తెలంగాణ దళిత బంధు పథకం… వోట్ల కోసమే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అని కేసీయార్ ప్రకటన, ఎన్నడూ లేనిది కేసీయార్ నోటివెంట దళిత పథకాలు… టీఆర్ఎస్ క్యాంపులో దళితగానం హోరెత్తిపోతోంది కదా… ఈటలపై కేసీయార్ దళితాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు అని అందరూ ఊహిస్తున్నదే కదా… చివరకు మోత్కుపల్లిని కూడా బీజేపీ నుంచి లాగేసి, ఈటలపై నిందలు వేయిస్తున్నారు… ఎస్సీ కార్పొరేషన్ ఖాళీని కూడా హుజూరాబాద్‌కే చెందిన బండ శ్రీనివాస్‌తో భర్తీ చేశారు… అంతా హుజూరాబాదులో ఉన్న దాదాపు 45 వేల దళిత వోట్ల కోసమే పాట్లన్నీ, ఈటలతో ఫైట్ చాలా టఫ్‌గా ఉండబోతోంది కాబట్టి, బీసీ ఈటలపైకి ఎస్సీ మిసైల్ ప్రయోగించే పనిలో ఉన్నాడు కేసీయార్ అనేది పొలిటికల్ అనలిస్టులందరూ ఊహిస్తున్న సంగతే… కొందరు మాత్రం కౌశిక్ రెడ్డికి టికెట్టు ఇస్తాడు కేసీయార్, అందుకే టీటీడీపీ అధ్యక్షుడు రమణ పార్టీలో చేరితేనే లైట్ తీసుకున్న తను, కౌశిక్ రెడ్డి చేరితే స్వయంగా వెళ్లి కండువా కప్పి, నాలుగు మెచ్చుకోలు మాటలు కూడా మాట్లాడాడు, నీకు ఉజ్వల భవిష్యత్ ఉందిపో అన్నాడు… సో, కేసీయార్ చాయిస్ కచ్చితంగా కౌశికుడే అని ఊహాగానాలు చేశారు… అయితే..? తూచ్, బీసీ మీద బీసీ అస్త్రమే ప్రయోగిస్తాను అనే ఆలోచనలో ఉన్నాడట కేసీయార్…
ఉద్దేశపూర్వకంగా బీజేపీ క్యాంపును గందరగోళానికి గురిచేయడం కోసమా… లేక నిజంగానే కేసీయార్ ఆలోచనల్లో మార్పు వచ్చిందో తెలియదు గానీ… బీసీపైకి బీసీ అస్త్రమేనట… టీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును మెల్లిగా ప్రచారంలో పెడుతున్నారు… తను యాదవ్… బీసీ… వీణవంక… ఉద్యమకారుడి మీదకు మరో ఉద్యమకారుడు… బీసీ మీదకు మరో బీసీ… యాదవుల వోట్లు కూడా తక్కువేమీ కాదు… అందుకే హడావుడిగా మళ్లీ గొర్రెల పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చారట… ఎస్సీని పెట్టాలి అనుకున్నా సరే, ఈటలకు దీటుగా నిలబడే ఎస్సీ నాయకుడు దొరకడం లేదనీ, కడియం శ్రీహరి తనకు ఈటల మీద పోటీ ఇంట్రస్టు లేదంటూ నిరాకరించాడని అంటున్నారు… ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హుజూరాబాదులో నిలబడతాడనే ప్రచారం జరిగింది కానీ దాన్ని ఆయన మొదట్లోనే ఖండించాడు… ఆ ప్రచారానికి శుభం కార్డుపడింది…
Ads
కానీ ఈ గెల్లు శ్రీనివాసుడి అభ్యర్థిత్వం మీదనైనా కేసీయార్ ఆలోచనలు నిలకడగా ఉంటాయా..? చెప్పలేం… ఎందుకంటే, కేసీయార్ తన మనసులో ఉన్నదేమిటో ఎవరికీ చెప్పడు, చివరిదాకా రకరకాల ప్రచారాలు సాగుతూ ఉంటయ్… గెల్లు శ్రీనివాస్ కేటీయార్‌కే కాదు, హరీష్‌తోనూ బాగానే ఉంటాడు… నిజానికి హుజూరాబాద్ అభ్యర్థిత్వం తనకు అంత ఈజీ కాదు… రెడ్లకే టికెట్టు, కాదు, కాదు, ఎస్సీలకే టికెట్లు అనే పార్టీ ప్రచారం, పత్రికల ఊహాగానాలు అలా నడుస్తూ ఉంటయ్.., కేసీయార్ ఆలోచనలు కాస్త భిన్నంగా లెక్కలు వేస్తుంటయ్… అన్నింటికీ మించి ఇప్పుడప్పుడే ఉపఎన్నిక రాకపోవచ్చు… ఈ సందిగ్ధ స్థితిలో ఈ కొత్త పేరు అకస్మాత్తుగా తెర మీదకు రావడం కాస్త ఇంట్రస్టింగే…!! సార్, ఈ పేరైనా ఖాయం చేసుకోమంటారా..?!
Share this Article