Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!

October 4, 2026 by M S R

.

అమిత్ షా పర్యటన రెండోసారి కూడా ఎందుకు రద్దయింది..? స్వయంగా రేవంత్ రెడ్డి చేతికి హైకమాండ్ ఓ పదునైన విమర్శనాస్త్రం ఇచ్చినట్టేనని బీజేపీలోనే అంతర్గతంగా వ్యతిరేకత వ్యక్తమైనందుకా..? ఇంకేమైనా అడ్డుపడుతున్నాయా..? తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది… ఇంట్రస్టింగు…

విషయం ఏమిటంటే..? అమిత్ షా తెలంగాణ పర్యటన ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది… తన పర్యటనలో ఆయన వచ్చేది దేనికి..? పైకి చెప్పడానికి తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలకు, ఇన్‌చార్జులకు దిశానిర్దేశం కోసం అని…! కాదు, అదే నిజమైతే తనెందుకు రావడం..? ఆ కర్తవ్యబోధను జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ద్వారా చేయిస్తారు… మరి..?

Ads

నిజానికి తన పర్యటనలో ప్రధానమైంది…  ప్రతిమ వైద్యకళాశాల రజతోత్సవం కోసం… అక్కడే లంచ్… ఆ కాలేజ్ ఎవరిది..? ప్రతిమ గ్రూపు సంస్థల ఓనర్ బోయిన్‌పల్లి శ్రీనివాసరావుది… తను మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సోదరుడు…

ఆ కుటుంబం పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్‌లో చాలా కీలక కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం తరువాత అంత ‘పవర్ ఫుల్’… అది బీఆర్ఎస్ బ్యాంకు… గులాబీ ఆర్థిక యవ్వారాలు, మంతనాలకు అడ్డా… కొన్ని వేల కోట్ల కంట్రాక్టులు, ప్రతిమ పాలిత రాష్ట్రం తెలంగాణ అన్నట్టుగా నడిచింది పదేళ్లు…

ఇదే బీజేపీ అనేకసార్లు అక్రమాలపుట్ట, కేసీయార్ ఏటీఎం అని ఆరోపించిన కాళేశ్వరంలో కూడా కంట్రాక్టరే సదరు ప్రతిమ శ్రీనివాసుడు… ఆల్రెడీ సీబీఐ దర్యాప్తు కోరుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది కూడా… ఐనా ఈరోజుకూ పుల్ల కదల్లేదు… ఎందుకు..?

బీజేపీ బీఆర్ఎస్‌తో రాబోయే రోజుల్లో దోస్తీ చేయబోతోంది కాబట్టి… కేసీయార్‌పై ఈగ కూడా వాలనిచ్చే మూడ్‌లో లేదు కాబట్టి… కేసీయార్ కుటుంబానికి ప్లస్ బీఆర్ఎస్ కీలక నేతలకు బీజేపీయే శ్రీరామరక్ష కాబట్టి… దీనికితోడు ఇక షా నేరుగా సదరు ప్రతిమ ఎంపైర్‌కు ఒక కాలేజీ రజతోత్సవం కోసం వస్తున్నాడు అంటే… బీజేపీ- బీఆర్ఎస్ వర్తమాన గుప్తస్నేహాన్ని, రాబోయే అధికారిక పొత్తు సంకేతాల్ని మరింత బలంగా ప్రదర్శించడమే…

షా పర్యటన పొత్తుపొడుపు సంకేతాలు అని మనం ఈమధ్య వివరంగానే చెప్పుకున్నాం కదా… కానీ సీబీఐ కేసుల్లో నిర్లిప్తత (అమిత్ షా మంత్రిత్వ శాఖ పరిధి), ప్రతిమ రాజ్య సందర్శన వంటివి ప్రజల్లోకి నెగెటివ్ సంకేతాల్ని పంపించినట్టు అవుతుందనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది… అది హైకమాండ్ దాకా చేరింది…

1) కేసీయార్ కమాన్, నీతో ఆలింగనానికి మేం ఆసక్తిగా ఉన్నాం, కలిసి సాగుదాం అంటూ బీజేపీయే ఓరకంగా సాగిలబడి, వెంపర్లాటను ప్రదర్శించినట్టు అవుతుందని బీజేపీ నేతల్లోనే ఓ అసంతృప్తి ఉంది… అంతేకాదు, సొంతంగానే తెలంగాణలో పుంజుకునే ప్రయత్నం చేద్దాం తప్ప ధృతరాష్ట్రుడి కౌగిలి వంటి కేసీయార్ ఆలింగనం వద్దనీ, ఒకసారి కేసీయార్‌తో కలిస్తే ఇన్నాళ్లు పెరుగుతున్న బలానికి మనమే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భావన కూడా కొందరు రాష్ట్ర నేతల్లో ఉంది…

2) ఇప్పటికే కేసీయార్ కుటుంబం ప్లస్ బీఆర్ఎస్ నేతల అక్రమాలు, భూయవ్వారాలు, అంతులేని ఆస్తుల సముపార్జన, అగడు పడ్డట్టుగా తెలంగాణను దోచుకున్నారంటూ రేవంత్ రెడ్డి ఆధారాలతోసహా విరుచుకు పడుతున్నాడు… బీఆర్ఎస్ మరింతగా డిఫెన్సులో పడిపోయింది… జనంలో కేసీయార్ కుటుంబం మరింత పలుచన అయిపోయింది, ఈ స్థితిలో సాక్షాత్తూ కాళేశ్వరం కంట్రాక్టరుతో, అదీ సీబీఐ దర్యాప్తును తుంగలో తొక్కిన తనే భేటీలు వేస్తే, మార్మిక చర్చలకు దిగితే, అది జనానికి ఏం సంకేతాల్ని పంపిస్తుంది అనే మథనం బీజేపీలోనే సాగుతోంది… రేవంత్ రెడ్డి ఇక బీజేపీ- బీఆర్‌ఎస్‌లను కలిపి ఉతికేందుకు చాన్స్ ఇచ్చినట్టే అనే తాజా సందేహాలే అమిత్ షా పర్యటన రద్దుకు కారణమనే చర్చ సాగుతోంది…

3) కానీ మరో వాదన ఏమిటంటే..? అమిత్ షాకు ఇవన్నీ తెలియదా..? ఇవేమీ ఆలోచించకుండానే ప్రతిమ శ్రీనివాసరావు, వినోద్‌కుమార్‌లతో భేటీకి, మార్మిక చర్చలకు రెడీ అయ్యాడా..? వర్తమాన రాజకీయాల్లో బీజేపీ మార్గం వేరు… ఏపీలో తమను తిట్టిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లను కౌగిలించుకోలేదా..? రాజకీయాల్లో బొద్దింకల్ని, గొంగళిపురుగుల్ని ముద్దాడటం అత్యంత సహజం… ఇతర రాష్ట్రాల్లోనూ… సో, ఏదో బదనాం అవుతామనే బెరుకు అమిత్ షాలో ఏమీ ఉండదు… పట్టించుకోడు… ఐనా పర్యటన రెండుసార్లు ఎందుకు రద్దయింది..?

4) కారణాలు అనేకం, బీజేపీ-మోదీ ప్రతిష్ట ఈమధ్యకాలంలో జాతీయ స్థాయిలో బాగా పడిపోయింది… మళ్లీ అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్‌ను నిలువరించాలంటే చాలా ప్రాంతీయ శక్తులతో దోస్తీ కావాలి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవాలి… అందుకని కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలుగా ముద్రపడిన రాజకీయ సమూహాలతోనూ- చంచల, ఏమాత్రం విశ్వసనీయత లేని వర్గాలతోనూ చేతులు కలపడం బీజేపీకి ఓ రాజకీయ అనివార్యత అయిపోయింది…

మరెందుకు షా పర్యటనలు రెండుసార్లు రద్దయినట్టు..? బీఆర్ఎస్- బీజేపీ సంప్రదింపులకు (పొత్తు, విలీనం, అవగాహన, లోపాయికారీ సహకారం ఎట్సెట్రా ఏదైనా సరే) బేసిక్ సూత్రం ఏదో ఇంకా ఫైనల్ కాలేదు అని అర్థం… ‘ఏ ప్రాథమిక సూత్రం’తో కలిసి సాగుదాం అనే విషయంలో ఏవో మెలికలు అడ్డుపడుతున్నట్టు ఉంది…

నిజంగానే కాంగ్రెస్ వ్యతిరేక వోట్ల చీలికను నివారించి, ఒకవేళ అధికారం పొందగలిగితే తదుపరి సీఎం ఎవరు..? కేటీయారేనా..? దానికి హరీష్ సిద్దంగా ఉన్నాడా..? కేటీయార్ ముఖ్యమంత్రిత్వాన్ని అంగీకరిస్తాడా..? పోనీ, హరీష్‌నే క్యాంపు మారేలా చేయగలిగితే..? ఇలాంటి సమీకరణాలు, ఆలోచనలు, సంప్రదింపులు కొలిక్కి వస్తున్నట్టు లేదు… ‘పొత్తుసూత్రం’ రఫ్‌గా తేలేదాకా ఆగుదాం అనే భావనే బహుశా అమిత్ షా పర్యటన రద్దుకు కారణమేమో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions