సిగ్గూశరం లేని మెయన్ స్ట్రీమ్ పాత్రికేయం… ప్రజానీకానికి నయాపైసా ఉపయోగం లేదు, నిజాలు చెప్పదు, నిక్కచ్చిగా ఉండదు, పాదపూజలకు ఫేమస్, జోకుడుకు పాపులర్, కరపత్రాలకు తక్కువ, తుక్కు కాగితాలకు ఎక్కువ… టీవీలయితే మరీ దరిద్రం… అంతా ఆటోస్పై పరిజ్ఞానమే… చివరకు ఈ దరిద్రం ఎక్కడిదాకా తగలడిందీ అంటే…. టోక్యో ఒలింపిక్సులో మన మీరాబాయి చాను రజతం గెలుచుకోవడంలో… ఇదుగో, ఈ తెలుగోడి పాత్ర కూడా ఉందట… ఇదుగో, వీడెవడో రాస్తున్నాడు చూడండి… ఈ మహత్తర విజయంలో చాను కష్టం, త్యాగంతోపాటు ఈ తెలుగోడి పాత్ర కూడా మస్తు పనిచేసిందట… రాసేవాడికి చదివేవాడు లోకువ… అచ్చేసే మహాజ్ఞానులకు మరీ లోకువ… ఆ మీడియా ఓనర్లకు మరీ మరీ లోకువ…
నిజం,.. ఓటమి ఓ అనాథ… పలకరించేవాడు ఉండడు, పక్కనున్నవాడే వదిలేసి వెళ్లిపోతాడు, కన్నీటిని తుడిచేవాడు కాదు కదా, కనీసం వెన్నుతట్టి బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అనే గాడిదకొడుకులే ఉండరు… ప్రపంచమంతా అంతే… ఒక చిన్న తేడా, మరీ చిన్న తేడా కూడా ఒకరిని విజేతల్ని చేస్తుంది, మరొకర్ని పరాజితుల్ని చేస్తుంది… అక్కడి దాకా చేర్చిన శ్రమను, సంకల్పాన్ని, ప్రయాసను ఎవడూ పట్టించుకోడు… అదృష్టం వరించిన వాళ్లనే ఆకాశానికి ఎత్తుతారు… జస్ట్, గెలుపునాదం వినిపిస్తే చాలు, ఎవడెవడో చేరిపోతాడు, ఓన్ చేసుకుంటాడు, అందరికన్నా ఎక్కువ డప్పు కొడతాడు… మీరాబాయ్ చాను కథా అంతే… రియో ఒలింపిక్సులో ఓడిపోయి ఏడిస్తే, అమ్మ తప్ప కన్నీళ్లు తుడిచి, అక్కున చేర్చుకుని, ధైర్యం చెప్పినవాడు లేడు… ఇదుగో, గెలవగానే అందరూ ఆ విజయంలో వాటా కోసం ‘‘ఏడుస్తున్నవాళ్లే…’’
Ads
అప్పుడెప్పుడో పీవీసింధు పతకం సాధించాక… రెండు రాష్ట్రాలూ పోటీలుపడి సత్కరించి, మా అమ్మాయే మా అమ్మాయే అని ఓన్ చేసుకోవడానికి తన్నుకున్న సంగతి గుర్తొచ్చింది… చివరకు కేసీయార్ అయితే కోచ్‌తోపాటు అక్కడి న్యూట్రషనిస్టు, ఆమె పర్సనల్ కేర్‌టేకర్ సహా ఆ అకాడమీలో అందరికీ నగదు బహుమతులు ఇచ్చిన తీరు…. తరువాత ఆమె తెలంగాణ ఇవ్వదలిచిన జాగా తప్ప, మొత్తం ఏపీ ప్రభుత్వమే నాది, ఏపీ మూలాలే నావి అని ఓన్ చేసుకుని, ఫోఫోవోయ్ కేసీయారూ అని తిరస్కరించిన తీరూ గుర్తొచ్చింది… ఐనా కేసీయార్ అంటే అంతే కదా… ప్రతి అడుగులోనూ అదృష్టం తప్ప అన్నీ అనాలోచితాలే కదా… చివరకు సానియాకు కోట్లకుకోట్లు కట్టబెట్టినా ఆమె నయాపైసా ఉపయోగపడ్డది లేదు… సరే, కేసీయార్ నిర్ణయాల గొప్పతనం వేరే కథ… ఇదుగో, చాను విజయంలో వంటవాడి పాత్ర కూడా బాగా ఉందట… అయ్యో, ఆమె పర్సనల్ కుక్ కాదులే… నాలుగేళ్లుగా పాటియాలాలోని ఎన్ఐఎస్లో ఉద్యోగి… పేరు కేవీ కోటేశ్వరరావు….
నాలుగేళ్లుగా చానుకు పర్సనల్ మసాజర్ అట… సెల్లీ అని పిలిచేవాడట… తరువాత పర్సనల్ వంటవాడిగా మారాడట… ఓహో, ఇలా క్రీడాకారులకు వ్యక్తిగత వంటవాళ్లను కూడా అరేంజ్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం… కారం ఉంటున్నాయి అంటే, కాస్త కారం తగ్గించి, ఆంధ్రా స్టయిల్లో చికెన్, మటన్ వండిపెట్టేవాడట… చేపలయితే చెప్పనక్కర్లేదు… అరె, ఈనాడు వాడు రాశాడు, నమ్మరా ఏమిటి..? ఆమె పతకం గెలవగానే బోలెడు మంది ఆమె కులం ఏమిటో గూగుల్‌లో వెతికారు, ఏ లింకులూ దొరకలేదు… ఆమె మీతీ అనే ఓ పురాతన తెగకు చెందిన మనిషి… వదలకుండా ఇదుగో, ఇలా ఈ కోటేశ్వరరావు పేరుతో ఆమె గెలుపును ఓన్ చేసుకుంటున్నది ఈనాడు మార్క్ సమాజం…
ఎస్, ఒక గెలుపును ఓన్ చేసుకునే చుట్టాలు చాలామంది ఉంటారు, సహజమే… ఆమెతో తమ అనుబంధాన్ని నెమరేసుకునే వాళ్లూ ఉంటారు… ఆమె హెయిర్ డ్రెస్సర్, పర్సనల్ అసిస్టెంట్, ఆమె కారు డ్రైవర్ గట్రా అందరూ ఆ గెలుపును ఆస్వాదించొచ్చుగాక… కానీ మరీ ఆమె కాళ్లకు మసాజ్ చేసేవాళ్లను కూడా ఆమె గెలుపులో వాటాదారుగా చెప్పడం జస్ట్, ఈనాడు దరిద్ర పాత్రికేయం… ఈ మాట అనడానికి సాహసిస్తున్నాను… కోచ్ శ్రమతోపాటు మసాజర్ పాత్ర కూడా గెలుపులో ఉందని రాయడం అంటే మొత్తం తెలుగు ప్రజలు, పాఠకుల విజ్ఞతను పరిహసించడమే… అవున్లెండి, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఈనాడు ఉంటే కదా… ఒక వాక్యానికి అవకాశం లేకుండా పోయింది, తెలుగు మనిషి కాదు కదా, లేకపోతే కులాన్నో, ప్రాంతాన్నో ముడిపెట్టి కీర్తించేవాళ్లు, ఏదీలేకపోతే… ఆమె ఈనాడు పాఠకురాలు కావడమే ఆమె గెలుపుకు పునాదులు వేసింది అనైనా రాసుకునేవాళ్లు…!! మిత్రుడు బుద్ధా మురళి చెప్పినట్టు, ఆమె టోక్యో వెళ్లేటప్పుడు విమానాశ్రయానికి సకాలంలో తీసుకెళ్లిన ఆమె కారు డ్రైవర్‌కు ఈ ఘనతలో వాటా ఎందుకు దక్కకూడదు…!! (సపోర్ట్ ముచ్చట… Go To Donate Button… Support Independent Journalism…)
Share this Article