Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!

October 2, 2026 by M S R

.

“ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం… లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్…” ఆపదలను తొలగించేవాడైన శ్రీరాముడికి మళ్లీ మళ్లీ నమస్కరిస్తాననే ఈ ప్రార్థన భారతీయ భక్తి సంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి. ఆపద వచ్చినప్పుడు దేవుడిని తలచుకోవడం భక్తుడికి సహజం. అందులోనూ హనుమంతుడి భక్తుడికి… ఆ క్షణంలో మొదట గుర్తొచ్చేది హనుమంతుడే.

అదే జరిగింది కెప్టెన్ స్మిత్ మచ్చర్ విషయంలో. వేల అడుగుల ఎత్తులో విమానం అదుపు తప్పి కిందికి దూసుకుపోతోంది. కాక్‌పిట్‌లోనే కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం కారుతోంది. ప్రాణం ఏ క్షణంలో పోతుందో తెలియని పరిస్థితి. బయట ఉన్న 174 మంది ప్రయాణికుల ప్రాణాలు కూడా తన చేతుల్లోనే ఉన్నాయి.

Ads

అలాంటి ఆపదలో స్మిత్‌కు గుర్తొచ్చింది హనుమాన్ చాలీసా. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణలో స్మిత్ స్వయంగా చెప్పాడు— తాను ఆ సమయంలో హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నానని. ఆ ప్రార్థన తనకు ధైర్యాన్ని ఇచ్చిందని, దేవుడే తనను కాపాడాడని తనకు అనిపిస్తోందని చెప్పాడు.

చాలీసా పఠిస్తూనే… చివరి పోరాటం… ఆ తలుపు తెరుచుకుంది. బయటివాళ్లు లోపలికి చేరుకున్నారు. దాడి చేస్తున్న కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడి ప్లాన్ భగ్నం… నిజానికి ఈ కథలో స్మిత్ ఒక్కడే హీరో కాదు. ప్రయాణికులు, సిబ్బంది, అక్కడ ఉన్న పైలట్లు… ఒక్కొక్కరు ఒక్కో క్షణంలో తమ వంతు చేశారు.

కానీ ఆ క్రమంలో కీలకమైన మొదటి క్షణం మాత్రం స్మిత్‌దే. తీవ్రంగా గాయపడిన శరీరంతో కాక్‌పిట్ తలుపు తెరిచిన ఆ ఒక్క ప్రయత్నం. ఆపదలో హనుమంతుడిని తలచుకున్నాడు. హనుమాన్ చాలీసా చదివాడు. ఆ తర్వాత చేయాల్సిన పని చేశాడు. బహుశా భక్తి అంటే కూడా అదే కావచ్చు.

దేవుడిని తలచుకోవడం… ఆ తర్వాత దేవుడిపై నమ్మకంతో మనం చేయగలిగిన చివరి ప్రయత్నం చేయడం. స్మిత్- మోదీ సంభాషణ వార్తలో అందుకే హనుమాన్ చాలీసా ప్రస్తావన మిగతా వివరాలన్నింటికంటే ప్రత్యేకంగా నిలుస్తోంది.

“నాకు ఎప్పుడైనా బాధ కలిగితే హనుమాన్ చాలీసా చదువుతాను. ఆ సమయంలో కూడా చదువుతూనే ఉన్నాను. దేవుడే నన్ను కాపాడాడని నాకు తెలుసు” అని స్మిత్ మోదీతో చెప్పాడు. అది కేవలం ప్రార్థనగా మిగిలిపోలేదు. ఆ ప్రార్థనతో పాటు వచ్చిన ధైర్యమే తనకు ఆ చివరి ప్రయత్నం చేసే శక్తినిచ్చిందని స్మిత్ వివరించాడు.

ప్రధాని మోదీతో మాట్లాడుతున్నప్పుడు స్మిత్ తన పాత్రను మాత్రమే చెప్పుకోలేదు. తనతో పాటు ప్రయాణికులు, సిబ్బంది చేసిన సహాయాన్ని కూడా గుర్తు చేశాడు. 17 ఏళ్లుగా విమానాలు నడుపుతున్న స్మిత్‌కు, 11 ఏళ్లుగా కెప్టెన్‌గా ఉన్న అనుభవం ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకునే శక్తినిచ్చింది. కానీ అనుభవం మాత్రమే సరిపోని క్షణం అది.

ప్రధాని మోదీతో మాట్లాడుతున్నప్పుడు స్మిత్ భావోద్వేగానికి గురయ్యాడు… “మీరు నా ఆదర్శం” అంటూ మోదీతో చెప్పాడు… మోదీ మాత్రం స్మిత్ ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల అనేక ప్రాణాలు నిలిచాయని ప్రశంసించాడు…

మోదీ స్మిత్ తల్లి గీతా బెన్‌తోనూ మాట్లాడి, భగవద్గీత విలువలతో ఆమె కుమారుడిని పెంచారని ప్రశంసించాడు. స్మిత్ భార్య, తల్లిదండ్రులతోనూ ప్రధాని మాట్లాడాడు…

స్మిత్ చికిత్స కొనసాగుతోంది. సౌదీ అరేబియాలోని టబుక్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని అబుదాబికి తరలించారు. భారత అధికారులు అతని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు… ‘భారత్ గర్విస్తోంది’… మోదీ చేసిన ఈ ఒక్క ప్రశంస చాలు స్మిత్‌ సాహసానికి పెద్ద పురస్కారం… శౌర్యచక్ర మెడల్ !!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions