.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని హైజాక్ చేసిన రేవంత్.. ఢిల్లీతో సమరానికి కొత్త రాజకీయ భాష…
విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరణ.. సాధారణంగా ఇది ఒక ప్రభుత్వానికి ఎదురయ్యే పరిపాలన సమస్య. కేంద్ర విదేశాంగ శాఖకు అది ఒక ఫైల్‌పై తీసుకున్న నిర్ణయం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాత్రం అది అంతకంటే పెద్ద రాజకీయ అవకాశంగా మారింది. కాదు, మార్చేసుకున్నాడు.
Ads
ఈ పరిణామంతో ఆత్మగౌరవం తమ పేటెంట్ అంటూ భ్రమపడే బీఆర్ఎస్ క్యాంపు మొత్తం ఒక్కసారిగా హతాశురాలైంది… కిక్కుమనడం లేదు, ఏం స్పందించాలో అర్థం కావడం లేదు పాపం… మోదీ చర్యను సమర్థించలేరు, రేవంత్ క్రెడిట్ కొట్టేస్తుంటే ఖండించలేరు… బీజేపీ మరింత గందరగోళం, మొత్తానికి రెండు పిట్టలను ఒకే షాట్‌తో కొట్టాడు రేవంత్ రెడ్డి… వివరాల్లోకి వెళ్దాం…
లండన్ పర్యటన ముగించుకుని అమెరికా వెళ్లాల్సిన ముఖ్యమంత్రి బృందానికి విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలతో ఒప్పందాలు, తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణ, ‘తెలంగాణ రైజింగ్–2047’ కార్యక్రమాలతో ముడిపడిన పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రం చెప్పిన కారణం కూడా రాజకీయంగా చర్చకు దారితీసేలా ఉంది.
అక్కడితో కథ ముగిసిపోయి ఉంటే.. ఇది ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు అనుమతి రాని వార్త మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి దాన్ని అక్కడితో ఆపలేదు. ‘కేంద్రం నాకు అనుమతి ఇవ్వలేదు’ అనే అంశాన్ని.. ‘ఢిల్లీ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతోంది’ అనే ప్రాంతీయ అంశంగా మార్చాడు… ఇదే ఈ మొత్తం ఎపిసోడ్‌లో అసలు రాజకీయ మలుపు.
తెలంగాణ ఆత్మగౌరవం.. బీఆర్ఎస్ సొంత పేటెంట్ కాదు!
తెలంగాణ రాజకీయ చరిత్రలో ‘ఆత్మగౌరవం’ అనే పదానికి ఒక ప్రత్యేకమైన రాజకీయ బలం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో అది ఒక సామూహిక భావోద్వేగం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ భావోద్వేగాన్ని బీఆర్ఎస్ తన రాజకీయ బ్రాండ్‌లో కీలక భాగంగా మలుచుకుంది.
‘తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఎదిరించడం’.. ‘తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడం’.. ‘తెలంగాణను తక్కువ చేసి చూడొద్దు’ వంటి రాజకీయ భాష బీఆర్ఎస్ పాలనలో బలంగా వినిపించింది. అందుకే ఇప్పటివరకు తెలంగాణ ఆత్మగౌరవం అంటే బీఆర్ఎస్ రాజకీయ డొమైన్ అన్న భావన కొంతవరకు ఏర్పడింది.
రేవంత్ రెడ్డి చేసిన ఆసక్తికరమైన రాజకీయ ప్రయోగం ఏమిటంటే.. ఆ డొమైన్‌లోకి తానే ప్రవేశించడమే కాదు.. దానిని తన రాజకీయ భాషలోకి మార్చుకోవడం. ఇది కేవలం బీఆర్ఎస్ నినాదాన్ని కాపీ చేయడం కాదు. దానికి కొత్త సందర్భాన్ని ఇవ్వడం.
గతంలో ‘తెలంగాణకు అన్యాయం’ అనే ప్రశ్న ప్రధానంగా రాష్ట్ర హక్కులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ప్రాజెక్టుల చుట్టూ తిరిగేది. రేవంత్ దానికి కొత్త వెర్షన్ చూపిస్తున్నాడు… ‘తెలంగాణ అభివృద్ధి కోసం నేను ప్రపంచాన్ని చుట్టేస్తుంటే.. ఢిల్లీ ఎందుకు అడ్డుకుంటోంది? అదీ మోదీ పదే పదే చెప్పే వికసిత భారత్ లక్ష్యం కోసమే కదా నేనూ ప్రయత్నించేది…’ అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు, అంతర్జాతీయ విద్య, గ్లోబల్ బ్రాండింగ్‌తో కలిపాడు… మోదీ భాషలోనే… మోదీ పథకాన్ని ఉదహరిస్తూ…
ఇదే తన వ్యూహం. ‘నా పర్యటన’ నుంచి ‘మన తెలంగాణ’ వరకు… ఇక్కడే రేవంత్ రాజకీయంగా సక్సెస్ అయ్యారని చెప్పడానికి కారణం ఉంది… అమెరికా పర్యటన రద్దయింది అంటే సహజంగా ప్రతిపక్షం వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయి.
‘ముఖ్యమంత్రి పర్యటనకు ఎందుకు అనుమతి రాలేదు?’
‘కేంద్రం ఎందుకు తిరస్కరించింది?’
‘పర్యటన ప్రణాళికలో లోపాలున్నాయా?’
‘రేవంత్ ప్రభుత్వం దౌత్యపరంగా ఏదైనా తప్పు చేసిందా?’
ఇలా ప్రశ్నలు సీఎం చుట్టూ తిరగాల్సి ఉంది.
కానీ రేవంత్ చర్చ దిశనే మార్చేశాడు… ‘నన్ను ఎందుకు ఆపారు?’ అనే ప్రశ్నను ‘తెలంగాణను ఎందుకు ఆపుతున్నారు?’గా మార్చాడు… ఇది రాజకీయ కమ్యూనికేషన్‌లో చాలా కీలకమైన మార్పు. వ్యక్తిగత పరిపాలనా వైఫల్యంగా కనిపించే అంశాన్ని ప్రాంతీయ ఆత్మగౌరవ సమస్యగా మార్చిన క్షణంలోనే.. ముఖ్యమంత్రి డిఫెన్స్‌లో ఉండే పరిస్థితి నుంచి అటాక్ చేసే స్థితికి వచ్చాడు…
గుజరాత్ పోలిక ఎందుకు అంత ముఖ్యమైంది? రేవంత్ రెడ్డి ప్రస్తావించిన గుజరాత్ ఉదాహరణ కూడా ఇక్కడే కీలకం.
‘గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతి వస్తుంది.. తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం ఎందుకు రాదు?’ అనే ప్రశ్నను ఆయన రాజకీయంగా ముందుకు తెచ్చారు. ఇది కేవలం విదేశీ పర్యటనల పోలిక కాదు. బీజేపీ రాజకీయ గుండెకాయలోనే ప్రశ్నను దించడం.
గుజరాత్ బీజేపీకి ఒక రాజకీయ బ్రాండ్. ‘గుజరాత్ మోడల్’ అనే పదం దేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేక రాజకీయ ప్రతీక. అలాంటి గుజరాత్‌ను తెలంగాణతో పోల్చి.. ‘అక్కడికి అనుమతి.. ఇక్కడికి నిరాకరణ ఎందుకు?’ అని ప్రశ్నించడం ద్వారా రేవంత్ తెలంగాణ బీజేపీని కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు…
అంటే కేంద్రంతో వచ్చిన పరిపాలన, విదేశాంగ నిర్ణయ వివాదాన్ని.. రాష్ట్రంలో బీజేపీతో జరిగే రాజకీయ పోరాటంగా మార్చేశారు. ఇది బీఆర్ఎస్‌పై కూడా ఒక రాజకీయ దెబ్బే! ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం ఉంది.
రేవంత్ రెడ్డి ఒకేసారి కేంద్రంలోని బీజేపీని మాత్రమే టార్గెట్ చేయడం లేదు. బీఆర్ఎస్ రాజకీయ ఆక్సిజన్‌గా ఉన్న ‘తెలంగాణ ఆత్మగౌరవం’ అనే అంశాన్ని కూడా తనవైపు లాగుతున్నాడు… కేసీఆర్ రాజకీయ శైలిలో ‘ఢిల్లీ’ ఒక ప్రత్యర్థి. రేవంత్ శైలిలో కూడా ఇప్పుడు ‘ఢిల్లీ’ ఒక ప్రత్యర్థిగానే కనిపిస్తోంది.
కానీ తేడా ఏమిటంటే… కేసీఆర్ పాలన దశలో అది ప్రధానంగా తెలంగాణ హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్ర జోక్యం చుట్టూ ఉండేది. రేవంత్ దాన్ని పెట్టుబడులు– విద్య– ఉద్యోగాలు– గ్లోబల్ కనెక్టివిటీ– 2047 అభివృద్ధి విజన్‌తో కలుపుతున్నాడు… అంటే పాత తెలంగాణ ఆత్మగౌరవానికి కొత్త కంటెంట్ ఇస్తున్నాడు. ఇదే బీఆర్ఎస్‌కు అసలు రాజకీయ సమస్య కావచ్చు. కక్కలేక, మింగలేక…
ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్‌పై రాజకీయంగా తమకున్న ప్రత్యేక హక్కును రేవంత్ ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు… ‘ఢిల్లీతో యుద్ధం’ అనే రాజకీయ సిద్ధాంతాన్ని కూడా మార్చాడు… ఇక్కడ మరో సూక్ష్మమైన మార్పు ఉంది.
తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీతో పోరాటం అంటే ఇంతకాలం ప్రధానంగా రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో ఘర్షణ అనే అర్థం. రేవంత్ దాన్ని కొంతవరకు అభివృద్ధి హక్కు కోసం పోరాటంగా మార్చుతున్నాడు…
‘తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నాం.’
‘ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు చేయాలనుకుంటున్నాం.’
‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.’
‘మేము ఈ పని చేయడానికి ప్రపంచంలోకి వెళ్తుంటే.. ఢిల్లీ ఎందుకు అడ్డుకుంటోంది?’
ఇలా ప్రశ్నను ఫ్రేమ్ చేస్తే… కేంద్రం ఇచ్చిన ‘క్లియరెన్స్ లేదు’ అనే పరిపాలనా నిర్ణయం కంటే… ‘తెలంగాణ ఎదగకుండా ఢిల్లీ అడ్డుకుంటుందా?’ అనే రాజకీయ ప్రశ్న పెద్దదవుతుంది. అదే రేవంత్ కోరుకున్న ఫలితం.
లండన్‌ను ‘షీల్డ్’గా ఉపయోగించడం… అమెరికా పర్యటన ఆగిపోయింది. కానీ లండన్ పర్యటన జరిగింది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎల్‌ఎస్‌ఈ వంటి సంస్థలతో జరిగిన చర్చలు, తెలంగాణకు అంతర్జాతీయ భాగస్వామ్యాల ప్రయత్నాలను రేవంత్ తనకు అనుకూలమైన రాజకీయ కథనంగా మార్చుకున్నాడు…
దీంతో కేంద్రం వేసిన బ్రేక్ వల్ల ఆయన విదేశీ పర్యటన పూర్తిగా విఫలమైందనే భావనకు అవకాశం లేకుండా చేశాడు… ‘ఒక తలుపు మూసినా.. తెలంగాణ కోసం మిగతా తలుపులు తెరిచే పని కొనసాగుతుంది’ అనే ఇమేజ్‌ను నిర్మించాడు…
అంతేకాదు.. అమెరికా వెళ్లాల్సిన అధికారుల బృందాన్ని పంపి ఒప్పందాల ప్రక్రియ కొనసాగించాలని చెప్పడం ద్వారా వ్యక్తిగత పర్యటన కంటే కార్యక్రమమే ముఖ్యమని చెప్పే అవకాశం కూడా తనకు వచ్చింది. రేవంత్ అసలు గెలిచింది ఇక్కడే..
రాజకీయాల్లో ప్రతి పోరాటం ఓట్లు గెలవడానికి మాత్రమే ఉండదు. కొన్ని పోరాటాలు రాజకీయ భాషను ఎవరు నియంత్రిస్తారనే ప్రశ్నకు సంబంధించినవి. ఈ విదేశీ పర్యటన వివాదంలో రేవంత్ రెడ్డి సాధించింది అదే. కేంద్రం వేసిన దౌత్యపరమైన బ్రేక్‌ను.. తెలంగాణ ఆత్మగౌరవం అనే రాజకీయ యాక్సిలరేటర్‌గా మార్చేశారు.
అందుకే ఇది కేవలం ఒక సీఎం విదేశీ పర్యటనకు అనుమతి రాని కథ కాదు. తెలంగాణ రాజకీయాల్లో ‘ఆత్మగౌరవం’ అనే పాత రాజకీయ ఆయుధాన్ని రేవంత్ రెడ్డి ఎలా రీ-బ్రాండ్ చేసి.. ప్రత్యర్థుల చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకుంటున్నారన్న కథ.
Share this Article