‘‘అవును, నేనే… మీ సైఖోమ్ మీరాబాయి చాను… ఒక్కసారి ఈ ఫోటో చూడండి…. నేనే… టీం ఇండియా అని రాసి ఉన్న మాస్కు… నా చేతిలో నా చిరకాల స్వప్నం ఈ రజతపతకం… దానిపైన ఒలింపిక్ రింగులు… కాదు, కాదు… నా చెవులకున్న రింగులు చూడండి… సేమ్, ఒలింపిక్ రింగులు డిజైన్… నాలో ఎప్పటికప్పుడు ఈ ఒలింపిక్ లక్ష్యం సన్నగిల్లకుండా ఉండేందుకు, నాలో ఉత్తేజాన్ని నింపేందుకు… మా అమ్మ ప్రత్యేకించి చేయించిన చెవిరింగులు… అయిదేళ్ల క్రితం ఇవి నాకు ఇవ్వడానికి తనకున్న కొద్దిపాటి బంగారాన్ని వెచ్చించింది అమ్మ… పతకం సాధించాక అమ్మతో వీడియో కాల్ మాట్లాడాను… ఏడుస్తూనే చెబుతోంది… ‘‘చుట్టుపక్కల ఉన్న ఒలింపిక్ రింగులకన్నా నీ చెవిరింగులే ఎక్కువ మెరిశాయి బిడ్డా’’ అంటూ మురిసిపోయింది… అవును, మై లక్కీ రింగ్స్… నిజానికి ఈ పతకం అమ్మదే… అమ్మ లేకపోతే ఈ పతకమే లేదు… ఇంటికి పోగానే అమ్మ మెడలో వేయాలి దీన్ని… ఇది అమ్మ కల… మీకు తెలుసా…? మాది మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే నాంగ్పాక్ కాచింగ్… అమ్మ చిన్న టీకొట్టు నడిపేది… పేరు చెప్పనేలేదు కదూ… సైఖోమ్ ఒంబి టొంబి లీమా… లీమా అని పిలవండి చాలు…
అమ్మకు మొత్తం ఆరుగురు… ఇద్దరు అన్నలు, నలుగురం అక్కాచెల్లెళ్లం… నేనే చిన్నదాన్ని… మా వంట చెరుకు కోసం సమీపంలోని గుట్టల పైకి, చెట్లలోకి వెళ్లి తెచ్చుకోవడం మాకు అలవాటే… ఓసారి అలాగే వెళ్లాం… కట్టెలమోపు కాస్త బరువు ఎక్కువైంది… అన్న ఎత్తలేకపోయాడు, దాన్ని మోయడం నాకు పెద్దగా కష్టమేమీ అనిపించలేదు… ఎత్తుకుని ఇంటికి తెచ్చేశాను… చుట్టుపక్కలవాళ్లలో ఆశ్చర్యం… వాళ్లే నా బుర్రలోకి వెయిట్‌లిఫ్టింగ్ గురించి ఎక్కించారు… నిజానికి నాకు కాదు, అది మా అమ్మ బుర్రలోకి బలంగా ఎక్కింది… ఇంఫాల్లోనే, మా మీతీ తెగలోనే పుట్టిన కుంజరాణి దేవిలాగా నన్ను తయారు చేయాలి… అదీ అమ్మ టార్గెట్ అయిపోయింది… కుంజరాణి తెలుసు కదా, కామన్వెల్త్లో గోల్డ్ కొట్టింది… దాదాపు యాభై అంతర్జాతీయ పతకాలు సాధించింది… సీఆర్పీఎఫ్లో చేరింది… పద్మశ్రీ, అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న… నేను ఆమె అవుతానా..? నా వల్ల అవుతుందా..? నా ప్రశ్నకు అమ్మ చెప్పింది జవాబు… ‘‘ఎందుకు కావో చూద్దాం…’’
Ads
కానీ ఎలా..? దగ్గరలోని వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ 22 కిలోమీటర్లు… రోజూ పొద్దున్నే లేపేది అమ్మ… తయారు చేసేది, ఆ సెంటర్‌కు వెళ్లడం, రావడం… అలిసిపోయేదాన్ని… మళ్లీ బడికి వెళ్లాలి… క్లాస్‌రూంలో చాలాసార్లు పాఠాలు వింటూనే నిద్రపోయేదాన్ని… నాకన్నా బరువులు ఎత్తుతుంటే అలవాటులేని ఒళ్లు నొప్పులు… అమ్మే మసాజ్ చేసేది… కొన్నిసార్లు రెండేసి గంటల చొప్పున రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ ఉండేది… అలవాటు అయిపోయింది… నేను కుంజరాణిని అయిపోతున్నాను… పతకాలు వస్తున్నయ్… టార్గెట్ రియో ఒలింపిక్స్… కానీ నా కల చెదిరింది, బద్దలైంది… నాకేమైందో అర్థం కాలేదు… బిగదీసుకుపోయాను… దేహం సహకరించలేదు… కన్నీళ్లతో నిలువునా కూలిపోయాను… నాకన్నా అమ్మే ఎక్కువ బాధపడింది… కానీ అమ్మ కదా… బయటపడలేదు… నన్ను ఓదార్చేది… ‘‘అమ్మా, నేనిక ఈ వెయిట్ లిఫ్టింగ్ వదిలేస్తాను’’ అని ఏడ్చేదాన్ని… అప్పుడు అమ్మే… ‘‘ఇన్నేళ్లు ఇంత కష్టపడింది, జస్ట్, వదిలేయడానికేనా..?’’ అనే ఒకేమాటలో కొట్టిపారేసేది… మళ్లీ జిమ్ బాటపట్టాను… ఆ ఓదార్పు లేకపోతే నేనెప్పుడో ఈ వెయిట్ లిఫ్టింగ్ వదిలేసేదాన్ని… అందుకే చెబుతున్నాను కదా… ఈ పతకం అమ్మది… అమ్మను చూపిస్తాను, చూడండి…
Share this Article