తప్పు లేదు… తప్పలేదు… తప్పేలా లేదు… తప్పడం లేదు… తప్పనిపించడం లేదు… సో వాట్… రామోజీరావు అయితేనేం..? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వందల మెట్లు దిగాలి… తప్పదు… దిగకపోతే కల్వకుంట్ల తారకరాముడికి ఏమీ కోపం రాదు, తను తప్పని ఏమీ అనుకోడు, అసలు రామోజీరావు నుంచి ఈ లేఖ వస్తుందని తనూ అనుకోలేదు… కానీ వచ్చింది… వస్తుంది, రావాలి… గతంలో అయితే ఆశ్చర్యపడేవాళ్లం… కానీ ఇప్పుడు ఈనాడు స్థితి, తారకరాముడి సూపర్ స్థితిని పరిశీలిస్తే… రామోజీరావుడు కేటీయార్కు కీర్తిస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెబితే పెద్దగా ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదు… అనిపించదు కూడా… సారీ, అనిపించొద్దు కూడా… ఎందుకంటే… మరి ఇప్పుడు తెలంగాణ, కేసీయార్ అడ్డా…
బోలెడన్ని భాషల్లో ఈటీవీ చానెళ్లు ప్రారంభిస్తూ, చంద్రబాబును పిలిచి, జస్ట్, ఓ గెస్టుగా అతిథుల వరుసల్లో కూర్చోబెట్టి, రామోజీరావే స్వయంగా అన్ని చానెళ్లనూ ప్రారంభించిన దృశ్యాలు చూసినవాళ్లమే కదా… అదీ ఒకప్పుడు రామోజీరావు స్టేచర్… తను ఏది చెబితే అది శాసనం… అసలు సచివాలయం రామోజీ ఫిలిమ్ సిటీలో ఉందా అని ఆశ్చర్యపోయిన రోజులూ ఉన్నయ్… చంద్రబాబు తరచూ వెళ్లి రామదర్శనం చేసుకున్న రోజుల్నీ గమనించాం… కేంద్ర మంత్రులు కూడా, అంతెందుకు మోడీ నంబర్ టూ అనిపించుకునే అమిత్ షా కూడా ఆమధ్య స్వామివారి దర్శనం చేసుకున్న తీరూ గమనించాం… కానీ రోజులు మారాయి, మారుతున్నాయి, ఇంకా మారతాయి… తెలంగాణ వచ్చాక ఎన్నడూ లేనిది రామోజీరావు కేసీయార్ దర్శనానికి వెళ్లిన ఉదంతమూ గమనించాం కదా…
Ads
ఇప్పుడు కేటీయార్ రాచకుమారుడు, కాబోయే రాజు… వీళ్లు చెప్పినట్టు తలాడించే చంద్రబాబులు కారు… కాలేరు, కాకూడదు… అలాంటి ధృవ తార(క రాముడి) జన్మదిన సందర్భంగా మరి శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా..? గతంలో ఇలాంటి మర్యాదలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడు గమనిస్తున్నాం… తారకుడినీ, నీవంటి పుత్రుడిని కన్న తండ్రి జన్మ కూడా ధన్యం అని కీర్తిస్తే… ఒక్క లేఖకు రెండు కేరక్టర్లు ఫట్… నిజానికి ఈ లేఖ నిందార్హం కాదు… కానీ అలాంటి అలవాట్లు లేని రామోజీరావుడు రాయడమే ఓ విశేషం… చాలా అరుదు, చాలా చాలా… రాజకీయ యవనిక మీద వెలుగులీనుతున్న నవతరం ధృవతారకు అభినందనలు… ఎందుకంటే, రామోజీ లేఖ అంటే మామూలు విషయమా మరి..? జయహో రామోజీ, జయహో ఈనాడు, జయజయహో కేటీయార్, జయజయజయహో కేసీయార్… లక్ష నాగళ్ల సాగులా మీ స్నేహం వర్ధిల్లుగాక…!!
Share this Article