.
( రమణ కొంటికర్ల 99126 99960 ) …. పెరోల్ పై పెళ్లైంది.. కొత్త జీవితం మాత్రం ఇంకా జైలు గోడల మధ్యే బందీ అయింది! ఏంటీ ఈ గ్యాంగ్ స్టర్ స్టోరీ..? ఎవరా కాంబోడియా ప్రియురాలు? సినిమా కథ కాదు, నిజమే…
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా అంటు పెళ్లి మంత్రం మోగుతోంది. అందుకు అగ్నిహోత్రుడు దైవసాక్షిగా ఉంటే… చుట్టూ పోలీసులు కావల్సినంతమంది మానవ సాక్షులుగా నిల్చున్నారు. ముగ్గురు పిల్లలతో తల్లి ఓవైపు పెళ్లి తంతులో భాగమవుతూనే… మరోవైపు, తన పిల్లల్ని ఓదారుస్తోంది. వరుడి చేతులకు బేడీలున్నాయి. కానీ అవి పెళ్లి మంటపంలో ఎవ్వరి కంటా పడకుండా క్లాత్ తో కవర్ చేస్తున్నారు.
Ads
ఈ మాటలు విన్నాక మనలో చాలా ప్రశ్నలే మొదలవుతాయి. అందేటి పోలీసులు పెళ్లికి సాక్షులేంటి…? పిల్లల తల్లికి పెళ్లేంటి..? పిల్లలను తల్లి ఓదార్చడమేంటి..? పెళ్లి మంటపంలో కూర్చున్న వరుడి చేతికి హ్యాండ్ కఫ్స్ ఏంటి… వాటిని మధ్యమధ్యలో పోలీసులు కవర్ చేయడమేంటి..? ఏంటీ డ్రామా అనిపిస్తుందా..?
ఇవన్నీ వన్ బై వన్ కనిపించే సినిమా సీన్స్ కావు. హర్యానాలో అసాధారణ రీతిలో జరిగి, చర్చనీయాంశమైన ఓ పెళ్లి.
50 ఏళ్ల నడి వయస్సులో గ్యాంగ్‌స్టర్ మైన్‌పాల్ ధిల్లాకు పెళ్లి చేసుకోవడానికి 12 గంటల పెరోల్ లభించింది. ఉదయం 8 గంటల నుంచి జైలు నుంచి బయటకొచ్చిన అతడు… 37 ఏళ్ల కంబోడియా మహిళ మెటాచాన్‌ను పెళ్లి చేసుకుని.. అదే రోజు తిరిగి మళ్లీ 8 గంటలకు జైలుకు వెళ్లాలి.
కంబోడియాకు పారిపోయి ప్రేమలో పడ్డ గ్యాంగ్ స్టర్!
హర్యానాలోని బాద్లీ గ్రామానికి చెందిన ధిల్లా గతంలో ఓ ట్రాక్టర్ మెకానిక్. 2000లో ఓ హత్య కేసుతో నేర జీవితం ఆరంభమైంది. ఆ తర్వాత మరిన్ని హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, నేరపూరిత కుట్రలు, అక్రమ ఆయుధాలు కల్గి ఉండటం వంటి 22 క్రిమినల్ కేసులు నమోదై.. హర్యానాలోనే పేరుమోసిన గూండాగా ఎదిగాడు. ఇదే సమయంలో పలు కేసుల్లో నేరాలు నిరూపితమై.. ఏకంగా జీవితఖైదునే అనుభవిస్తున్నాడు.
ఆ క్రమంలో 2018లో ఆరు వారాల పెరోల్‌పై హిసార్ జైల్ నుంచి బయటకొచ్చిన ధిల్లా.. తిరిగి జైలుకు వెళ్లకుండా పారిపోయాడు. హర్యానా నుంచి కోల్ కత్తా వెళ్లి.. అక్కడి నుంచి బ్యాంకాక్ మీదుగా కంబోడియాలోని సీమ్ రీప్ ప్రాంతానికి చేరుకున్నాడు. నకిలీ పత్రాలతో సోనుకుమార్ పేరిట పాస్‌పోర్ట్ సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు.
సీమ్‌రీప్‌లో వ్యాపారం ఆరంభించాడు. అక్కడ ఓ నైట్ క్లబ్ కూడా మొదలెట్టాడు. అక్కడే మెటాచాన్ అనే మహిళ మైన్‌పాల్‌కు పరిచయమైంది. ఇద్దరూ సహజీవనం ఆరంభించారు. పిల్లలు పుట్టారు. పెంచుకుంటున్నారు. ధిల్లాకు కంబోడియాలో పిల్లలున్నారనే విషయం తను భారత్ కు తిరిగి వచ్చేవరకూ కూడా ఎవ్వరికీ తెలియదు.
2024లో సీబీఐ అభ్యర్థనతో ధిల్లాపై ఇంటర్ పోల్ రెడ్ నోటీస్ జారీ అయింది. 2025 జూలైలో కంబోడియా అధికారులు అతణ్ని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్‌లో హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం అతణ్ని భారత్‌కు తీసుకొచ్చింది.

వధువు చుట్టూ అపరిచితులే!
మైన్‌పాల్‌ను ఇండియన్ పోలీసులు తీసుకొచ్చిన దాదాపు ఏడాది తర్వాత.. ఆ ముగ్గురు పిల్లల తల్లి మెటా… తన పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చింది. మైన్‌పాల్‌కు, మెటాకు పెళ్లికి రంగం సిద్ధమైంది. మెటా బంధువులు, కుటుంబీకులెవ్వరూ లేకుండానే పెళ్లి జరుగుతోంది. కేవలం అక్కడ ఖైదీ మైన్‌పాల్ బంధువులు, మహిళా కానిస్టేబుల్స్ మాత్రమే ఆమె చుట్టూ ఉన్నారు. ఆమెకెమో హిందీ రాదు.. అక్కడున్నవారికి ఇంగ్లీష్ రాదు.. దాంతో మాటల్లేని, సంజ్ఞలతో మాత్రమే నడిచే మరో పుష్పక విమానం సినిమాలా సాగింది ధిల్లా, మెటా పెళ్లి తంతు.
తుపాకుల నీడలో పెళ్లి… పోలీసుల బూట్ల చప్పుళ్లే భాజాబజంత్రీలు!
గురుగ్రామ్ – ఝజ్జర్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌజ్‌లో ధిల్లా, మెటా పెళ్లి జరిగింది. బయట సుమారు 50 కార్లున్నాయి. కానీ, సాధారణ పెళ్లిళ్లల్లో కనిపించే అలంకరణలు మాత్రం లేవు. మంటపాల్లో పెళ్లికొచ్చిన అతిథులను ఆహ్వానించేందుకు పూలిస్తూ.. అత్తరు చల్లడం చూస్తుంటాం. కానీ, ధిల్లా పెళ్లి మంటపంలో మాత్రం.. గేట్ దగ్గర పోలీసులు ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేస్తూ లోనికి పంపిస్తున్నారు. వచ్చినవారి అడ్రసులతో సహా నమోదు చేసుకున్నాకే లోనికి ఎంట్రీ అన్నారు. మీడియానూ లోనికి అనుమతించలేదు.
మంటపం చుట్టూ సాయుధ పోలీసులు నిలబడితే.. చేతులకు సంకెళ్లతో.. వాటిని కవర్ చేసే పోలీసులతో… ఇంకోవైపు ఆలసించిన ఆశాభంగమన్నట్టుగా ముహూర్తం దాటొద్దని పురోహితుడి వేగం.. ఇలా పొంతన లేని భిన్న దృశ్యాల కలయికలా ధిల్లా, మెటా పెళ్లి తంతు పూర్తైంది.
రాత్రి ఎనిమిదే డెడ్ లైన్!
హర్యానా చట్టం ప్రకారం కస్టడీ పెరోల్ అనేది సాధారణంగా నిర్దిష్ఠమైన ప్రయోజనాల కోసం ఇచ్చేది. పోలీసుల ఎస్కార్ట్‌తో ఖైదీని బయటకు తీసుకొస్తారు. అయితే ధిల్లా- మెటా వివాహానికి పంజాబ్- హర్యానా హైకోర్ట్ కేవలం 12 గంటల సమయం మాత్రమే ఇచ్చింది.
పెళ్లితోనైనా ధిల్లా మారాలని.. ఆల్రెడీ పిల్లలున్న తల్లిదండ్రులుగా నూతన వివాహం చేసుకున్న ధిల్లా- మెటా జంట ఆనందగా బతకాలని చాలామంది ఆశీర్వదించారు. మరికొందరమో ధిల్లాకు ఈ పెళ్లితోనైనా మరో కొత్త ఉదయం రావాలని.. అన్నింటినీ వదిలేసి జీవితాన్ని హాయిగా గడపాలని ఇలా రకరకాలుగా కోరుకున్నారు.
పైగా ధిల్లా పెళ్లికి ముందే మస్త్‌నాథ్ సంప్రదాయానికి చెందిన 15 మంది బాబాలు కూడా ఫామ్‌హౌజ్‌కు వెళ్లి ధిల్లా – మెటా దంపతలను ఆశీర్వదించారు.
భారత్‌లో జీవితఖైదుననుభవిస్తూ పెరోల్‌పై బయటకొచ్చి.. కాంబోడియా పారిపోయి కుటుంబాన్నేర్పాటు చేసుకున్న ధిల్లా.. చివరకు చేతులకు సంకెళ్లతో తిరిగి రావడం… పిల్లల తండ్రయ్యాక ఆ సంకెళ్లతోనే పెళ్లి చేసుకోవడం.. సరిగ్గా 12 గంటల వ్యవధిలోనే మళ్లీ జైలుకు వెళ్లిపోవడం ఓ డ్రామాను తలదన్నేలా ఉంది కదా..?!
Share this Article