్ చేయడానికి కొన్ని ఇష్యూస్ ఉన్నయ్, తెలంగాణలో ఓపెన్ అవుతున్నయ్…’’ ఇలా కుండబద్ధలు కొట్టినట్టు చెబుతూ పోయాడు…
Ads
ఓ నిర్మాత ఓ సినిమా తీసి, చేతులు కాలిపోతే మళ్లీ ఇండస్ట్రీ మొహం చూడకపోవచ్చు… ఓ దర్శకుడు తెరమరుగు అయిపోవచ్చు… నాలుగు ఫ్లాపులు తగిలితే ఓ హీరోను పలకరించేవాడు ఉండకపోవచ్చు, ఒక హీరోయిన్ పేరు కూడా మళ్లీ వినిపించకపోవచ్చు… కానీ ఒక స్టూడియో ఓనర్, ప్రొడక్షన్ హౌజ్ బాస్, బిగ్ డిస్ట్రిబ్యూటర్, బడా ఎగ్జిబిటర్ అలా అన్నీ వదిలేసి వెళ్లిపోలేడు… ఓ లాటరీలాగా సినిమా నిర్మాణాన్ని చూడటం కుదరదు, కొన్ని వందల మంది వాటి మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు కాబట్టి… అదీ రియాలిటీ… కాలంతోపాటు మారాల్సిందే… అందుకే చిన్న చిన్న సినిమాలకూ ఫైనాన్స్ చేస్తున్నారు, తమ పేరుతో రిలీజ్ చేస్తున్నారు, చిన్న దర్శకుల్నీ ఎంకరేజ్ చేస్తున్నారు… తనకు సినిమా ఓ వ్యాపారం, ఓ ఫ్యాక్టరీ… తను అలాగే చూస్తాడు… చూస్తున్నాడు… చివరకు వైజాగ్‌లోని తన స్టూడియోని జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ప్రచారం మీద కూడా నిక్కచ్చిగా చెప్పాడు… ‘‘అది నేను డబ్బు చెల్లించి కొన్న స్థలం… ప్రభుత్వం ఇచ్చింది కాదు… ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి ఆ భూమి అవసరం ఉందంటే మార్కెట్ రేటు ఇస్తే అమ్మేయడానికి నేను రెడీ…’’ అయితే… అఫ్ కోర్స్, ప్రభుత్వాలతో వ్యవహారం అంటే ఇద్దరు వ్యాపారుల నడుమ మధ్య లావాదేవీలు, క్రయవిక్రయాల తరహాలో ఉండదు… ఆ సంగతి సురేష్‌కూ తెలుసు..!!
Share this Article