Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!

October 1, 2026 by M S R

.

మొన్న చెప్పుకున్నాం కదా… థియేటర్ రిలీజ్ సమయంలో వినిపించే, కనిపించే రివ్యూలు వేరు… అవి దేవతావస్త్రాలు… కానీ రిలీజ్‌నాటి హైప్, వేడి చల్లారాక తాపీగా థియేటర్లకు వెళ్లి చూసిన ప్రేక్షకులు, ఓటీటీల్లో చూసిన ప్రేక్షకులు చేసే విశ్లేషణ వేరు… ఇవే నిజాలు… సినిమా నాణ్యతను పట్టిచూపే అసలైన అభిప్రాయాలు…

ప్యారడైజ్ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తోంది… నానికి డబ్బులొచ్చాయేమో గానీ తన క్లాస్ ఫ్యాన్స్‌ను వేగంగా కోల్పోతున్నాడు పాపం… ఫేస్‌బుక్‌లో Vedapanditaha Sannidhanam Dixitulu పోస్టు సినిమా గురించి విభిన్న శైలిలో సమీక్షించిన తీరు బాగుంది… చదవండి…

Ads


ప్యారడైజ్ — ఒక ప్రేక్షకుని పలాయన గాథ
ప్యారడైజ్ అను ఈ కళాఖండమును ఎందరో ఖండఖండములుగా ఖండించుట ఆశ్చర్యకరము; పరిశీలనకరము కూడా!
గతమున ఇదే తరహాలో వచ్చిన అనేక బ్లాక్ అండ్ రెడ్ కలర్ సినిమాలను పుంఖానుపుంఖముగా చూసి తల వాచిన అనుభవము మనకు కలదు.
(బ్లాక్ అండ్ రెడ్ అనగా — సెంటిమెంటు + క్రైము + డ్రామా అని కవి హృదయమును చదువరులు గ్రహింతురు గాక!)

కావున ఈ కాకమ్మ కథను కూడా నెట్‌ఫ్లిక్స్ యందు, అవసరమైనచోట విరామమిచ్చుచూ, మరీ అవసరమైతే రెండు మూడు దినములలో పూర్తి చేయవలెనని తొలుత నిర్ణయించుకొంటిని.
అయిననూ—
“ఈ సైన్మా మస్త్ ఉంది నాయనా… మస్త్ ఉంది!”
అని కల్వకుంట్ల తారక రాముడు సెలవిచ్చినట్లు తెలిసి మహదానందము పొందితిని.

ఎలాగైననూ తారకరాముని ఆనందార్ణవమున నేను కూడా ఒక బిందువుగా మారవలెనని నిశ్చయించుకొంటిని.
ప్రపంచ సినిమాకు రాజపోషకుడనైన నేను నా రీగల్ మెంబర్‌షిప్ హోదాను మరొకసారి ప్రయోగించి, ఒక అమెరికా అర్ధరూపాయితో టిక్కెట్టు సంపాదించితిని.
టిక్కెట్టు వచ్చిన తరువాత కూడా ఎంతో ఆలోచించితిని…
చించితిని…
మరలా ఆలోచించితిని…

చివరకు—
“తలపడవలె!”
అని నిర్ణయించుకొని, సుమారు అరగంట ఆలస్యముగా చిత్రమందిరములో ప్రవేశించితిని.
లోపలికి వెళ్లి చూడగా—
ఛత్రపతి సినిమాలో మాదిరిగానే ఒక తల్లి!
కానీ జీపు లోపల కాకుండా బయట.

అటొక ముసలి ఛత్రపతి విలన్!
ఇటొక ముసలి మోహన్‌బాబు!
దాదాపు తన వయస్సే కలిగిన ఒక స్థూలకాయురాలి వైపు అత్యంత క్రూరమైన చూపులు ప్రసరింపజేయుచుండెను.
ఇంతలో ఆశ్చర్యకరముగా ఆ మహిళకు ప్రసవమాయెను.
ఒక శిశువు మృతి చెందెను.

అదే సమయంలో ముదుసలి బాబుగారికీ పుత్రోత్సాహము కలిగెను!
ఆ వృద్ధ మహిళకు మరొక శిశువు కూడా కలిగెను.
ఆ తల్లి ఆ శిశువుకు దిష్టి తీయుచుండెను.
కానీ అప్పటికే కెమెరా గిరగిరా తిరుగుచుండుటచేత—
ఆ రోత,
ఆ రక్తము,
ఆ బురద—
తెరమీద నుండి నేరుగా మన ముఖముమీద పడునేమోనని భయము కలిగెను.

“ఇప్పుడే బయటికి పరుగెత్తుదామా?”
అను సహజమైన మానవీయ కోరికను ఎలాగోలా అణచుకొని,
“టిక్కెట్టుకు అర్ధరూపాయి పెట్టితిమి కదా! ఇంకొంచెము చూద్దాము”
అని మనస్సును సమాధానపరచుకొంటిని.

చూచిన యెడల—
సర్వత్రా జడల గోల!
జడలు…
జడల మధ్య జడలు…
జడల వెనుక మరికొన్ని జడలు…
ఈ జడల జాడలతో పాటు సినిమా ఆద్యంతమూ వినిపించు మరొక ప్రధాన విషయం—
వ్యభిచార వ్యవహారము!

చిత్రకథ ప్రకారం ఆ తల్లి పదహారవ ఏటనే తల్లి అయినదట.
కానీ మన ఖర్మ ఏమో—
సినిమా ప్రారంభము నుండి మనము బయటికి పారిపోయే వరకు ఆమె వయస్సు యాభై పరిసరములలోనే ఉన్నట్లు అనిపించును!
అప్పుడు నాకు ఒక ధర్మసందేహము కలిగెను.

“ఈ పెద్దావిడ మీద ఎవరైనా మనసు పడితే అది తప్పు కాకపోగా ఉపకారమే అగును కదా?”
అమెరికాలో వృద్ధ పతివ్రతా శిరోమణులను నిత్యము దర్శించు నాకు అలా అనిపించుట సహజమే!
ఇలా కాలము గడిచే కొద్దీ హీరో యందు మనకు కలిగిన సానుభూతి క్రమంగా నశించెను.
చివరకు—
“ఈ మహానుభావుని అంతము ఎప్పుడు సంభవించును?”
అని విలన్ పక్షమున నిలిచి ఎదురుచూచే స్థితికి చేరితిని.

అంతలో హఠాత్తుగా—
తల్లీ కొడుకులిద్దరూ కలిసి భల్లాలదేవుని కుమారుని మాదిరిగా ఒక మనిషిని ఉత్తపుణ్యాన నరికివేసిరి!
అది చాలదన్నట్లు—
దీనికి కొద్దిసేపటి పూర్వమే పైకప్పునకు తగిలించిన ఒక టేబుల్ ఫ్యానును బీహారీ గడ్డి కోసే యంత్రమువలె మోడిఫై చేసి, మన కథానాయకుడు ఒకానొక అమాయక రౌడీ తలను పొడి జ్యూస్ చేసెను!

ఆ దృశ్యము చూచిన వెంటనే—
నా శరీరము, మనస్సు, జీర్ణకోశము మూడూ ఏకాభిప్రాయమునకు వచ్చెను:
“ఇక చాలు!”
వాంతి చేసుకొని బయటికి వెళ్లవలసిన పరిస్థితి దాదాపు ఏర్పడెను.
అయినప్పటికీ జీవితములో ఎన్నో దృశ్యములు చూచిన అనుభవముచేత తమాయించుకొని, తదుపరి తలకొట్టుడు దృశ్యమును కూడా దర్శించితిని.
అంతటితో జ్ఞానోదయమాయెను.

రీగల్ మహారాజులకు నేను సమర్పించిన అమెరికా అర్ధరూపాయిలో అప్పటికే పావలా వసూలైనదని భావించితిని.
మిగిలిన చివరి పావలా నష్టమునకు వెరవక, ప్రాణరక్షణయే పరమధర్మమని గ్రహించి—
ప్యారడైజ్ నుండి అత్యవసరముగా పలాయనము చేసితిని.

బయటికి వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చిన తరువాత మాత్రమే ఒక మహత్తర సత్యము అవగతమాయెను:
చిత్రము 1980ల సికింద్రాబాదులో జరుగుచున్నదని దర్శకుడు అప్పుడప్పుడు చిరంజీవి పోస్టర్ల ద్వారా మనకు జ్ఞాపకము చేయుచుండును. లేనియెడల దృశ్యములను చూచిన ప్రేక్షకుడు ఇది నిజాం పూర్వకాలమో, మధ్యయుగ సామంత రాజ్యమో, లేక ప్రళయానంతర మాడ్‌మాక్స్ తెలంగాణయో నిర్ణయించుకొనుట కష్టము.”

దర్శకుడు కథను మొదటిసారి వినిపించిన నాటి సభలో ఏ ముహూర్తముననో ‘ఇది మహాకావ్యము’ అను తీర్మానము ఏకగ్రీవముగా ఆమోదింపబడినట్లు తోచును. అటుపిమ్మట కథను పరిశీలించుట మాని, ఆ తీర్మానమునకు సాక్ష్యములు సమకూర్చుటయే చిత్రనిర్మాణముగా మారినదేమో!”

ప్యారడైజ్ అనేది తెరమీదనున్న ప్రదేశము కాదు.
ఆ సినిమా మధ్యలోనే థియేటర్ తలుపు తెరచుకొని బయటికి వచ్చినప్పుడు కనిపించే ప్రపంచమే అసలైన ప్యారడైజ్!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!
  • మీడియా మాయ – కల్కి మహత్యం… రెండింటిదీ సేమ్ ఫార్ములా దందా !!
  • వంద ‘కాదు’లు ఒక ‘అవును’ కంటే ఎక్కువ నేర్పిస్తాయి!
  • సగటు తమిళుడికి తన భాష, సంస్కృతిపై ఓ ‘పిచ్చి ప్రేమ’… అంతే!
  • చలించిన న్యాయమూర్తి… ‘‘ఆ చెడ్డ అంకుల్ ఇక బయటికి రాడు తల్లీ…’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions