.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బహుముఖ దాడి ప్రారంభమైంది… అది ఇంటా బయటా ! తన చుట్టూ చాలా తలనొప్పులు ముసురుకుంటున్నాయనే మాట వాస్తవం… తను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రెండేళ్ల 8 నెలలు… నిజానికి కాంగ్రెస్ సంస్కృతి లెక్కల్లో ఇది దీర్ఘకాలమే… ఇప్పుడు హఠాత్తుగా కమ్ముకొస్తున్న మబ్బుల వెనుక ఎవరున్నారు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజాగా విశ్లేషిస్తున్నట్టుగా… ఈ తాజా లొల్లి, కుట్రల వెనుక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఓ కీలక కుట్రదారేనా..?
నిజానికి ఏ విషయమైనా సరే, అటు తిప్పీ ఇటు తిప్పీ చివరకు జగన్ మెడలో వేసేయడం రాధాకృష్ణకు అలవాటే… రేవంత్ మీద సాగుతున్న తాజా కుట్రల్ని కూడా జగన్ మెడలోనే వేసి చిత్రీకరించే ప్రయత్నం కాస్త బలంగానే చేశాడు రాధాకృష్ణ… కొన్ని అంశాల్ని పరిశీలిస్తే…
Ads
అధికారం కోల్పోయిన కేసీయార్ అసహనంగా ఉన్నాడు… దొరతనం అంత తేలికగా ఊరుకోనివ్వదు… పావులు కదుపుతున్నాడు, రేవంత్‌ను కూల్చేస్తే, కాంగ్రెస్‌ను కూల్చేసినట్టే, ఇక ఇప్పట్లో కాంగ్రెస్ మళ్లీ కోలుకోదు, సో రేవంత్‌ను దెబ్బతీయాలి… అదే టార్గెట్… దానికి బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ కలుస్తున్నాయి… అంతేకాదు, జగన్ అనుకూల తెలంగాణ కాంగ్రెస్ నేతలూ వంతపాడుతున్నారు… ఎలా..?

కేసీయార్‌కు ప్రబల విరోధి ఎవరు..? చంద్రబాబు..! చంద్రబాబుకు ప్రబల విరోధి ఎవరు..? జగన్ ! ఓ సమైక్యవాది, ఓ తెలంగాణ పోరాటవాది చాన్నాళ్లుగా జాన్ జిగ్రీ దోస్తులు, ఆర్థిక కారణాలో, మరేమిటో గానీ… కేసీయార్ ప్రయోజనాలు జగన్ ప్రయోజనాలే… అందుకని కాంగ్రెస్‌లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా సురేఖను ఎగదోస్తున్నాడు అనేది తాజా ఆంధ్రజ్యోతి సందేహం…
రాజగోపాలరెడ్డికి జగన్‌తో సాన్నిహిత్యం ఉంది, సురేఖ అయితే జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి, చివరకు మానుకోట రాళ్ల దాడికీ గురైన సంగతి తెలిసిందే… పొంగులేటి కూడా జగన్ మనిషే కానీ, తనిప్పుడు బయటపడటం లేదు… సో, జగన్ కాంగ్రెస్ ఇంట్లో నిప్పు రగిలిస్తున్నాడు, పొగపెడుతున్నాడు, కేసీయార్ కళ్లల్లో ఆనందం చూడటం కోసం!
మరోవైపు బీజేపీని దింపుతున్నాడు కేసీయార్… పొత్తా, అవగాహనా, విలీనమా తరువాత సంగతి, ముందు రేవంత్ పనిపడదాం, దాంతో కాంగ్రెస్ కథ ఖతం అని చెబుతూ… రేవంత్ పైకి ఉసిగొల్పుతున్నాడు… ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ పని క్లోజయిపోతే మోదీషాలకు అంతకుమించి కావల్సిందేముంటుంది..? అందుకే జాతీయ బీజేపీ మీద కుట్రలు చేసిన కేసీయార్ హఠాత్తుగా ఆప్తుడైపోయాడు… చంద్రబాబు అయినట్టుగానే…

బీజేపీతో బాగుంటే తన మెడపై వేలాడే కేసుల నుంచి రక్షణ, కేటీయార్‌ను ఎలాగోలా సీఎంను చేసేసి, హరీష్ రావును గాలికి వదిలేసి, తను ఇక యాక్టివ్ రాజకీయాలకు స్వస్తి పలకడం కేసీయార్ ఆలోచన, తన ఆరోగ్యం కూడా అటువైపే ఆలోచింపజేస్తోంది… సో, రేవంత్ మీద బహుముఖ దాడి… వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ ప్లస్ సొంత ఇంటి మనుషులు కూడా..!
మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చోద్యం చూస్తోంది… ఎందుకు ఉపేక్షిస్తోంది… రేవంత్ రెడ్డి కాళ్లకు ఎందుకు బంధనాలు వేస్తోంది… స్వేచ్ఛ ఎందుకు ఇవ్వడం లేదు… ఎప్పుడూ కాంగ్రెస్ హైకమాండ్ ఇలాగే ఉంటుంది, కొత్తేమీ కాదు… కానీ పుట్టి మునిగిపోతోందని తెలిసీ పట్టించుకోకుండా… పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండటం అంటే… తెలంగాణ కాంగ్రెస్ ఓడకు తనే బొక్కలు పెడుతున్నట్టు లెక్క..!!
అయితే యుద్ధక్షేత్రం వదిలేసి పారిపోయే రకం మాత్రం కాదు రేవంత్ రెడ్డి… ఏం చేయబోతున్నాడనేది తెలంగాణ వర్తమాన రాజకీయాల్లో కీలకంగా మారుతోంది..!!
Share this Article