.
వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌజులు, స్టార్ హోటళ్లు, కంపెనీలు, భూములు సంపాదించీ… కేటీయార్ ఏమన్నాడు..? ‘మాకు ఉండటానికి హైదరాబాదులో సరైన ఇల్లు కూడా లేదు’ అని… ఒకరకంగా అంత సంపదను కట్టబెట్టిన తెలంగాణ సమాజంపై ఓ క్రుయల్ జోక్ వేసి, కఠోరంగా అవమానించడమే అది…
ఇప్పుడు ఏమంటున్నాడు..? ‘‘పెళ్లాంపిల్లలకు ఇంత బువ్వ పెట్టడానికి వ్యాపారం చేస్తున్నాను…ఈ స్టార్ హోటళ్లు అవే’’… నవ్వులాట కాదు, నిజంగానే కేసీయార్, కేటీయార్ కుటుంబాన్ని తెలంగాణ సమాజంలో మరింత నవ్వులపాలు చేసే ఓ విఫల, హాస్యాస్పద సమర్థన ఇది…
Ads
సిరిసిల్లలో రేవంత్ రెడ్డి కేటీయార్ స్టార్ హోటళ్లను తన ప్రసంగంలో ప్రస్తావించాడు కదా, అది మరోసారి కేసీయార్ కుటుంబ దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది… ఆ కుటుంబం ఇంకా ఏమేం సంపాదించిందో, ఇంత సంపదను పోగేయడంలో దేశంలోని లీడర్లందరినీ మించిపోయాడుగా అనే నెగెటివిటీ విస్తృతంగా మీదపడింది… (బీఆర్ఎస్ దేశంలోనే అత్యధిక పార్టీ నిధులున్న టాప్ వన్ ప్రాంతీయ పార్టీ ఒకదశలో…)

‘‘అమెరికాలో ఆరేళ్లు పనిచేసి స్టార్ హోటళ్లు కట్టుకున్నాను, అవి క్రమేపీ మూడయ్యాయి, రాజకీయాల్లో లేకపోతే అవి పది అయ్యేవి, ఏం, పెళ్లాంపిల్లలకు బువ్వ పెట్టడానికి ఈమాత్రం వ్యాపారం చేస్తే తప్పేమిటి..? 2009లోనే ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పాను, ఏదో కొలంబస్ కనిపెట్టినట్టు, వాస్కోడిగామాలాగా రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టిందేముంది..?’’ అన్నాడు కేటీయార్…
సొంత ఇల్లు కూడా లేక, పాపం, ఏదో పెళ్లాంపిల్లలకు కాస్త బువ్వ పెట్టడానికి నానాకష్టాలూ పడుతున్న కేటీయార్… నిజానికి 2009 అఫిడవిట్‌లో వీటిని చూపించనే లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ కనిపిస్తోంది… అది నిజమైందో కూడా కేటీయారే చెప్పాలి… ఆ హోటళ్లను నిజంగానే అఫిడవిట్‌లో చూపించకపోతే, అప్పటికే కేటీయార్ కుటుంబ ఆస్తులుగా కంపెనీల చట్టం ప్రకారం రికార్డయి ఉంటే, కేటీయార్ మరో దిద్దుకోలేని తప్పు చేసినట్టే అవుతుందా…
- (ఎవరైనా కేటీయార్ గానీ, తన భార్య గానీ 2009కు ముందే Athome Hospitality Services Private Limited లో డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలిపే ఆధారాలు, అప్పుడు తను సమర్పించిన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘానికి సమర్పిస్తే… తప్పుడు అఫిడవిట్ అనే ఫిర్యాదును దర్యాప్తు చేస్తుందా? ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా..? అలాగే Telangana Publications Private Limited, Himanshu Motors Private Limited, TSFCL, Zenmed Healthcare వంటివి తన అఫిడవిట్లలో ఎప్పుడైనా పేర్కొన్నాడా లేదా కూడా తేల్చే అవకాశం ఉంటుందా..?)
(ఇవి శైలిమ భాగస్వామ్యం ఉన్న కంపెనీలుగా చెబుతున్నారు)
రోజురోజుకూ రేవంత్ రెడ్డి బయటపెడుతున్న కేసీయార్ కుటుంబ దోపిడీ, ఆస్తులు, అరాచకం తెలంగాణ ప్రజల్ని నిర్విణ్నులను చేస్తున్నాయి… ఐతే ఈ వికృతరూపం సమాజానికి కనిపించేకొద్దీ, నిజంగానే సత్తెపూసలు అయితే అదే చెప్పుకోవాలి, నిరూపించుకోవాలి కదా… ఏం, నీ కుటుంబం ఏం తక్కువా? కమాన్, సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమా అని ఉల్టా నిందలు మోపితే, అది సమర్థన అవుతుందా..?
నువ్వు కూడా తప్పు చేస్తున్నావు అని ఎదురుదాడి చేస్తే, తమ అలవిమాలిన తప్పులన్నీ ప్రక్షాళన అయిపోయి, చట్టబద్దం అయిపోయి, నైతిక సంపాదన అయిపోతుందా..? బారాఖూన్ మాఫ్ అన్నట్టుగా తాము చేసిన తప్పులన్నీ మాఫ్ అయిపోతాయా..? ఒరే, మీకు చేతకాలేదురా, ఇదిరా తెలంగాణను దోచుకునే పద్దతి, ఇంతగా దోచుకునే చాన్స్ ఉంది తెలంగాణలో అంటూ గత ఉమ్మడి పాలకులకు పాఠం నేర్పించినట్టుగా ఉందా ఇది..?
నింద పడినవాడు సత్తెపూస అయితే కాదని చెప్పుకోవాలి… నిజమేమిటో చెప్పాలి… కానీ కేసీయార్ కుటుంబం మొత్తం తమ పోగేసిన వేలకువేల కోట్లు ఇప్పుడు జనానికి కనిపిస్తూ ఉంటే… రేవంత్ రెడ్డి బయటపెడుతూ ఉంటే… తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సింది పోయి, మాకు ఇల్లు కూడా లేదు, బువ్వ పెట్టుకోవడానికి ఏవో చిన్న వ్యాపారాలు అంటూ హాస్యాస్పద సమర్థనలకు దిగడం నిజంగా తెలంగాణ సమాజంపై విసిరే క్రుయల్ జోక్స్..!!
…. అవునూ, అమెరికాలో జస్ట్, ఆరేళ్లు కష్టపడితే ఏకంగా స్టార్ హోటళ్లు కట్టుకునేంత సంపాదించొచ్చా..? తను చేసిన ఉద్యోగం ఏమిటో, తనకు దక్కిన నెలవారీ జీతం ఎంతో కాస్త చెబితే… ఆ స్ఫూర్తితో, అదే పాఠంగా తీసుకుని, ఇరవై ముప్పై ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తున్న మనవాళ్లు కూడా వెంటనే తెలంగాణకు వచ్చి తలా ఓ ఫ్యాక్టరీయో, ఓ స్టార్ హోటలో, ఓ పేద్ద ఫామ్ హౌజో కట్టుకునే అవకాశం ఉంటుంది కదా… ఆ పుణ్యం కట్టుకోవచ్చు కదా..!!
- థాంక్స్ టు సీఎం… జాతిపిత, ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు వంటి దేవతావస్త్రాలన్నీ ఒక్కొక్కటీ విప్పి, తెలంగాణ సమాజం కళ్లు తెరిపిస్తున్నందుకు..!!
Share this Article