.
Murali Buddha …. ప్యారడైజ్ అంటే సినిమా కాదు .. బిర్యానీ కాదు . సినిమా టాకీసు ( 8 ఏళ్ళ క్రితం నాటి పోస్ట్ మరోసారి)… దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం ఈ పాట నిజంగా చిత్రమే.. సుయోధన సార్వభౌముడికి డ్యూయెట్ పెట్టాలనే ఆలోచనే ఓ చిత్రం.
సి.నారాయణరెడ్డి ఆ పాటను అద్భుతంగా రాస్తే, నటి ప్రభ ఆ పాటలో అంతకుముందు ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. చిత్రమైన పాట ఉన్న ఈ సినిమా ప్యారడైజ్‌లో బాగా నడిచింది. ఆ సినిమా హాల్ చరిత్ర ఇంతకన్నా చిత్రమైనది.
Ads
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ఏసీ టాకీసుగా (1954) ప్యారడైజ్ టాకీసు పేరుతో రికార్డ్ నమోదు అయి ఉంది. ఈ టాకీసులో అనేక విచిత్రాలు, జ్ఞాపకాలు.. అద్భుతాలు ఉన్నాయి.
మీరు ఏ సినిమా హాలుకు వెళ్లినా ఇంటర్వెల్‌లో తలుపులు అన్నీ మూసేస్తారు. ఇష్టం ఉన్నా లేకున్నా టాకీసులోని క్యాంటిన్‌లోనే చిరుతిండి కొనుక్కోవాలి. తలుపులు తీస్తే అంతకన్నా తక్కువ ధరతో, మంచి రుచికరమైన పదార్థాలు బయట కొనుక్కుంటారు. అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా క్యాంటిన్లో నాసిరకం చిరుతిళ్లు ఎక్కువ ధరకు కొనాలి. సినిమా హాలులోని క్యాంటిన్‌పై నిర్వాహకులకు అంత నమ్మకం. అందుకే గేట్లకు తాళాలు వేస్తారు. తలుపులు ముస్తారు.
కానీ చిత్రం భళారే విచిత్రం అనిపించేట్టుగా ప్యారడైజ్ లోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్ కావడం. ఆ బ్రాండ్ విలువ కోట్ల రూపాయలు కావడం విశేషం. ప్యారడైజ్ టాకీసు మూతపడింది కానీ అందులోని క్యాంటిన్ మాత్రం అదే పేరుతో అంతర్జాతీయ బ్రాండ్‌గా మారింది.
ప్యారడైజ్ అంటే ఈతరం వారికి తెలిసింది హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ నేం. కానీ ఒకప్పుడు ఎన్నో మంచి మంచి తెలుగు సినిమాలు ఆడిన టాకీసు ప్యారడైజ్.
సికింద్రాబాద్‌లో హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఆడే టాకీసులు ఎక్కువగా ఉన్నా ప్యారడైజ్‌లో మాత్రం ఎక్కువగా తెలుగు సినిమాలే ఆడేవి. దానవీర శూర కర్ణ, దేశోద్ధారకులు వంటి పలు హిట్ సినిమాలు ఎక్కువ రోజులు ఆడాయి.
ప్యారడైజ్ హోటల్ వాళ్లు తమ ప్రగతిని వివరిస్తూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ప్యారడైజ్ అనే పేరుతో పిలిచిన ఒక టాకీసులో చిన్న క్యాంటిన్‌గా 1953లో ఆవిర్భవించినట్టు రాసుకున్నారు. క్రమంగా టాకీసు ప్రభావం తగ్గుతుండగా, అదే సమయంలో క్యాంటిన్ చిన్న హోటల్‌గా మారింది. అటు నుంచి ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్తే టాకీసు మాత్రం మూతపడింది. టాకీసు మూతపడి అందులోని క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం సినిమాను మించిన విచిత్రం. ప్యారడైజ్‌లో ఎక్కువగా తెలుగు సినిమాలు ప్రదర్శించినా అప్పడప్పుడు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ప్రదర్శించేవారు.
1977 జనవరి 14న ప్యారడైజ్‌లో విడుదలైన దాన వీర శూర కర్ణ సినిమా ఓ సంచలనం. ఎక్కువ రోజులు నడిచిన సినిమానే కాదు. ఎక్కువ నిడివిగల సినిమా కూడా. ప్యారడైజ్‌లో ఈ సినిమా విడుదల అని ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ప్రచార ప్రకటన చాలా ఆకర్షణీయంగా ఉండేది.
దుర్యోధనుడిగా ఎన్టీఆర్ పెద్ద గదను పట్టుకొన్న పోస్టర్ ఆకట్టుకొనే విధంగా ఉండేది. ద్రౌపదిగా శారద వస్త్రాపహరణం కృష్ణుడిగా ఎన్టీఆర్ అరచేతి నుంచి చీరలు రావడం, మాయాజూదంలో ఓడిపోయి పాండవులు దీనంగా కూర్చున్న దృశ్యంతో తొలుత పత్రికల్లో ప్రచార ప్రకటన వచ్చినా గదతో దుర్యోధనుడి పోస్టర్ ఎక్కువగా పాపులర్ అయింది. ఆ కాలంలో ప్యారడైజ్ టాకీసు జన ప్రవాహంతో నిండిపోయింది.
దేశోద్ధారకులు సినిమా కూడా ఈ టాకీసులో బాగా ఆడింది. దాన వీర శూర కర్ణకు ముందు అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ నటించిన ఆలుమగలు సినిమా బాగానే నడిచింది.
ఇప్పుడంటే అసలు విడుదలకు నోచుకోని సినిమాలు, ఒకరోజుకే ఎత్తేసే సినిమాలకు సైతం టీవీలో బోలెడు ప్రచారం లభిస్తున్నది. ఆ రోజుల్లో పత్రికల్లో ప్రకటనలు, పోస్టర్‌లే ప్రచారం. పత్రికల ప్రకటనలో అన్ని టాకీసులు ఎయిర్ కండిషన్డ్ అని రాస్తే ప్యారడైజ్ ఎయిర్‌కూల్ అని రాసుకొనేది.
సికింద్రాబాద్‌లో పాష్ ఏరియా జవహర్‌నగర్ ఈ టాకీసుకు పక్కనే.. రాజధాని నగరంలో తొలి అపార్ట్‌మెంట్
నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరిగింది. సింధ్ కాలనీ.. వారు పూజించే ప్రత్యేక ఆలయం ఈ ప్రాంత ప్రత్యేకతలు. కొత్త సినిమా ఏది విడుదలయినా మొదటి మూడురోజులు నాలుగు ఆటలు అదే సినిమా ప్రదర్శించేవారు. నాలుగవ రోజు నుంచి ఉదయం ఆట పాత సినిమాను మార్నింగ్ షోగా తక్కువ రేటు టికెట్లతో ప్రదర్శించేవారు.
అమర శిల్పి జక్కన్న , ఆలు మగలు , ఊరికి ఉపకారి , వెలుగు నీడలు , ఆత్మ బలం , చాణక్య చంద్రగుప్త వంటి సినిమాలు ప్యారడైజ్ లో విడుదల అయ్యాయి . ధరమ్ వీర్ వంటి సూపర్ హిట్ హిందీ సినిమా కూడా దీనిలోనే విడుదల అయింది .
***
నిజాం పాలనా కాలంలోనే ప్యారడైజ్ టాకీస్ ను అంజయ్య గౌడ్ నిర్మించాడు . ఇప్పుడు ఆ ప్రాంతంలో కనిపించే నెహ్రూ విగ్రహం ఆ కాలంలో ఆయన ఏర్పాటు చేసిందే .
తమ టాకీసులో ప్రదర్శించేందుకు ఓ సినిమా అనుమతి కోసం కోసం అంజయ్య గౌడ్ మద్రాస్ కు వెళ్ళడానికి రైలు కోసం వెళితే అప్పటికే వెళ్ళిపోయింది. తరువాత స్టేషన్ లో ఎక్కేందుకు కారులో వెళితే అక్కడా రైలు దొరకలేదు. ఆ తరువాత స్టేషన్ కు వెళ్లి కారులో వెళ్ళాడు, అదే ఆయన పాలిట టాకీసు పాలిట శాపంగా మారింది. రైలు పట్టాలు భారీ వర్షానికి కొట్టుకుపోయి రైలు ప్రమాదంలో మరణించిన వారిలో అంజయ్య గౌడ్ కూడా ఉన్నారు .
ఆ తరువాత అంజయ్య కుమారుడు ప్యారడైజ్ బాధ్యత తీసుకొన్నాడు
కొద్దికొద్దిగా టాకీసు జాగాను హోటల్ గా మారిన క్యాంటిన్ ఓనర్ కు అమ్మసాగాడు. టాకీసును నడపడం ఇక తనవల్ల కాదని భావించి మొత్తం అమ్మకానికి పెట్టాడు.
టాకీసు ఆవరణలోనే ఉన్న తన తండ్రి సమాధిని కదిలించవద్దు, అలానే ఉంచాలి అనే కండిషన్ తో టాకీసు మొత్తం అమ్మేశారు. సికింద్రాబాద్ నడి బొడ్డున ఉన్న ప్యారడైజ్ ను అమ్మి, అలియాబాద్ లో ఓ టాకీసు నిర్మించి కొంత కాలానికి అదీ అమ్మేశారు
అంజయ్య వారసులు అంజయ్య నిర్మించిన టాకీసును కాపాడలేక పోయారు కానీ సమాధిని మాత్రం అలానే ఉంచాలనే కండిషన్ పెట్టారు .
****
సికింద్రాబాద్ చరిత్రలో ఒక భాగంగా నిలిచిన ప్యారడైజ్ 1987లో మూతపడింది. అదే స్థలంలో, అదే పేరుతో వెలిసిన ప్యారడైజ్ హోటల్ తన చరిత్రను అక్కడ రాసిపెట్టింది. ఒక సినిమా హాలులో క్యాంటిన్ అంతర్జాతీయ బ్రాండ్‌గా మారడం అభినందనీయమే కానీ.. అదే సమయంలో తన జన్మకు కారణమైన ప్యారడైజ్ రికార్డును నమోదు చేసి ఉంటే బాగుండేది.
- ప్యారడైజ్ సినిమా టాకీసుగా ఉన్నప్పటి ఫొటో కానీ సినిమా షీల్డ్‌లు, ఆ టాకీసుకు సంబంధించిన ఎలాంటి చరిత్ర, చిత్రాలు అక్కడ లేవు. ఇక్కడ ఒకప్పుడు ప్యారడైజ్ పేరుతో ఒక సినిమా టాకీసు ఉండేదని చెప్పినా నమ్మేట్టుగా లేదు.
ప్యారడైజ్‌లో బిర్యానీ ఎంత ఫేమస్ అంటే.. రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా వచ్చి ఇక్కడ బిర్యానీ తిని వెళ్లేంతగా. బిర్యానీ ప్రియులకు ఇది నిజంగా ప్యారడైజే (స్వర్గం) కానీ ఇందులో ఎన్నో సినిమాలు చూసిన నాటితరం వారికీ మాత్రం ఇక్కడికి రాగానే టాకీసు కనిపించకపోవడం గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఏదో వెలితిగా ఉంటుంది….. బుద్దా మురళి (జ్ఞాపకాలు , నమస్తే తెలంగాణ 7. 1. 2018)
Share this Article