.
స్మిత్ మచ్చర్ కులం ఏమిటి..? వందల ప్రాణాలు కాపాడిన ధైర్యం, తెలివికంటే ఇదే ముఖ్యమా?
మనవాళ్లకు అలవాటే కదా… ఎవరైనా వార్తల్లో వ్యక్తి పేరు కనిపిస్తే చాలు ఏ కులం అని వెతకడం, మన కులం అయితే మోయడం… మెచ్చుకోవాల్సిన అంశాన్ని వదిలేసి, కులాన్ని మోయడం! ఇప్పుడు ప్రపంచం కీర్తిస్తున్న పేరు స్మిత్ మచ్చర్… తను ఇండియన్ కదా, వెంటనే కులం సెర్చింగు స్టార్టయింది…
Ads
తన చదువు, తన కెరీర్ గురించి కాదు, అంతకుమించి తన కులం గురించి…! విమానం ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఉంది. సహాయకుడు కాక్‌పిట్‌లోనే దాడి చేశాడు. విమానం ఒక్కసారిగా వేల అడుగుల కిందికి పడిపోయింది. తీవ్రంగా గాయపడీ చివరి శక్తిని కూడగట్టుకుని కాక్‌పిట్ తలుపు తెరిచాడు. ఆ తరువాత ప్రయాణికులందరూ కాపాడబడ్డారు…
ఇది కదా మెచ్చదగిన ఎపిసోడ్… ఇంత పెద్ద కథలోకి మనకు ఇప్పుడు మరో ప్రశ్న వచ్చేసింది. “స్మిత్ మచ్చర్ కులం ఏమిటి?” ఇదే మన ప్రత్యేకత! ఒక మనిషి అసాధారణమైన పని చేశాడంటే ముందుగా అతను ఏం చేశాడో తెలుసుకోవాలి. కానీ మన దగ్గర చాలాసార్లు మొదటి పరిశోధన అక్కడితో ఆగిపోదు.
పేరు ఏమిటి?
ఊరు ఏమిటి?
ఇంటిపేరు ఏమిటి?
తండ్రి ఎవరు?
కుటుంబం ఎవరిది?
కులం ఏమిటి?
కులం తెలిసిందంటే చాలు. ఇక సోషల్ మీడియాలో కొత్త కథ మొదలవుతుంది. స్మిత్ మచ్చర్ విషయంలోనూ అదే జరుగుతోంది. నిజానికి అక్కడ తనతోపాటు చప్పట్లు కొట్టించుకునే అర్హులు మరో నలుగురు ఉన్నారు…
ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్ హయూన్ అనే ప్లంబర్ దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడంలో ముందుకు దూసుకెళ్లాడు. డాక్టర్ షోటా ముసాయెవ్ గాయపడిన స్మిత్‌కు తక్షణ వైద్య సహాయం అందించాడు. అసఫ్ రాజువాన్, జ్వికా మానెస్ కూడా దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో పాల్గొన్నారు…
వీళ్ల వృత్తులు కూడా చూడండి.
ఒకరు పైలట్.
ఒకరు ప్లంబర్.
ఒకరు డెంటిస్ట్.
ఒకరు ఇన్సూరెన్స్–ఫైనాన్స్ రంగంలో ఉన్న వ్యక్తి.
మరొకరు బ్యాంకింగ్ రంగానికి చెందిన అధికారి.
వాళ్ల నేపథ్యాలు వేరు. వృత్తులు వేరు. దేశాలు వేరు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు ఒకటే పని చేశారు—మనుషుల ప్రాణాలు కాపాడటం.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ ఈ నలుగురు ప్రయాణికులను దేశ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారానికి సిఫారసు చేయనున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కూడా ప్రత్యేకంగా ప్రశంసించాడు…
అంటే అక్కడ ఎవరూ— “మీరు ఏ సమాజం?” అని అడగలేదు. “మీరు ఎక్కడి వాళ్లు?” అని చూసి ప్రాణాలు కాపాడలేదు. అప్పుడు మనకు మాత్రం ఎందుకు ఇంత తొందర?
స్మిత్ మచ్చర్ గురించి ఇప్పుడు కొన్ని మీడియా కథనాలు తనది గుజరాతీ నాగర్ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం అని చెబుతోంది… మరికొందరు కచ్‌కు చెందిన లోహణ కమ్యూనిటీ అని చెబుతున్నారు… లోహణ అంటే ప్రధానంగా వ్యాపారకులం… నిజానికి ఒకే ఇంటి పేరు వేర్వేరు కులాల్లోనూ ఉండటం మన తెలుగు సమాజంలోనూ చూస్తాం… ఇంటిపేరును బట్టి కులనిర్ధారణ కరెక్టు కూడా కాదు…
కానీ ఒక్కసారి ఆ సమాచారం మనకు దొరికిందనుకుందాం. దాంతో ఏం మారుతుంది? స్మిత్ చేసిన సాహసం తక్కువవుతుందా? అతను వేరే కులానికి చెందినవాడని తేలితే మనం ఆయనను తక్కువగా పొగుడుతామా? మన కులానికి చెందినవాడని తేలితే మరో పది అడుగులు పైకి ఎత్తుతామా?
అదే జరిగితే సమస్య స్మిత్‌లో లేదు. మన చూపులో ఉంది. ఇంకా విచిత్రమేమిటంటే—మనిషి చేసిన పని ప్రపంచం మొత్తం చూస్తున్నప్పుడు మనం మాత్రం అతని కులాన్ని వెతుకుతాం. స్మిత్ మచ్చర్ మాత్రమే కాదు, తనతోపాటు ఆ నలుగురూ కులం అనే కోణాన్ని దాటి ప్రశంసలకు అర్హులు… చూడాల్సింది వాళ్ల సమయస్పూర్తి, ధైర్యం మాత్రమే..!!
Share this Article