.
క్రికెట్ పిచ్ అంటే ఓ సిమెంట్ ముక్క కాదు. నచ్చినట్లు పరచేసుకునే ప్లాస్టిక్ చాప అంతకన్నా కాదు. పిచ్‌కు కూడా ఓ ప్రకృతి ఉంటుంది. ఓ స్వభావం ఉంటుంది. ఓ ప్రాంతీయ వ్యక్తిత్వం ఉంటుంది. అక్కడి మట్టి ఏంటి? అందులో క్లే ఎంత ఉంది? వాతావరణం ఎలా ఉంటుంది? తేమ ఎంత? ఎండ తీవ్రత ఎంత? నీరు ఎలా నిలుస్తుంది? గడ్డి ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటి సమాధానాలే చివరికి ఆ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో నిర్ణయిస్తాయి.
అందుకే మంచి పిచ్ క్యూరేటర్ పని పిచ్‌ను తన ఇష్టానుసారం మార్చడం కాదు. అక్కడి ప్రకృతిని అర్థం చేసుకుని, దానితో కలిసి పనిచేయడం.
Ads
ఇప్పుడు గౌహతి మ్యాచ్‌ను చూడండి. ఒక్క మ్యాచ్‌లో ఏకంగా 811 పరుగులు! బౌలర్లకు పిచ్ మీద బంతి వేయడం కంటే, బహుశా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోవడమే బెటరని అనిపించి ఉండొచ్చు. బ్యాటర్ బంతిని కొడుతున్నాడా… లేక పిచ్‌నే శిక్షిస్తున్నాడా అన్నంతగా పరుగులు వచ్చాయి. గంభీర్ ఈ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడన్న వార్తలు కూడా వచ్చాయి.
ఇక్కడ అసలు ప్రశ్న 811 పరుగులు రావడమే కాదు. క్రికెట్‌లో పిచ్‌ను మనం ఎంతవరకు కృత్రిమంగా నియంత్రించాలి?
పిచ్‌ను బ్యాటింగ్‌కు అనుకూలంగా చేయాలనుకుంటే మట్టి మార్చేస్తాం. బౌలర్లకు సహకరించాలంటే గడ్డి పెంచేస్తాం. బౌన్స్ కావాలంటే ఇంకేదో ప్రయోగం చేస్తాం. అవసరమైతే బయట నుంచి మట్టి తెచ్చి మొత్తం పిచ్‌ను మార్చేస్తాం. డ్రాప్-ఇన్ పిచ్‌లతో ఒక నగరంలోని పిచ్‌ను మరో నగరానికి తీసుకెళ్లినట్టే పరిస్థితి.
కానీ ప్రకృతికి కూడా ఓ లెక్క ఉంటుంది. ఆస్ట్రేలియాలోనే ఒక కొత్త పిచ్ ప్రయోగం రెండు రోజుల్లో టెస్ట్ మ్యాచ్‌ను ముగించే స్థాయికి వెళ్లిన ఉదాహరణ తాజాగా చర్చకు వచ్చింది. మొత్తం పిచ్‌ను తవ్వేసి, బయట నుంచి మట్టి తెచ్చి కొత్త పిచ్ తయారీ ఎంత పెద్ద ఇంజినీరింగ్ ప్రయోగమైనా కావచ్చు. కానీ క్రికెట్ పిచ్ అనేది కేవలం ఇంజినీరింగ్ ప్రాజెక్టు కాదు. దాని ప్రవర్తనలో నేల, వాతావరణం, తేమ, గడ్డి, ఎండ… అన్నీ భాగస్వాములే.
అందుకే భారతదేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పిచ్ కనిపిస్తుంది. నల్లమట్టి, ఎర్రమట్టి ఉన్న ప్రాంతాల్లో సాధారణంగా పిచ్ తొలిరోజుల్లో బ్యాటింగ్‌కు బాగానే సహకరించవచ్చు. ఎండ పెరిగేకొద్దీ తేమ తగ్గుతుంది. పిచ్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఆ తర్వాత స్పిన్నర్లకు కథ మొదలవుతుంది. అదే పిచ్ మొదటి రోజు ఒకలా, మూడో రోజు మరోలా కనిపించడానికి కారణం ఇదే.
ఇది పిచ్ క్యూరేటర్ పొరపాటు కాదు. అదే పిచ్‌కు ఉన్న సహజ స్వభావం. మొహాలీని తీసుకోండి. ఉత్తర భారత వాతావరణం, అక్కడి నేల స్వభావం, క్లే కంటెంట్… ఇవన్నీ కలిసి ఆ మైదానానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఒకప్పుడు భారతదేశంలో పేస్, బౌన్స్‌కు పేరున్న మైదానాల్లో అది ముందుండేది.
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు తన ప్రత్యేకత. ఢిల్లీలోని పాత ఫిరోజ్ షా కోట్ల పిచ్‌కు మరో స్వభావం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు… ఒక్కో ప్రాంతానికి ఒక్కో నేల, ఒక్కో వాతావరణం, ఒక్కో పిచ్ కథ. అందుకే క్రికెట్‌లో “హోమ్ అడ్వాంటేజ్” అనేది కేవలం ప్రేక్షకుల అరుపుల వల్ల వచ్చేది కాదు. అక్కడి పరిస్థితులు, అక్కడి నేల, అక్కడి వాతావరణం కూడా ఆ జట్టుకు తెలిసిన భాషలో మాట్లాడతాయి.
ఆస్ట్రేలియాలో పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మెల్‌బోర్న్‌లో ఒక రకమైన బ్యాటింగ్ పరిస్థితులు కనిపిస్తే, పెర్త్‌కు వేగం, బౌన్స్ మరో గుర్తింపు. సిడ్నీకి స్పిన్‌కు అనుకూలించే స్వభావం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆ స్వభావాలన్నింటినీ ఒకే బ్యాటింగు అచ్చులో పోయాలని చూస్తున్నామా?
ప్రతి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గం కావాలా? ప్రతి మ్యాచ్‌లో 400 పరుగులు రావాలా? ఇది క్రికెట్‌లో మరో పెద్ద సమస్య. ఐపీఎల్‌లో పవర్‌ప్లే, ఫీల్డింగ్ పరిమితులు, బ్యాటింగ్‌కు అనుకూలమైన చిన్న బౌండరీలు, ఆధునిక బ్యాట్ల శక్తి… ఇవన్నీ ఇప్పటికే బ్యాటర్‌కు అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు పిచ్ కూడా “మీరు అడిగినంత పరుగులు తీసుకోండి” అని చెప్పేస్తే బౌలర్ ఏం చేయాలి?
అప్పుడు మ్యాచ్ క్రికెట్ కాదు. బంతి వేసే కార్యక్రమం మాత్రమే. మరి దానికి బాల్స్ విసిరే మెషిన్లు బెటర్ కదా… టెన్నిస్‌లో కూడా ఇదే విషయం మనకు కనిపిస్తుంది. వింబుల్డన్ గడ్డి కోర్టు. ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్టు. కోర్టు మారితే ఆట స్వభావం మారుతుంది. ఆటగాడు ఆ పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకోవాలి.
అయితే క్రికెట్‌లో మాత్రం మనం ఎందుకు ప్రతి పిచ్‌ను ఒకే రకంగా మార్చాలని ప్రయత్నించాలి? బ్యాటర్‌కు కొంచెం ఇబ్బంది వస్తే పిచ్ చెడ్డదా? బౌలర్‌కు సహాయం దొరికితే అది అన్యాయమా? స్పిన్నర్‌కు మూడో రోజు టర్న్ రావడం పిచ్ లోపమా? పేసర్‌కు మొదటి గంటలో స్వింగ్ రావడం ప్రమాదమా? అలా అయితే క్రికెట్‌లో టాస్ ఎందుకు? వాతావరణం ఎందుకు? స్వింగ్ ఎందుకు? స్పిన్ ఎందుకు?
క్రికెట్ అందం ఏమిటంటే పరిస్థితులు మారుతుంటాయి. ఆటగాడు వాటిని చదవాలి. పిచ్‌ను చదవాలి. మ్యాచ్‌ను చదవాలి. బౌలర్ల బంతులు నిప్పులు చెరుగుతుంటే సరిగ్గా నిలబడి ఆడేవాడే అసలైన బ్యాటర్… తోపు బ్యాటర్‌ను కూడా ముప్పుతిప్పలు పెట్టే బాల్స్ పడాలి, అప్పుడే కదా ఆటలోని అసలు మజా… కానీ దాన్నీ చంపేస్తున్నారు కదరా..!! ( Inputs From Upadrasta Pardha Saradhi )
- ఓ తాజా ఇక్కడ ప్రస్తావనార్హం… ఆసియా కప్ క్రికెట్, సెమీ ఫైనల్, బుమ్రా వేసిన ఫస్ట్ ఓవర్, శ్రీలంక రెండు వికెట్లు పతనం, కేవలం ఒక రన్… ఇలాంటి మ్యాచులు కదా చూస్తే అసలు క్రికెట్ మజా… 5 ఓవర్లలో 18 పరుగులకు అయిదు వికెట్లు… 7 ఓవర్లలో 36 పరుగులకు 7 వికెట్లు…
Share this Article