.
తమిళుల భాషాభిమానం తెలిసిందే. కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగువారికి అలా తెలుగుమీద అభిమానం ఉంటే బాగుండేది. కానీ ఎందుకో మన రక్తంలో అది లోపించింది. చెన్నయ్ లో వేద విజ్ఞాన వేదిక నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లి… చెన్నయ్ లో తిరుగుతున్నప్పుడు ఒక మిట్టమధ్యాహ్నం పూట ఓ క్యాబ్ ఎక్కాను.
నాకు తమిళం రాదు, అర్థమూ కాదు. దాంతో క్యాబ్ ఎక్కగానే హిందీ, ఇంగ్లిష్ అర్థమవుతుందా అని డ్రయివర్ ను అడిగాను. ఇంగ్లిష్ ఓకే అన్నాడు. ఏ ఊరు మీది అని అడిగాను. తేని జిల్లా అన్నాడు. మొన్ననే చనిపోయిన ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా అక్కడివాడే, కొడైకెనాల్ కు వెళ్లే దారిలో కదా? అన్నాను. అతను పొంగిపోయాడు.
Ads
ఆయన ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో అతడి సొంత ఊరట. ఇళయరాజా అక్కడివాడే. వైరముత్తు అక్కడివాడే అని పులకింతగా చెప్పాడు. వైరముత్తు నీలిమంటలు, నది భాషలు, రాయలేని మాటలు తెలుగులో అనువాదమైనవి తెలుసని ఇంగ్లిష్ లో చెప్పాను. అంతే- అతను గాల్లో తేలిపోతున్నాడు. వైరముత్తు కవితల్లో ఆధునికతతో పాటు అంతర్లీనంగా మూలాల వెతుకులాట ఎంత ఉంటుందో చెప్పుకుపోతున్నాడు.
వైరముత్తు తమిళ కవిత్వ అందాలను ఒక క్యాబ్ డ్రయివర్ అలా ఇంగ్లిష్ లో అనర్గళంగా చెబుతుంటే నాకు భోంచేయకముందే కడుపు నిండిపోయింది. బిఎస్సి డిగ్రీ పూర్తీ చేసి చెన్నయ్ కి వచ్చి… ఏవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చివరకు క్యాబ్ డ్రయివర్ అయ్యాడట. నీ బీఎస్సికి ఈ వైరముత్తు తమిళ ఆధునిక కవిత్వానికి పొత్తే కుదరదు కదా? అన్నాను.
మా ఊరివాడు సార్. నేనేరోజూ ఆయన్ను కలవలేదు. కానీ రోజూ ఆయన నాతో, నాలా ఎందరితోనో మాట్లాడుతూనే ఉన్నాడు- అన్నాడు. నేనంటే తమిళుడిని. మీరు తెలుగువారై ఉండి వైరముత్తువి ఇన్ని కవితలు చెబుతున్నారు-ఎలా? అని అడిగాడు.
నేను సాహిత్య విద్యార్థిని. ఆసక్తికొద్దీ ఏదో కొంచెం తెలుసుకుంటూ ఉంటానని చెప్పాను. ఒకటి, రెండు వివాదాల్లో ఉన్నా వైరముత్తు వైరముత్తే సార్. తమిళ పొయెట్రీని మాడరనైజ్ చేశాడు అని నిష్పాక్షికంగా, స్పష్టంగా చెప్పాడు. వైరముత్తుకు జ్ఞానపీఠం చాలా చిన్నది అన్నట్లు చెప్పుకుంటూ పోయాడు.
ఈలోపు నేను దిగాల్సిన చోటు వచ్చింది. “Thank you sir, you made me to recall many great poems of Vairamuttu” అంటూ కళ్ళల్లో కాంతితో కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు.
ఒక సగటు తెలుగు అభిమానిగా హైదరాబాద్ లో లేదా విజయవాడ, విశాఖపట్టణంలో క్యాబ్ డ్రయివర్లెవరైనా ఇలాగే తమిళనాడు నుండి వచ్చి తెలుగు తెలియనివారికి ఇంగ్లీషులో ఇలాగే జ్ఞాన పీఠ అవార్డు గ్రహీతలైన మన విశ్వనాథ గురించో, సినారె గురించో, రావూరి భరధ్వాజ గురించో చెబితే వినాలని ఉంది. కనీసం తెలుగులో చెప్పినా వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలని ఉంది.
ఎన్నెన్నో అనుకుంటాం! అన్నీ అవుతాయా? నిజమే! భాషాభిమానం విషయంలో మనం మనమే. ఎవ్వరితో పోల్చుకోకూడదు! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article