.
నిన్న సందీప్ కిషన్ ఏదో ఆరోపిస్తున్నాడు… ‘కావాలని నెగెటివ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, వరుస ట్వీట్లు కొడుతున్నారు నా సినిమా మీద, ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, జాగ్రత్త, నేను నష్టపోతే మీరు నాకన్నా ఎక్కువ నష్టపోతారు…’ అని… తరువాత జ్యోతిక కూడా ఎంటరై ఏదో కామెంటినట్టు చదివాను…
సరే, తెర వెనుక ఏం కుట్రలున్నాయో, ఎవరిని ఎవరు టార్గెట్ చేసుకుంటున్నారో సగటు ప్రేక్షకుడికి అనవసరం… మీరూ మీరూ తన్నుకొండి… సినిమాలో దమ్ముంటే ఎవడేం ప్రచారం చేసినా ప్రేక్షకుడు పట్టించుకోడు, థియేటర్‌కు వస్తాడు… చూస్తాడు…
Ads
సినిమాలో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే ఏదో ఓ హుక్ పాయింట్ ఉండాలి… ఇరుముడి సినిమాలో కథను ప్రజెంట్ చేసిన తీరు భిన్నమే, కానీ నాణ్యమైందేమీ కాదు… కానీ ఆ అయ్యప్ప పాటలు థియేటర్‌కు రప్పించాయి… ఓ ఉదాహరణ…
మరి నువ్వేం చేశావు సందీప్..? ఓ నాసిరకం సినిమాను వదిలి, దాని చుట్టూ కుట్ర సిద్ధాంతాలు అల్లుతున్నావు… నిజమేమిటంటే… నువ్వే ఎక్కువ నష్టపోతావు… ఇక సినిమా సంగతికొస్తే… పెద్దగా చెప్పడానికి ఏమీలేదు… అన్నట్టు సినిమా పేరు సిగ్మా… దర్శకుడు జేసన్ సంజయ్…

ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఓ హీరో, సంపత్ రాజ్ పాత్రకు చెందిన భారీ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు… ఆ నిధిని తెరవడానికి కావలసిన తాళాల కోసం అతను చేసే అన్వేషణ, అందులో ఎదురయ్యే చిక్కులు, జరిగే ఛేజింగ్ ఈ కథ… అంత భిన్నమైన స్టోరీ ఏమీ కాదు, ఓ సాదాసీదా సౌత్ సినిమా కథ…
ఈ పాత్ర చాలా రొటీన్‌గా, సాధారణంగా సాగుతుంది… సందీప్ కిషన్ తనకు అలవాటైన రీతిలో నటించాడు… దానికి పెద్ద కష్టమూ అక్కర్లేదు పాపం… ఫరియా అబ్దుల్లా పాత్ర సరిగ్గా తీర్చిదిద్దబడలేదు, దీనివల్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయింది…
అన్నట్టు చెప్పనేలేదు కదూ…, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడే ఈ దర్శకుడు జాసన్ సంజయ్… మరీ ఇంత పేలవమైన దర్శకత్వం ఏమిటి బాబయ్యా… కొత్తతరం ఆలోచనల్లో, టేకింగుల్లో ఎంత నవ్యత కావాలి..? ఏది మరి..? పైగా కెనడాలో ఫిలిమ్ మేకింగులో ఏదో కోర్సు కూడా చేశావు…
మొదటి భాగంలో ఎక్కువ భాగం హీరో ఆర్థిక కష్టాలు, నష్టాలు, క్యాసినో జూదం, ఫైట్ల చుట్టూనే తిరుగుతుంది… శివ పండిట్ విలన్ పాత్ర కథకు పెద్దగా బలం చేకూర్చదు… సంపత్ రాజ్ మరో విలన్‌గా కనిపించగా, ఫరియా అబ్దుల్లాతో లవ్ ట్రాక్ కూడా బలహీనంగా అనిపిస్తుంది…
రొటీన్ సోది ఫస్టాఫ్ బోరింగుగా సాగితే… విలన్ల అర్థంలేని సన్నివేశాలు, పేలవమైన యాక్షన్ బ్లాక్స్‌తో సినిమా సెకండాఫ్‌లో మరింత బాగా విసిగిస్తుంది… వీటికి తోడు అకస్మాత్తుగా వచ్చే ఐటమ్ సాంగ్ సినిమాను మరింత దిగజార్చుతుంది… రెండు దశాబ్దాల క్రితం నాటి రొటీన్ కమర్షియల్ ఫార్ములాను మళ్లీ తెరపైకి తెచ్చినట్లు అనిపిస్తుంది…
క్లైమాక్స్ సన్నివేశంలో సందీప్ కిషన్ డబ్బుల వాల్ట్‌ను చేరుకునే విధానం మరింత అసంబద్ధం… ప్రతిదీ అతిగా, లాజిక్ లేకుండా ఉంటుంది… దీనిని సాధారణ ఓటీటీ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోవడం కష్టం… స్థూలంగా దర్శకుడు విజయ్ కొడుక్కి డెబ్యూ ఓ ఫ్లాప్…
చెప్పాల్సింది థమన్ సంగీతం గురించి కూడా… తను అంత తోపు కంపోజర్ అయినా సరే, ఎవరో తన శిష్యుడికి ఈ సినిమాను అప్పగించినట్టున్నాడు… పూర్ పర్‌ఫామెన్స్… పాటల గురించా, సర్లెండి… ఎన్నెన్నో అనుకుంటాం… అన్నీ అవుతాయా ఏమిటి..?
Share this Article