.
ఆరు ఏళ్ల పాపకు టాయిలెట్ రావడం… 174 మంది ప్రాణాలను కాపాడిన అసలు మలుపు!
విమానం కాక్‌పిట్‌లో అసలు ఏం జరుగుతోందో ప్రయాణికులకు ఎలా తెలిసింది? సినిమా కథను తలపించే ఫ్లైదుబాయ్ ఘటన
ఒక విమానంలో 174 మంది ప్రయాణిస్తున్నారు. పైలట్ కాక్‌పిట్‌లో తీవ్రంగా గాయపడి నేలపై పడి ఉన్నాడు. కోపైలట్ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి దూసుకుపోతోంది.
Ads
కానీ వెనుక కూర్చున్న ప్రయాణికులకు కాక్‌పిట్‌లో జరుగుతున్న ఈ భయంకరమైన విషయం తెలియదు. అసలు కథ అక్కడ మొదలైంది కాదు… ఒక ఆరేళ్ల పాపకు టాయిలెట్ రావడంతో మొదలైంది!
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073లో ఆ రోజు ట్జ్వికా మానెస్ తన భార్య తాలి, ఆరేళ్ల కుమార్తె నినా మానెస్తో కలిసి ప్రయాణిస్తున్నాడు. ముందువైపు టాయిలెట్ దగ్గరగా ఉండటంతో నినా తల్లితో కలిసి అటువైపు వెళ్లింది.
అప్పుడే… కాక్‌పిట్ వైపు నుంచి ఏదో అరుపులు, గందరగోళం వినిపించాయి. అది సాధారణ శబ్దం కాదు. నినా భయంతో కేకలు వేసింది. ఆమె తల్లికి కూడా ఏదో తీవ్రమైన సమస్య జరుగుతోందని అర్థమైంది. వెంటనే విమాన సిబ్బందికి విషయం చెప్పారు. అదే సమయంలో నినా తండ్రి ట్జ్వికాకు కూడా కుమార్తె అరుపులు వినిపించాయి.
తన ఆరేళ్ల కూతురు ఎందుకు అలా భయపడుతోందో చూడటానికి వెళ్లిన తండ్రికి… కళ్లముందు కనిపించిన దృశ్యం ఒక హారర్ సినిమా సన్నివేశంలా ఉంది. కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడి ఉన్నాడు. కోపైలట్ అతనిపై దాడి చేశాడు. విమానం కూడా అసాధారణంగా కిందికి దూసుకుపోతోంది.
అప్పటికే కెప్టెన్ మచ్చర్‌కు ఒక విషయం అర్థమైంది. తాను లేచి ఏదో చేయకపోతే… విమానంలో ఉన్న అందరి ప్రాణాలూ ప్రమాదంలో పడతాయి. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన కాక్‌పిట్ తలుపు తెరవడానికి చివరి శక్తిని కూడగట్టుకున్నారు. తలుపు తెరుచుకున్న వెంటనే ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లారు. కొందరు కోపైలట్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.
అలా చూస్తే ఈ ఘటనలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. పైలట్ చివరి శక్తితో తలుపు తెరవడం ఒక మలుపు.
ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లడం మరో మలుపు.
ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా దించేందుకు సహకరించిన ఇతర పైలట్లు మరో మలుపు.
కానీ ఈ కథలో మొదటి అలారం ఎవరు మోగించారు? ఒక ఆరేళ్ల పాప.
ఆమెకు విమానాన్ని ఎలా నడపాలో తెలియదు. కాక్‌పిట్‌లో ఏమి జరుగుతోందో తెలియదు. ఎలాంటి ప్రమాదాన్ని అంచనా వేయగల వయసు కూడా కాదు. ఆమెకు తెలిసింది ఒక్కటే… లోపల ఏదో భయంకరంగా జరుగుతోంది.
ఆమె కేకలు తల్లిని అప్రమత్తం చేశాయి. తల్లి సిబ్బందిని అప్రమత్తం చేసింది. తండ్రి, మరికొందరు ప్రయాణికులు కాక్‌పిట్ వైపు పరుగెత్తారు. అక్కడి నుంచి అసలు ప్రమాదం బయటపడింది.
అంటే… ఒక చిన్నారి టాయిలెట్‌కు వెళ్లాలనుకోవడం → కాక్‌పిట్ దగ్గరకు వెళ్లడం → శబ్దాలు వినిపించడం → ఆమె భయపడటం → కుటుంబం అప్రమత్తం కావడం → ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లడం… ఇది నిజంగా సినిమా స్క్రీన్‌ప్లేలా అనిపిస్తుంది.
పెద్ద ప్రమాదాలను గుర్తించేది ఎప్పుడూ పెద్దవాళ్లో, అలర్ట్ సిస్టమ్సో కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు… ఒక చిన్నారి భయంతో వేసిన ఒక్క కేక కూడా వందల ప్రాణాలకు అలారం కావచ్చు! కొన్ని జీవిత కథలకు రచయిత ఉండరు. అవి తామే కథలైపోతాయి.
Share this Article