.
Murali Buddha ….. కల్కి చనిపోయాడట … మూడేళ్ళ క్రితం ‘కల్కి’ల వ్యాపారంపై రాసిన పోస్ట్ … మీడియా మాయాజాలం – కల్కి మహత్యం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు …
మోకాలికి , బోడిగుండుకు సంబంధంలా మీడియాకు , కల్కికి సంబంధం ఏమిటి ? అనిపించవచ్చు. ఇప్పుడు మీడియా , బాబాలు ఒకే సిద్ధాంతంతో పని చేస్తున్నారు. ప్రజల నమ్మకాలతో ఆడుకునే ఓ స్వామీజీ ఈ విషయంపై నాకు జ్ఞానోదయం కలిగించారు.
Ads
2009 ఎన్నికల సమయంలో పేజీలకుపేజీలు ఈనాడులో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వార్తలు వండి వార్చేవారు. కంటి ముందు ఇలా కనిపిస్తున్నా అసలెలా రాస్తారు’ అని ఈనాడులో పని చేసే ఓ మిత్రుడిని అడిగితే, అతను చెప్పిన సమాధానం, కల్కి గురించి అతని శిష్యుడు బయటపెట్టిన విషయం, రెండింటి వెనుక ఫార్ములా ఒకటే … మీడియా మాయాజాలం, కల్కి మాయలూ రెండూ ఒకటే అనిపించింది . ఆ వివరాల్లోకి వెళితే …
****
ఇప్పుడు ఏమయ్యాడో? ఎక్కడున్నాడో తెలియదు. కానీ ఓ పదేళ్ల క్రితం వరకు కల్కి భగవాన్ ఓ వెలుగు వెలిగారు. ఆయన ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగిన తర్వాత ఏమయ్యాడో తెలియదు . మీడియా కూడా దృష్టి పెట్టలేదు. అంతకు ముందు ఎక్కడ చూసినా కల్కి పేరు మారుమ్రోగింది .
ఒక విషయంలో కల్కిని మెచ్చుకోవాలి . చాలా మంది తాము దేవుని అవతారం అని చెప్పుకుంటారు . కల్కి మాత్రం తాను దేవుడిని అని చెప్పుకోవడంతో పాటు, తన భార్యను దేవతగా చెప్పేవారు . ఆ జంట ఫోటోలను భక్తులు పూజించేవారు.
న్యూస్టైంలో కల్కి గురించి, ఆశ్రమంలో జరిగే వ్యవహారాల గురించి వరుస కథనాలు వచ్చాయి . మిగిలిన పత్రికల్లో వచ్చినా , న్యూస్టైంలో ప్రాధాన్యత ఇచ్చారు . ‘ఆ సమాచారం మొత్తం మీడియాకు నేనే ఇచ్చాను’ అని కల్కి శిష్యుడు అజయ్ భగవత్ పాద ఓసారి కలిసినప్పుడు చెప్పారు .
అప్పుడు పోలీస్ బాస్‌గా ఉన్న భాస్కర్‌రావుకు చెందిన భవనంలో బంజారాహిల్స్‌లో అజయ్ భగవత్ పాద ఉండేవారు . వార్తా సేకరణలో భాగంగా కాకుండా ఓ ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళాను . ఫ్రెండ్ అజయ్ భగవత్ పాదను పరిచయం చేశారు. చాలాసేపు మాట్లాడాను . అప్పుడు నేనో సందేహం అడిగాను.
“నేను మిమ్ములను అవమానించాలి అని అడగడం లేదు. కేవలం నా సందేహం తీర్చుకోవాలి అని అడుగుతున్నాను” అని ముందే చెప్పి అడిగాను . “నేనే దేవుడిని అని చెప్పడం , బాబాలకు శక్తులు అన్నీ బోగస్ . ఆ సంగతి నాకు తెలుసు. మీకూ తెలుసు. ఎంతో మంది బాబాలు మహిళలపై అత్యాచారాలు చేశారు. భక్తుల నమ్మకాలను సొమ్ము చేసుకున్నారు . ఈ వార్తలు రోజూ పత్రికల్లో వస్తూనే ఉన్నాయి . ఐనా ఈ స్వాములు రోజూ పుడుతూనే ఉంటారు . భక్తులు వస్తూనే ఉన్నారు , మోసపోతూనే ఉంటారు . ఇదెలా సాధ్యం” అని నా సందేహం బయటపెట్టాను .
ముందుగా భగవత్ పాద గురించి చెప్పాలి. ఓ పెద్ద కంపెనీలోనే మార్కెటింగ్ విభాగంలో జనరల్ మేనేజర్‌గా చేసేవారు . కల్కి శిష్యుడిగా మారాడు . చదువుకున్న వ్యక్తి , మార్కెటింగ్ విభాగంలో పని చేసిన అనుభవం వల్ల తక్కువ సమయంలోనే కల్కికి దగ్గరయ్యారు. కల్కి దందాలు తెలుసుకున్నాడు.
క్రైస్తవులు ఒక బాక్స్‌లోకి వెళ్లి తమ పాపాలు చెప్పుకొని ఉపశమనం పొందినట్టు కల్కి వరపూజ అని ఒకటి ప్రవేశపెట్టారు. భక్తుల గుంపులో కల్కి మనుషులు కొందరు చేరి, కొద్దిసేపటి తరువాత జీవితంలో తాము చేసిన తప్పులు చెప్పి ఏడ్చేవారు . వారిని చూసి మిగిలిన వారు . ఐతే అంతా కళ్ళు మూసుకొని ఉండాలి. ఏడ్చాక తమ తలపై ఎవరో తడితే భగవంతుడు వచ్చి తట్టాడు అనుకునేవారు.
కష్టాలు చెప్పుకున్న తర్వాత , ఏడ్చిన తర్వాత మనసు తేలిక పడుతుంది . వరపూజలో దేవుడు తమను ఎలా కరుణించాడో కథలు కథలుగా చెప్పేవారు. ఇందులో నుంచి సంపన్న భక్తులు , మహిళా భక్తులు కొందరిని టార్గెట్ చేస్తారు.
దీన్ని దగ్గర నుంచి చూసిన అజేయ భగవత్ పాద కల్కి సాగిస్తున్న మొత్తం వ్యవహారాన్ని మీడియాకు చెప్పారు. ఆ సమయంలో న్యూస్టైంలో రాసిన కథనాలకు భక్తులు కార్యాలయంపై దాడికి వెళ్లారు. కల్కి దగ్గర ఎలా మోసాలు జరుగుతాయో చెప్పేందుకు అజయ్ భగత్ పాద దేవుని అవతారం ఎత్తారు . ఐతే భక్తులు రావడం , కానుకలు, అంతా బాగానే ఉండటంతో అసలు లక్ష్యం వదిలేసి అజయ్ భగవత్ పాద కూడా దేవుడిగా పూజలు అందుకోసాగారు. అప్పుడు కలిసి నా మనసులో సందేహాన్ని బయటపెడితే ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
*****
“బాబాల చేతిలో మోసపోయిన వారు అంతా కలిపి ఎంత మంది ఉంటారు? అని అయన నన్ను అడిగితే, సంఖ్య తెలియదు చాలామంది అన్నాను. అజయ్ భగవత్ పాద బదులిస్తూ ” వెయ్యి , పది వేలు , పోనీ లక్ష అనుకోండి . రాష్ట్రమంతా కాదు. హైదరాబాద్‌కే పరిమితం అవుదాం . కోటి మంది జనాభాలో లక్ష మంది మోసపోయారు అని మీరంటారు. మోసపోవడానికి ఇంకా 99 లక్షల మంది మిగిలి ఉన్నారు అని నేను అనుకుంటాను. ఇంకా భారీ మార్కెటింగ్ స్కోప్ ఉంది అని నేను అనుకుంటాను “అని మార్కెటింగ్ భాషలో వివరించారు . ఈ థియరీ సరిగా అర్థం చేసుకుంటే మీడియా వార్తలు, లాటరీ వచ్చింది అనే ఫోన్ కాల్స్ , రకరకాల ఆన్లైన్ మోసాలు పెద్దగా ఆశ్చర్యం అనిపించవు . ఈ మోసాలకు ఇంకా విస్తృతమైన మార్కెట్ ఉంది అనిపిస్తుంది .
****
2009 సమయంలో టీడీపీ, ఆ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్న వర్గాలు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నాయి . టీడీపీ విజయాన్ని కోరుకుంటున్న మీడియా టీడీపీని మించి సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. టీడీపీ గెలవకపోతే యుగాంతం తప్పదేమో అనిపించేవి ఆ వార్తలు .
మేనేజ్మెంట్ కోరిక మేరకు వార్తలు ఉంటాయి. కానీ ప్రజల అభిప్రాయాలు- వార్తలకు సంబంధం ఉండదు . అప్పటివరకు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన జర్నలిస్ట్ సాక్షిలో చేరగానే , అంతకు ముందు అంతా విధ్వంసంగా కనిపించిందంతా పత్రిక మారగానే పచ్చగా కనిపిస్తుంది. అలానే సాక్షి నుంచి జ్యోతికి వస్తే దానికి రివర్స్ గా రాయాలి అతని తప్పేమీ లేదు .
మేనేజ్మెంట్ కోరుకున్నది రాయాలి. ఆ సమయంలో ఈనాడులో వచ్చిన ఒక వార్త బాగా గుర్తుండి పోయింది . 1995 నుంచి 2014 వరకు ఆంధ్రభూమిలో టీడీపీ బీట్ చూశా . 1995 లో టీడీపీ కార్యాలయం హిమాయత్‌నగర్‌లో ఉంటే 96- 97 లో బంజారాహిల్స్‌కు మారింది . 97 నుంచి 2014 వరకు సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ ఎన్టీఆర్ భవన్‌కు బైక్‌పై వెళ్లిన అనుభవం నాది . ఈ పది కిలోమీటర్ల దూరానికి మొదట్లో గంట సమయం పట్టేది. పంజాగుట్టఫ్లై ఓవర్ నిర్మించిన తరువాత అరగంట సమయం పట్టింది.
***
2009 ఎన్నికల సమయంలో ఈనాడులో వచ్చిన వార్త… పంజాగుట్ట ఫ్లైఓవర్ ఫోటో వేసి, దాని నిర్మాణానికి అయిన వ్యయం , సమయం , ప్రాజెక్టు పొడవు వంటి వివరాలు అన్నీ రాసి ఫలితం వృధా అని రాశారు . టాఫిక్ జామ్ అవుతోంది కాబట్టి అంతా వృధా అయింది అని స్టోరీ . ఇలానే ఐదేళ్ల వైయస్ఆర్ పాలనలోని అన్ని ప్రాజెక్టుల గురించి ఎన్నికల ముందు స్టోరీలు వేశారు.
మిగిలినవి నాకు తెలియదు కానీ 97 నుంచి 2014 వరకు తెలిసిన దారి. అరగంట పంజాగుట్ట చౌరస్తా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకు పోవలసి వచ్చేది. ఇప్పుడు సికింద్రాబాద్‌లోని మా ఆఫీస్ నుంచి అరగంటలోపే టీడీపీ ఆఫీస్‌కు వెళ్తున్నాను .
ఫ్లై ఓవర్ వల్ల ఫలితం వృధా అని అలా ఎలా రాస్తారు ‘ అని ఈనాడు మిత్రుడిని అడిగితే, ‘ఇదొక్కటే కాదు. ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక పథకాల వల్ల పాజిటివ్ ప్రభావం ఉంటుంది అని చెప్పినా , అన్నింటిపై వ్యతిరేకంగా రాయమని ఆదేశాలు’ అని సమాధానం వినిపించింది .
మరి నా పంజాగుట్ట అనుభవం మాటేమిటి అని అడిగితే అచ్చం అజయ్ భగవత్ పాద చెప్పిన సమాధానం చెప్పారు. ‘పంజాగుట్ట ఫ్లైఓవర్ ను ఉపయోగించే కొన్ని వేల మంది వార్త నిజం కాదు అనుకుంటారు . కానీ మిగిలిన కోట్ల మంది నిజం అనుకుంటారు కదా ?’ అని సమాధానం…
అలాగే “పంజాగుట్ట వార్త అబద్ధం అని ఇంతలా వాదిస్తున్న నువ్వు మిగిలిన వార్తలు నిజమే అనుకుంటున్నావు కదా ?” అని మిత్రుడు ప్రశ్నించాడు . లక్ష మంది మోసపోయారు అని నేనంటే, మోసపోవడానికి ఇంకా 99 లక్షల మంది ఉన్నారు అని బాబాలు భావించినట్లు , పంజాగుట్ట ఫ్లైఓవర్ వార్త అబద్ధం అని నువ్వు అనుకుంటే , నిజం అనుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు అని మీడియా అనుకుంటుంది.
కల్కి మాయాబజార్ సృష్టికి , మీడియా మాయాజాలానికి తేడా లేదు అనిపించింది . ఐతే కాలం మారింది . ఇప్పుడు మనం చూపిందే సమాచారం కాదు . సమాచారం అనేక చోట్ల నుంచి వస్తోంది . మాయాబజార్లకు కాలం చెల్లింది . బాబాలది , మీడియాది అందరిదీ అబద్దాలను అమ్మే వ్యాపారమే .
అజిత్ భగవత్ పాద తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బాబా వ్యాపారం మార్చినట్టు విన్నా.
Share this Article