.
హలో సార్… వెంటనే రంగులు పూసేయకండి నాకు… ఈ కేశినేని నాని ఏ పార్టీయో, ఏమిటో నాకు తెలియదు నిజంగానే… కానీ ఇది చదువుతుంటే ఆసక్తికరంగా ఉంది… అవును కదా అనిపించింది పలుచోట్ల… బేసిక్స్ వదిలేసి, నగర జనాభా బేసిక్ అవసరాలు- సౌకర్యాలు మానేసి… ముందుగా మెట్రోల వైపు పరుగులు తీస్తున్నాం కదా అనిపించింది…
బట్, మెట్రోను కాదనలేం, అదే సమయంలో లక్షల మంది హీన నాణ్యతాప్రమాణాలనూ పట్టించుకోకుండా ఉండలేం… ఇంతకీ సదరు నాని ఏమన్నాడు అనేనా..? ఇదుగో చదవండి… విజయవాడ కనిపిస్తుంది ఓసారి…
Ads
కేశినేని నాని…. నిన్న ఒక మిత్రుడు అడిగాడు — బెజవాడ ఎంత పెద్దది అని. నేను చెప్పాను, మన బెజవాడ కాగితం మీద 61.88 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కానీ నిజానికి బెజవాడ అంటే కంకిపాడు వరకు విస్తరించిన పొలాలు, గన్నవరం వరకు పరుగెత్తే విమానం శబ్దం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి కోట వరకు ఉన్న మన పరిశ్రమల పొగ. మనల్ని 61 కిలోమీటర్ల గుంటలో బంధించారు, కానీ మన బెజవాడ మనసు 400 చదరపు కిలోమీటర్లు అని !!

ఈ చిన్న ప్రదేశంలో మనం ఎంత మందిమి ఉన్నామో తెలుసా? ఒక చదరపు కిలోమీటరులో 31,200 మంది.
ప్రపంచంలోనే మూడవ అత్యంత రద్దీ నగరం మనది. ఢాకా తర్వాత, పాకిస్తాన్ లోని హైదరాబాద్ తర్వాత మన బెజవాడే. ముంబై కంటే, ఢిల్లీ కంటే రద్దీ మనమే.
ఎందుకంటే మనం ఎత్తైన భవనాల్లో ఉండటం లేదు, ఒకరి పక్కన ఒకరం, గుడిసె పక్కన గుడిసెలో, ఒక సెంటులో మూడు కుటుంబాలుగా బతుకుతున్నాం.
అందులోనూ మూడు లక్షల మంది మన కళ్లకు కనిపించని బెజవాడలో ఉన్నారు. మొగల్రాజపురం కొండ మీద, గుణదల గుట్ట మీద, భవానీపురం, పశ్చిమ నియోజకవర్గ కొండల చరియల్లో. …
వాళ్లకు రోడ్డు లేదు, నీళ్లు రావు, మరుగు దొడ్లు వుండవు , వర్షం వస్తే కొండ జారి ఇంటి మీద పడుతుందేమోనని నిద్ర ఉండదు. అంబులెన్స్ వెళ్లదు, ఫైర్ ఇంజన్ ఎక్కదు. బెంజ్ సర్కిల్ లో లైట్లు వెలుగుతున్నప్పుడు, ఆ కొండ మీద ఒక తల్లి బిందె పట్టుకుని మెట్లు దిగుతూ ఉంటుంది.
ఇలాంటి నగరానికి ఏం కావాలి? ఫ్యాన్సీగా కనిపించే మెట్రోనా? లేక కడుపు నింపే మనిషి జీవన ప్రమాణాలు పెంచే సివిక్ సౌకర్యాలా?

అభివృద్ధి అంటే కేవలం సిమెంట్, స్టీలు కాదని నేను నమ్ముతాను. అభివృద్ధికి నాలుగు కాళ్లు ఉంటాయి.
ఒకటి కంటికి కనిపించే కట్టడాలు,
రెండోది మనిషి వికాసం — చదువు, వైద్యం, ఉపాధి,
మూడోది సామాజిక భద్రత,
నాలుగోది మన పిల్లల మీద అప్పు మిగల్చని సుస్థిరత.
మనం మొదటిది మాత్రమే చూస్తున్నాం, అసలైన పునాది అయిన మనిషిని మర్చిపోతున్నాం.
ఈరోజు ప్రభుత్వం అంటోంది — 12 వేల కోట్లతో మెట్రో తెస్తామని. ఆ మాట వినగానే నాకు భయం వేస్తోంది. ఎందుకంటే ఆ 12 వేల కోట్లు 10 ఏళ్లలో 24 వేల కోట్లు అవుతుంది. ప్రతి నగరంలో అదే జరిగింది. ఆ డబ్బు మనం, మన పిల్లలు పన్నుల రూపంలో కట్టాలి.
10 ఏళ్ల పాటు ఈ 61 కిలోమీటర్ల చిన్న నగరాన్ని తవ్వేస్తారు. బెంజ్ సర్కిల్ నుండి PNBS వరకు, ఏలూరు రోడ్డులో ఉన్న వేలాది చిన్న పెద్ద షాపులు ఆ దుమ్ములో బతకలేవు. 38 కిలోమీటర్ల మెట్రో కోసం వందలాది బిల్డింగులు పగలగొడతారు , రోడ్లు సగం అవుతాయి.
పదేళ్ల పాటు నగర ఆర్థిక వ్యవస్త చిన్నా భిన్నం అవ్వుతుంది …
ఆ మెట్రోలో ఎవరు వెళ్తారు? ఆటో 20 రూపాయలకు వెళ్లే చోట 80 రూపాయల టికెట్ కొని కొండ మీద ఉన్న అవ్వ వెళ్తుందా?
చివరికి బెజవాడ జనాభాలో 10 శాతం మంది కూడా మెట్రో ఎక్కరు .
అదే డబ్బుతో మనం ఇంకో బెజవాడను కట్టొచ్చు.
నా కల చాలా సింపుల్. ముందు బెజవాడను గ్రేటర్ బెజవాడ చేయాలి. కాగితం మీద ఉన్న 61 కిలోమీటర్లను చెరిపేసి, కానూరు,పెనమలూరు , పొరొంకి , ఈడుపుగల్లు , కంకిపాడు వరకు, రామవరపడు , ప్రసాదంపాడు , ఎనికేపాడు , నిడమానూరు , కేసరపల్లి, గన్నవరం వరకు, గొల్లపూడి , గుంటుపల్లి , ఇబ్రహీంపట్నం, కొండపల్లి వరకు…. అట్లాగే మధ్యలో వున్న నున్న , జక్కంపూడి వంటి గ్రామాల మధ్య ఉన్న 400 చదరపు కిలోమీటర్లను ఒకే మ్యాప్ లోకి తేవాలి.
దానికి 25 ఏళ్లకు సరిపడా ఒకే ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి . ఎక్కడ ఇల్లు, ఎక్కడ హాస్పిటల్ , ఎక్కడ స్కూల్, ఎక్కడ షాపింగ్ ,ఎక్కడ హోటల్ లాంటివి అన్నీ ముందే నిర్ణయించాలి.
ఆ తర్వాత ఆ 400 చదరపు కిలోమీటర్ల అభివృధికి పునాది వేయాలి. కొండల మీద ఉన్న మూడు లక్షల మందికి పక్కా ఇళ్లు, కొండ చరియలు విరిగి మీద పడకుండా రిటైనింగ్ వాల్స్ , నీళ్లు, లైట్లు. ప్రతి ఇంటికి 24 గంటల నీళ్లు, మరుగు దొడ్లు , ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి డివిజన్ లో ఒక మంచి స్కూల్, ఒక క్లినిక్. కంకిపాడు నుండి కొండపల్లిని కలిపే 60 కిలోమీటర్ల రింగ్ రోడ్డు.
బెజవాడకు ప్రస్తుతం మెట్రో అక్కర్లేదు. 500 ఎలక్ట్రిక్ బస్సులు చాలు. ఒక బస్సు కోటి రూపాయలు, 500 బస్సులు అంటే 500 కోట్లు. అంటే మెట్రో బడ్జెట్ లో 4 శాతం మాత్రమే. ఆ 500 బస్సులు 6 నెలల్లో రోడ్డు మీదకు వస్తాయి, 10 ఏళ్లు అక్కర్లేదు. అవి కంకిపాడు నుండి కొండపల్లి వరకు, గన్నవరం నుండి ఇబ్రహీంపట్నం వరకు ప్రతి సందులోకి వెళ్తాయి. మెట్రో స్టేషన్ కు ఆటోలో వెళ్లక్కర్లేదు, బస్సు మీ గడప ముందే ఆగుతుంది. 500 బస్సులు అంటే వేలాది మంది మన బెజవాడ బిడ్డలకు డ్రైవర్లుగా, కండక్టర్లుగా ఉద్యోగాలు.
మిగిలిన 11,500 కోట్లతో మనం మన కొండలను బాగు చేసుకోవచ్చు, మన పిల్లలకు స్కూళ్లు , హాస్పిటల్స్ కట్టుకోవచ్చు, మన మురికి కాలువలను బాగు చేసుకోవచ్చు.
కాబట్టి నేను మెట్రో వద్దంటున్నది అభివృద్ధి వద్దని కాదు. నేను అడుగుతున్నది — ముందు మనిషిని బతికించండి, తర్వాత మనిషిని విలాసంగా తిప్పండి. ముందు గ్రేటర్ బెజవాడను మ్యాప్ చేయండి, మాస్టర్ ప్లాన్ వేయండి, సివిక్ పనులు చేయండి, 500 బస్సులు తిప్పండి. ఆ తర్వాత, మన నగర జనాభా 50 లక్షలు దాటి, మన రోడ్లు విశాలమై, మన కొండల బిడ్డలకు నీళ్లు వచ్చాక — అప్పుడు మెట్రో గురించి ఆలోచిద్దాం. అప్పుడు అది భారం కాదు, వరం అవుతుంది.
బెజవాడ అంటే MG Road మాత్రమే కాదు, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం , గుణదల, మాచవరం , విజయవాడ పశ్చిమ , భవానీపురం అజిత్ సింగ్ నగర్, ఇతర కొండా.. . గుట్ట మీద బతికే పేద తల్లి బిడ్డలు కూడా.
బెజవాడకు కావాల్సింది ఫ్యాన్సీ మెట్రో కాదు, ఆ కొండ మీద బిక్కు బిక్కు మంటూ బతికే పౌరుడి ఆనందం, సంతోషం !
I ❤️❤️❤️Vijayawada!
Share this Article