.
ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడం పెద్ద విషయం కాదు. సీక్వెల్ కూడా హిట్ అయితే మూడో భాగం తీయడం కూడా సహజమే. కానీ అక్కడే అసలు పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే ఒక కథకు మూడోసారి కొత్త ప్రాణం పోయాలంటే… పాత కథను సాగదీయడం సరిపోదు. కొత్తగా ఆలోచించాలి.
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ విషయంలో హిందీ సినిమా మేకర్స్ చేసిన అతిపెద్ద సాహసం అదే. ‘దృశ్యం’ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్. ఆ తర్వాత అదే కథను హిందీలో అజయ్ దేవగణ్, టబు తదితరులతో చూసిన ప్రేక్షకులు కూడా ఆ ఫ్రాంచైజీకి బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి రెండు భాగాలూ మలయాళ సినిమాల ఆధారంగానే వచ్చాయి. అందుకే మూడో భాగం విషయంలో కూడా అందరి చూపూ సహజంగానే మలయాళ ‘దృశ్యం 3’ వైపే ఉంటుంది.
Ads
అక్కడే హిందీ మేకర్స్ ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. మాతృకను పట్టుకుని నడవకుండా… మాతృకను పక్కన పెట్టి, అదే పాత్రలు, అదే ప్రపంచం, అదే గత కథకు కొనసాగింపుగా ఒక కొత్త కథను వాళ్లే రాసుకున్నారు. మలయాళంలో దృశ్యం ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్, సెకండ్ పార్ట్ నాణ్యత తగ్గింది కథలో… మూడో పార్ట్‌కు అంత అప్లాజ్ రాలేదు… సో, ఈసారి ఆ రెండో భాగం కథకు కొనసాగింపు, అంటే మూడో భాగం సినిమా కథను హిందీ టీమ్ వాళ్లే రాసుకున్నారు… మాతృకను వదిలేశారు…
ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రేక్షకులకు ఇప్పటికే విజయ్ సాల్గాంకర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసు. అతను కుటుంబాన్ని కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్తాడని తెలుసు. పోలీసులకు చిక్కకుండా ఎలా ఎత్తుకు పైఎత్తు వేస్తాడో కూడా తెలుసు. అలాంటి పాత్రను మళ్లీ అదే తరహా గేమ్‌లోకి తీసుకురావాలంటే కొత్త మజా కావాలి…
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’లో ఆ మజానే కనిపిస్తుంది. మలయాళం అక్కడ ఆగిపోయింది… హిందీ ఇక్కడ కొత్త దారి చూసింది… అది చెడ్డ సినిమా అని కాదు. కానీ ‘దృశ్యం’ అనే బ్రాండ్ ప్రేక్షకుల్లో సృష్టించిన అంచనాలకు తగ్గ స్థాయిలో కథలో కొత్తదనం కనిపించలేదు. మొదటి రెండు భాగాల్లో ఉన్న తెలివైన గేమ్, అనూహ్యమైన మలుపులు, పాత్రల మధ్య మైండ్ గేమ్… మూడో భాగంలో అదే స్థాయిలో పనిచేయలేదు.
ఇదే పాయింట్‌ను హిందీ మేకర్స్ చాలా తెలివిగా పట్టుకున్నట్టుంది. “అక్కడ ఏం జరిగిందో మళ్లీ ఇక్కడ ఎందుకు చేయాలి? మనమే కొత్తగా ఒక కథ ఎందుకు రాయకూడదు?” ఆ ఆలోచనే ఈ సినిమాకు బలం. అదే ఈ సినిమాకు అసలు విజయరహస్యం.

విజయ్ సాల్గాంకర్‌కి మరోసారి పరీక్ష. ‘దృశ్యం 2’ తర్వాత కథ అక్కడితో ముగిసిపోయిందని అనుకున్నాం. కానీ మీరా దేశ్‌ముఖ్ మాత్రం ఆ విషాదం నుంచి బయటపడలేకపోతుంది. తన కొడుకు మరణం వెనుక నిజం తెలుసుకోవాలన్న పట్టుదల ఆమెను మళ్లీ అదే కేసు దగ్గరకు తీసుకొస్తుంది. భర్త మహేష్ కూడా ఆమెకు అండగా నిలుస్తాడు. ఈసారి వాళ్లకు తోడుగా క్రైమ్ బ్రాంచ్ ఎస్.పీ. రాజ్‌వీర్ సింగ్ తోమర్ రంగంలోకి వస్తాడు.
అంటే విజయ్ సాల్గాంకర్ ఎదురుగా ఇప్పుడు ఒక పోలీసు అధికారి మాత్రమే లేడు. అతని గతాన్ని పూర్తిగా తవ్వి బయటకు తీయాలని నిర్ణయించుకున్న ప్రత్యర్థి ఉన్నాడు. ఇక్కడే సినిమా అసలు గేమ్ మొదలవుతుంది.
ఒకవైపు విజయ్. మరోవైపు అతన్ని ఎలాగైనా జైలుకు పంపాలనుకునే వాళ్లు. మధ్యలో గతంలో జరిగిన హత్య, దాన్ని దాచడానికి విజయ్ వేసిన ఎత్తులు, ఇప్పుడు ఆ ఎత్తులను ఛేదించడానికి పోలీసులు వేసే పైఎత్తులు. ఇది కథను ముందుకు నడిపించే ప్రధాన బలం.
ఫస్ట్ హాఫ్‌లో… దృశ్యం మార్క్ కనిపిస్తుంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ… ఇవన్నీ ఒక క్రైమ్ కథలో కలపడం అంత సులభం కాదు. కానీ ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి మొదటి నుంచీ ఉన్న ప్రత్యేకత అదే. ఇక్కడ కూడా ఆ టోన్‌ను మేకర్స్ బాగా కాపాడారు.
ముఖ్యంగా అజయ్ దేవగణ్, జైదీప్ అహ్లావత్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాలో ఆసక్తిని పెంచుతుంది. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడినప్పుడు వచ్చే టెన్షన్‌కి తోడు, సన్నివేశాల్లో సహజంగా పుట్టే హాస్యం కూడా పనిచేస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఇద్దరి ఫేస్-ఆఫ్ అయితే సినిమాకు మంచి హైలైట్. క్రైమ్ కథలో నవ్వించాలి అంటే ఆ కామెడీ కథను ఆపకూడదు. ఇక్కడ ఆ విషయంలో రైటింగ్ చాలా జాగ్రత్తగా ఉంది.
అసలు గేమ్ కోర్టులోనే … సెకండాఫ్‌లో కథ కోర్ట్‌రూమ్‌కు మారడంతో సినిమా మరో రూపం తీసుకుంటుంది. ఇక్కడే ‘దృశ్యం’ సినిమాల అసలు బలం మరోసారి బయటపడుతుంది. విజయ్ చేసిన పని ఏమిటి అన్నదానికంటే…
అతన్ని ఎలా పట్టుకుంటారు?
అతను ఎలా తప్పించుకుంటాడు?
ఎవరి దగ్గర ఏ ఆధారం ఉంది?
ఎప్పుడు ఎవరు ఏ మాట మాట్లాడాలి?
అనే ప్రశ్నలే ఆసక్తిని పెంచుతాయి. కోర్టు సన్నివేశాల్లో వచ్చే ట్విస్టులు, వాటికి ముందు వేసే బిల్డప్ సినిమా రెండో భాగాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. అజయ్ దేవగణ్ కూడా ఇక్కడ పెద్దగా హడావుడి చేయకుండా పాత్రను సటిల్‌గా తీసుకెళ్లాడు. కుటుంబం కోసం ఏదైనా చేయగల వ్యక్తిగా అతని ఎమోషన్ ఈ ఫ్రాంచైజీలో మొదటి నుంచీ కీలకం. ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుంది.
జైదీప్ అహ్లావత్… విజయ్‌కు సరైన ప్రత్యర్థి… ఈ సినిమాలో అజయ్ దేవగణ్‌కు గట్టిగా పోటీ ఇచ్చే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది జైదీప్ అహ్లావత్. రాజ్‌వీర్ సింగ్ తోమర్‌గా అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కళ్లతోనే ప్రత్యర్థిని చదవాలనుకునే తీరు పాత్రకు బలం ఇచ్చాయి.
‘దృశ్యం’ కథలో పోలీస్ అంటే కేవలం యూనిఫాం వేసుకున్న అధికారి కాదు. విజయ్ తెలివికి సరితూగే తెలివి ఉండాలి. జైదీప్ ఆ అవసరాన్ని తీర్చాడు. ప్రకాష్ రాజ్, శ్రియా సరన్, ఇషితా దత్తా, కమ్లేష్ సావంత్ తదితరులు కూడా తమ పరిధిలో బాగా చేశారు.
అయితే ఒక చిన్న అసంతృప్తి మాత్రం ఉంది. మీరా దేశ్‌ముఖ్‌గా టబు మొదటి రెండు భాగాల్లో ఎంత బలమైన ఇంపాక్ట్ ఇచ్చిందో, ఈసారి ఆ స్థాయి పాత్రకు స్క్రీన్ స్పేస్ దక్కలేదు. కథ విజయ్- పోలీస్ మైండ్ గేమ్ వైపు వెళ్లడంతో ఆమె పాత్ర కొంత వెనక్కి వెళ్లిపోయింది.
క్లైమాక్స్ ముందే తెలిసిపోతుందా? ఇక్కడే సినిమాకు ఉన్న ఒక బలహీనత కూడా కనిపిస్తుంది. ఇది ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ముగింపు అని మనకు ముందే తెలుసు. అంటే చివరికి విజయ్ సాల్గాంకర్ ఏం అవుతాడన్న ప్రశ్నకు మనలో చాలామందికి ఒక అంచనా ఉంటుంది.
అందువల్ల క్లైమాక్స్ దగ్గరికి వెళ్లే కొద్దీ “ఏం జరుగుతుంది?” అనే ఉత్కంఠ కంటే “ఎలా జరుగుతుంది?” అనే క్యూరియాసిటీ ఎక్కువవుతుంది. ఇది పెద్ద మైనస్ కాదు. ఎందుకంటే ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ తన ట్విస్ట్‌ను దాచిపెట్టి ప్రేక్షకుడిని మోసం చేయాలని ప్రయత్నించదు. అసలు ఆట ఎక్కడ జరుగుతుందంటే… ఆ ముగింపుకు విజయ్ ఎలా చేరుకుంటాడు అన్నదాంట్లో. అక్కడే సినిమా తన పనిని సక్సెస్‌ఫుల్‌గా చేస్తుంది.
ఈ సినిమాకు అసలు హీరో టెక్నికల్ విభాగం కాదు. రైటింగ్. అభిషేక్ పాఠక్ అండ్ టీమ్ చేసిన అతిపెద్ద పని అదే. రీమేక్ ఫ్రాంచైజీకి ఇది ఒక పాఠం. సినిమా చూసిన తర్వాత ఎక్కువగా ఆలోచింపజేసే అంశం ఇదే. ఒక సినిమా రీమేక్‌తో ప్రారంభమవ్వచ్చు. కానీ ఒక ఫ్రాంచైజీగా ఎదగాలంటే ఎప్పటికీ మాతృకపై ఆధారపడుతూ ఉండాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా మూడో భాగానికి వచ్చేసరికి ప్రేక్షకుడికి ఆ ప్రపంచం, ఆ పాత్రలు, ఆ ఫార్ములా అన్నీ తెలుసు. అప్పుడు అదే కథను మరోసారి వడ్డిస్తే ప్రేక్షకుడు మొదటి ముద్దకే రుచిని గుర్తుపడతాడు. హిందీ ‘దృశ్యం’ మేకర్స్ ఆ ప్రమాదాన్ని తప్పించారు. మలయాళ ‘దృశ్యం 3’లో పనిచేయని అంశాలను కాపీ చేయకుండా, మొదటి రెండు భాగాల నుంచి పాత్రలను, భావోద్వేగాలను, ప్రపంచాన్ని తీసుకుని… కథను మాత్రం కొత్తగా రాసుకున్నారు.
అందుకే ఇది రీమేక్ మూడో భాగంలా కాకుండా, విజయ్ సాల్గాంకర్ కథలో మరో అధ్యాయంలా అనిపిస్తుంది. ఒక మంచి కథను ఎంతకాలం అయినా సాగదీయొచ్చు అనుకోవడం పొరపాటు. కొన్ని కథలకు ఒక అద్భుతమైన ముగింపు ఇవ్వడమే వాటి గౌరవాన్ని కాపాడుతుంది….
తీర్పు: మాతృకకు ముగింపు ఎలా ఉండాలో చూపించకపోయినా… ఒక రీమేక్ ఫ్రాంచైజీకి తన సొంత ముగింపును ఎలా రాసుకోవాలో మాత్రం హిందీ ‘దృశ్యం’ చూపించింది….
Share this Article