Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’

September 30, 2026 by M S R

.

ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ… మూసేశాం… ఓ చిన్నారికి జడ్జి లేఖ… కనెక్టింగ్ రెస్పాన్స్… 

అభంశుభం తెలియని ఏడేళ్ల పసిమొగ్గపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం జీవిత ఖైదు ఖరారు చేసింది. “ముసలివాడయ్యే వరకు జైల్లోనే ఉంచాలి” అంటూ ఆ చిన్నారి కోర్టులో నిర్భీతిగా వేడుకోగా.. అసాధారణ మానవతా దృక్పథంతో న్యాయమూర్తులు స్పందించారు. దోషి అప్పీల్‌ను తోసిపుచ్చడమే కాకుండా, బాధితురాలికి అండగా నిలుస్తూ ఒక వ్యక్తిగత లేఖను రాసి అందించాలని న్యాయసేవల సంస్థను దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Ads

కేసు వివరాలు ఇవీ… 2023లో దిల్లీలోని బుధ్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సుమిత్ శాక్య అనే వ్యక్తి ఏడేళ్ల చిన్నారిపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ దారుణంపై చిన్నారి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా తన తల్లికి చెప్పింది. ట్రయల్ కోర్టులో విచారణ సందర్భంగా ఆ పసిపాప ఏమాత్రం బెదరకండా దోషిని వేలెత్తి చూపించి ‘అదిగో.. ఆ చెడ్డ అంకులే’ అని నిలదీసింది.

ఈ కేసును విచారించిన రోహిణి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి రజనీ రంగ.. నిందితుడు సుమిత్ శాక్యకు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు (ఆ వ్యక్తి  జైలులోనే ముసలివాడై, అక్కడే చనిపోయేలా… lifelong) రూ. లక్ష జరిమానా విధించారు. అలాగే క్రిమినల్ బెదిరింపులకు పాల్పడినందుకు మరో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఖరారు చేశారు. ట్రయల్ కోర్టు నిర్దేశించిన రూ. 10.50 లక్షల పరిహారాన్ని కూడా బాధితురాలికి అందజేయాలని ఆదేశించారు.

హైకోర్టులోనూ చుక్కెదురు… ట్రయల్ కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు శిక్షను సవాల్ చేస్తూ దోషి సుమిత్ శాక్య దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే, కేసులోని ఫోరెన్సిక్ సాక్ష్యాలు, రికార్డులను పరిశీలించిన దిల్లీ హైకోర్టు ధర్మాసనం (జస్టిస్‌ ప్రతిభా ఎం. సింగ్, జస్టిస్‌ దినేశ్‌ భట్‌) దోషి అప్పీల్‌ను తిరస్కరించింది.

అసాధారణ లేఖ.. న్యాయమూర్తుల ప్రశంసలు… ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు జడ్జి రజనీ రంగ తీర్పు చివర్లో రాసిన ఒక వ్యక్తిగత లేఖను హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.

  • “పాపా! కోర్టు నువ్వు చెప్పినదాన్ని ఆలకించింది. ముసలివాడయ్యేవరకు అంకుల్‌‌ను జైల్లోనే ఉంచాలన్నావుగా.. ఈ రోజు మేం అదే ఆదేశాలిచ్చాం. జైల్లోనే ముసలివాడవుతాడు. నిన్ను గానీ, మీ చెల్లిని గానీ, మరే ఇతర చిన్నారిని గానీ అతడు ఇక ఏమీ చేయలేడు. నీ అంత ధైర్యం ఉన్న బాలికను ఈ కోర్టు ఎప్పుడూ చూడలేదు.. బేటా! నీ బతుకు నీది. స్కూలుకు వెళ్లు. స్నేహితుల్ని పెంచుకో, కలలుగను” అంటూ ఆ జడ్జి రాసిన భావోద్వేగ సందేశాన్ని హైకోర్టు కొనియాడింది.

ఈ లేఖను, ట్రయల్ కోర్టు ప్రకటించిన రూ. 10.50 లక్షల పరిహారాన్ని ప్రింట్ తీసి రెండు వారాల్లోగా బాధితురాలి కుటుంబానికి తప్పనిసరిగా అందజేయాలని వాయవ్య దిల్లీ న్యాయసేవల సంస్థ (DLSA)ను హైకోర్టు ఆదేశించింది. నిందితుడు ఇకపై స్వేచ్ఛాజీవిలా సూర్యుడిని ఎప్పటికీ చూడలేడని, పసిపాప చూపిన అసాధారణ తెగింపు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని న్యాయవర్గాలు ప్రశంసిస్తున్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!
  • చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’
  • కాళేశ్వరం బ్లండర్స్‌..! నిపుణులకూ రిపేర్ ప్లాన్స్ అంతుబట్టడం లేదు..!!
  • ‘ఏం చేస్తరు? ఉరి తీయరు కదా? – మేడారం నుంచి వాషింగ్టన్ !!
  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions