Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘డోరతి’ మూవీ… ఇది ‘మరో చరిత్ర’… మరో అంటరాని చరిత్ర…

October 6, 2026 by M S R

.

డోరతి సినిమా చూశాక ఎందుకో బాలచందర్ గారు తీసిన ‘మరో చరిత్ర’ స్పురణలోకి వచ్చింది. మనుషుల గుర్తింపు అన్నది కులం, మతం ఆధారంగా మౌలికమైపోయి సదరు మనుషులని ఎట్లా పరీక్షిస్తుందో హత్యకు లేదా ఆత్మహత్యకు ఎలా పురికొల్పుతుందో మానని గాయంలాగా ఆ సినిమా ఎప్పటికీ గుర్తు చేస్తుంది. 1978లో తీసిన అ సినిమా విషాదాంత చిత్రం. అందులో నాయికా నాయకులు కొండపై నుంచి పడి మరణించడం ఎన్నటికీ మరచిపోలేం. వారిది ఆత్మహత్య కాదు. హత్యే అని మనకు తెలుసు.

ఎప్పటికీ మానని గాయంలాగా ‘డోరతి’ చిత్రం కూడా మరో అంటరాని చరిత్ర, మనసును వేదనకు గురి చేసే గాయం. కులం, మతం, ప్రాంతం, వాటికి ఆధారభూతంగా ఉండే భాషా సంస్కృతులు, అన్నీ కూడా ఎట్లా వివక్షకు గురి చేస్తాయో నాటి ‘మరో చరిత్ర’ కావొచ్చు, నేటి ‘డోరతి’ కావోచ్చు, ఈ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఎవరైనా ఎప్పటికీ యాది మరవక ఒకింత యాతన పడుతాం.

Ads

నిజానికి ఇందులో కూడా ఆత్మహత్యలున్నయ్. ఇద్దరు స్త్రీలు ‘బావిలో పడి’ మరణిస్తారు. మూడో వ్యక్తి పురుషుడా స్త్రీయా అన్నది కథ. అ పాత్ర కూడా చావవలసిందే లేదా చంపదగినదే అన్నట్టు సమాజం చూస్తుంది. ముఖ్యంగా సమాజానికి మూలమైన కుటుంబం. కుటుంబంలో భాగమైన మరో పాత్ర కార్తి (రిషికాంత్ ) చూస్తాడు. మిత్రుడే శత్రువై ఆ వ్యక్తిని చంపవలసి వస్తుంది. చంపాడా లేదా అన్నది కథ. ఐతే, ఇది కూడా హత్య కథ. ముఖ్యంగా పరువు హత్యాగాథ. సమాజంలో ఈ నిశ్శబ్ద పరువు సమస్యను ఆర్ద్రంగా ఎంతో ప్రభావశీలంగా ఆవిష్కరించిన మొదటి సినిమా ‘డోరతి’.

*

నిజానికి పరువు హత్యల గురించి మనంఎంతో విన్నాం. కానీ ట్రాన్స్ జెండర్ గా తన గుర్తింపును తాను ప్రకటించుకుని తనను తాను ‘డోరతి’గా నామకరణం చేసుకునే సుబ్బు పాత్ర (సనంత్ నటించాడు) పరువు హత్యగా చూడవలసిన పాత్ర. నిజానికి భారతీయ సినీ చరిత్రలో గొప్ప కథానాయకిగా గుర్తుండే అవకాశం ఈ కేరెక్టర్ కి ఉన్నది. చివరాఖరికి తన ఉనికి, గుర్తింపును బాహాటంగా చాటుకోవడానికి నిశ్చయం చేసుకున్నాక మొదలైన కథే మూల కథ. పరువు హత్యకు తావిచ్చిన ఆ కథనమే ఈ చిత్ర సారాంశం.

అందువల్ల ఒక్క మాటలో ఈ సినిమా పరువు హత్యలకు ఆలవాలమైన మన కర్మ భూమిలో నిర్భయంగా పూసిన ఒక మందార పూవు అనొచ్చు. తన చేతుల్తోనే తన మిత్రుడిని చంపక తప్పని స్థితిని పోషించిన కార్తిని చూస్తుంటే, ఆ రగ్గుడ్ – సింపుల్ లుక్స్ -ఆ పాట రాసిన కలేకూరి ప్రసాద్ గుర్తొచ్చాడు.

కాగా, ఆ మందారం నేల రాలిందా లేదా అని చెప్పే ఈ సినిమా లింగ వివక్ష సహజాతి సహజంగా మారిపోయిన మన పితృస్వామిక సమాజంపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వెలువరించిన అద్భుతమైన సమీక్ష. చేసిన కటువైన విమర్శ. మరో మాటలో ఆడతనాన్ని ఒప్పుకోలేని మగతనంపై వేసిన సెన్సిబుల్ సెటైర్. మీదు మిక్కిలి – ట్రాన్స్ జెండర్ల ఆత్మగౌరవానికి పలికిన అద్భుత నీరాజనం.

*

నిజానికి ఒక జాతి గుర్తింపు, వారి ఉనికి, అస్తిత్వం కోసం చేసిన పోరాటం పేరుతో వచ్చిన ఇటీవలి ఒక సినిమా – ప్యారడైజ్ – సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉన్నది. ఆ చర్చ , అందలి పాజిటివ్, నెగెటివ్ రివ్యూస్, సొంత పబ్లిసిటీ, వెరసి మొత్తంగా అదొక లౌడ్ సినిమా అనుకుంటే నిశ్శబ్ధంగా మరొక ‘గుర్తింపు’ అంశం గురించి వచ్చిన సినిమా ‘డోరతి’.

ఇది ఒక జాతికి జాతి (మగ ) మేం ఆడవాళ్ళం అన్నాకూడా ఒప్పుకొని, ఆ మనుషులు తమ మధ్య బ్రతకనే కూడదని నిరాకరించిన కుటుంబం, ఊరు, సమాజం తాలూకు భద్ర వ్యవస్థ సినిమా ఇది. ప్యూర్ ట్రాన్స్ జెండర్ల కథ. తమ ఉనికిని తాము చాటేందుకు భయపడే సమాజంలో ఇద్దరు మిత్రులు శత్రువులుగా చివరాఖరికి ప్రేమికులుగా మారే గుణాత్మక చిత్రం. ఒక సుబ్బు డోరతిగా పరిణామం చెందే అసామాన్య కథ. ప్రేక్షకులను హృద్యంగా మెప్పించే పాత్ర. గొప్ప హాస్యం కూడా ఉందీ చిత్రంలో.

ఇటీవల వచ్చిన ఈ సినిమా బహుశా భారతీయ సినీ వినీలాకాశంలో ఈ అంశంపై వచ్చిన మొదటి చంద్రబింబం కావొచ్చు. పది కోట్ల బడ్జెట్ తో ఆరు మాసాల వ్యవధిలో రూపొందించిన సినిమా ఇది. మూడు గంటల సమయం ఎప్పుడై పోయిందో కూడా తెలియనివ్వని సినిమా. గొప్ప కథ. అధ్బుతమైన పాత్రలు, చక్కటి సంగీతం. అందమైన సినిమాటోగ్రఫీ. సహజమైన పరిసరాలు. అర్థవంతమైన సభాషణలు, కేరెక్టరైజేషన్ లో అపూర్వమైన హార్మొనీ, అసాధారణమైన ట్రాన్స్ఫర్మేషన్.

చివరకు సినిమా ఎంతో బరువైన సందేశం ఇచ్చినప్పటికీ దర్శకుడి ప్రతిభ కారణంగా ఎక్కడా భారం కాదు. అసహనానికి గురిచేయదు. ముఖ్యంగా ఆశావాద ముగింపు. అతడు క్లాస్ కావొచ్చు, మాస్ కావొచ్చు, ఇంటికి తిరిగి వెళ్ళే ప్రయాణీకుడు సంతృప్తితో మరలుతడు. అదే డోరతి.

*

నిజానికి డోరతి కీర్తి సురేశ్ పాత్ర. తాను మగవాడిగా మసులుకునే సుబ్బును, ‘నువ్వు అందమైన ఆడపిల్లవు, నీవు నీలా ఉండటమే ఉత్సవం’ అని నమ్మకం కలిగించే పాత్ర. ‘ మీ ఇంట్లోనే కాదు, బయటా మగవాళ్ళు స్తీలను అణిచివేస్తారు. ఆడదానివి, నువ్వు కూడా నిన్ని అణచివేస్తే ఎలా? నీలా ఉండాలనుకోవడం తప్పేం కాదు, సహజం’ అని నుదిటిపై ముద్దుపెట్టి సుబ్బుకు తాను తాను వికసించేందుకు తోడ్పడిన వంతెన వంటి పాత్ర. ఈ వివేకం కలిగించిన పాత్రకు కూడా చావే గతి అవుతుంది. అది ఈ సినిమాలో కీలకం. అక్కడి నుంచే సుబ్బు తానే ‘డోరతి’గా మారడం మలుపు.

dorothy

చిత్రమేమిటంటే, సుబ్బుకి వదినగా డోరతి ఇంటికి వచ్చినప్పుడు తన మిత్రుడు కార్తికి ఒక అందాల బొమ్మ వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి చూపుతాడు,. చివరాఖరికి, తాను ‘డోరతి’ (ఆమె)గా పరిణామం చెందాక అద్దంలో చూసుకుంటున్నప్పుడు లీలగా ఆమె డోరతి వంటి అందాల బొమ్మగా కాన రావడం ఒక పోయేటిక్ జస్టిస్ మాత్రమే కాదు, అందమైన రియలిజం. ఇదంతా తెరమీద చూడటం ఒక గొప్ప అనుభవం.

ఒక రకంగా ఈ సినిమా ఎంతో అందమైన అర్థవంతమైన చర్చను సమాజంలోకి సుతారంగా తేగలుగుతున్న సినిమా. ఒక సినిమా ఎంత శక్తివంతమైన మధ్యమమో మరోసారి నమ్మిక కుదిర్చే సినిమా కూడా.

ఈ సినిమా ఇతివృత్తం అనేక పొరలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మగతనం మాటున స్త్రీలను అణచి పెడుతున్న పురుషాహంకారంపై ఎంతోకాలంగా దాచిపెట్టిన ఆడతనం తనలా తాను ఉండటానికే నిశ్చయించుకుని అకస్మాత్తుగా తిరుగుబాటు చేసిన వైనమే డోరతి. అప్పటిదాకా కులం నీడన దాగిన కానరాని పరువు హఠాత్తుగా ఒల్లువిరుచుకుని రగిలిన చైతన్యాన్ని హతమార్చేందుకు పూనుకున్న గాథనే డోరతి.

మరో మాటలో ముందు చెప్పినట్టు పరువు హత్య కథ ఈ చిత్ర సారాంశం. ఐతే, దీన్ని కావ్యస్థాయిలో ఒక కేశవరెడ్డి తాలూకు భీభత్సరసంలోకి మారిన నవల చదివిన అనుభూతిని కలిగించడం విశేషం. దర్శకుడికి, అలాగే, ఈ సినిమాను తెలుగులో సమర్పించే సాహసం చేసిన రానా దగ్గుబాటికి కూడా అభినందనలు.

*
అన్నట్టు, ఒక చలనచిత్రం వర్తమానం వదిలి గతాన్ని ఆశ్రయించి కథ చెప్పడం ఎందుకో ఈ సినిమా చూస్తే గానీ బోధపడదు.

అవును, కథ తొంభయ్యవ దశకంలో ప్రారంభం అవుతుంది. నిజమే మరి. ఇప్పుడు వచ్చిన చట్టాలు, హక్కులు, లేదా సమాజం కాస్త చైతన్యవంతమైన సమయం ఇది. కానీ, 95లో కథ కల్పించడం ఎందుకూ అంటే నిన్నటిదాకా అనేక భయాల మధ్య తమ గుర్తింపు దాచుకుని, ఎంతో సాహసంతో తమ ఉనికిని చెప్పుకుంటే లేదా బాహాటంగా వ్యక్తం చేసుకుంటే ఎన్ని సమస్యలు!

అప్పటినుంచి నేటిదాకా ఇంటా బయటా వారు పడ్డ వేదన, పొందిన దుఖం, ఎదుర్కొన్న ఘర్షణ. అడుగడుగునా వివక్ష, చివరకు హత్య్యాయత్నాలు, ఆత్మహత్యలు, వీటన్నిటినీ మనం ఒక సామాన్య ప్రేక్షకుడిగా మారి ఆ పరిణామ చరిత్రను వెలిగే తెరముందు చీకట్లో కూచొని నిదానంగా అర్థం చేసుకుంటేగానీ ప్రయోజనం లేదు.

అందుకే గతం నుంచి కథ వర్తమానంలోకి నడిచొచ్చేలా, వారు నడిచొచ్చిన త్రోవ ఎంత భయకరమో మనకు మూడే మూడు గంటల్లో అర్థం చేసేలా దర్శకుడు ఈ కథను వెనక్కి వెళ్లి చెప్పడం ఒక చక్కటి ప్రయోగం. ఇదంతా రేపటి నుంచి మనం రేపటిలోకి, అంటే ముందుకు పోయేందుకే.

అవును. ట్రాన్స్ జెండర్ల విషయంలో ఒక సమాజంగా మనమందరం నేటినుంచి ఎంత సున్నితంగా ఉండవల్సిందో హత్తుకునేలా ఆవిష్కరించడం ఒక మెలుకువ కోసమే. ఒక గొప్ప అనుభూతి, సంవేదన, ఆర్తిని రగిలింప జేయడం మనుషులుగా చేతులు చాపిన డోరతిని ఆత్మీయంగా మనం ఆలింగనం చేసుకోవడానికే.

లేకపోతే మనం ఇంకా అంటరాని వాళ్ళమే. చూడండి డోరతిని. మీ ఊర్లో… మీ వీధిలో.. లేదా తెరమీద అయినా….. — కందుకూరి రమేష్ బాబు  99480 77893

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘డోరతి’ మూవీ… ఇది ‘మరో చరిత్ర’… మరో అంటరాని చరిత్ర…
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!
  • సేమ్… ఫ్రాన్స్‌లోనూ బొద్దింకలు – ఈ స్క్రిప్టులు రాస్తున్నదెవరు?!
  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!
  • అది చదివితే ‘కాశీయాత్ర’ చేసినంత పుణ్యం- జ్ఞానం- విలువ !!
  • ఉత్త స్క్రాప్! ఈ సంతను యాణ్నుంచి పట్టుకొచ్చావురా బిగ్‌బాస్..!
  • సింగీతంకు తెలుగు సమాజం నుంచి సముచిత గౌరవం దక్కిందా?!
  • అక్షరధామ్! స్వామి నారాయణుడితో నేనెందుకు కనెక్ట్ కాలేకపోయాను?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions