.
Murali Buddha …. ఓ రోడ్డు ప్రమాదం కావచ్చు, దొంగతనం కావచ్చు, అత్యాచారం కావచ్చు, కేసు ఏదైనా కావచ్చు … మీడియాలో వార్త ఆ మీడియా యాజమాన్యం ఏ పార్టీకి చెందిందో దానికి అనుగుణంగా మాత్రమే వార్త వస్తుంది …
ఎక్కడో పరాయి రాష్ట్రం నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చిన అమ్మాయి ఓ డబ్బున్న వాడి రాష్ డ్రైవింగ్‌కు బలైంది .
ఆమె సుదూర రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాబట్టి తెలంగాణ, ఆంధ్ర నుంచి ఒత్తిడి ఉండదు … తప్పు చేసిన వాడికి ఆ పార్టీ తటస్తులు , అభిమానులు , కూటమి నుంచి మద్దతు ఉంటుంది .
Ads
తప్పు ఆ అమ్మాయిదే అంటూ బోలెడు వ్యాసాలు . నిజమే అనిపిస్తుంది . ప్రమాదం జరిగిన వీడియో చూసేంత వరకు …
బాటసారుల కోసం జీబ్రా క్రాస్ స్పష్టంగా ఉంది . అక్కడ బుద్ది ఉన్నవాడు, తాగని వాడు మెల్లగా వెళ్ళాలి . రాష్‌గా వెళ్లి డాష్ ఇవ్వగానే ఆమె అక్కడే చనిపోయింది .
వీడియోలో ఆమే జీబ్రా క్రాస్ లైన్ మీదే పడి చనిపోయింది .
ఆ వీడియోలో మాటలు కూడా రికార్డ్ అయ్యాయి . తాగినావారా అంత రాష్‌గా నడిపిస్తున్నావు అని ఎవరో హిందీలో అంటున్నారు .
ప్రమాదం జరిగిన ఐదారు రోజులకు కూడా విషయం బయటకు రాలేదు అంటే పలుకుబడి ఎంతో తెలుస్తుంది .
చాలాకాలం క్రితం నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలోని రహదారిపై స్పీడ్‌గా కారు నడిపితే బోల్తా పడి మరణించారు .
మీడియాలో వార్త ఏమిటో తెలుసా..? ఆ జాతీయ రహదారి నిర్మాణం సరిగా లేదు అని….
విద్యావ్యాపారి, రాజకీయ నాయకులు నారాయణ కుమారుడు కారులో వేగంగా వెళుతూ మెట్రో పిల్లర్‌ను గుద్ది అక్కడి కక్కడే మృతి .
మీడియాలో వార్త – మెట్రో పిల్లర్లు సరిగా నిర్మించ లేదు దారికి అడ్డంగా ఉన్నాయి అని …
అయితే ? జూబ్లీ హిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఎదురుగానే టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ . రిపోర్టర్లు అందరూ పార్క్ వద్ద బైక్‌లు పార్క్ చేసి ఎన్టీఆర్ భవన్‌కు వెళతారు . ఓ పాతికేళ్ల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యాక రోడ్డు దాటి పార్కు వైపు వస్తుంటే అప్పుడు ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా ఉన్న సుధాకర్ రెడ్డి అడ్డుకొని…
‘‘ఈ దారిలో తండ్రుల సంపాదనతో జల్సా చేసే కొడుకులు వేగంగా కారు నడుపుతూ వెళతారు … కారుతో గుద్ది వెళితే మా నాన్న చూసుకుంటాడులే అని బ్రేక్ కూడా వేయకుండా వెళ్లి పోతాడు . మనమే జాగ్రత్తగా ఉండాలి’’ అని రిపోర్టర్లు అందరినీ ఆపి వాహనాలు రావడం లేదు అని చూసుకొని వెళ్ళాం …

పాపం, ఏదో సుదూర రాష్ట్రం అమ్మాయి . ఎక్కడైనా మనుషులే ఉంటారు కదా అనుకోని ప్రాణాలు కోల్పోయింది .
ఓయోలో అమ్మాయిల ఫోటోలను సాహసోపేతంగా విడుదల చేసిన పోలీసులు , ప్రచురించిన మీడియా… దీన్ని పట్టపగలు ప్రమాదం జరిగినా ఆరు రోజుల వరకు బయట పెట్టలేదు … సర్లే, మనకెందుకు, చట్టం ముందు అందరూ సమానమే …!!
అన్నట్లు ఆ కారు విలువ 5 కోట్ల పైమాటేనట!! అపారమైన ఆస్తిపాస్తులున్నాయి తండ్రి లింగమనేనికి… ఓ డ్రైవర్‌ను పెట్టుకోలేకపోయాడా..? భలేవారే, అంత ఖరీదైన కారు కొడుకు హైదరాబాద్ రోడ్లపై డ్రైవ్ చేస్తుంటేనే కదా మజా, జోష్, థ్రిల్ !!

Share this Article