.
Rochish Mon …. చో రామస్వామి … దమ్ముతో, పదునుతో ఒక దార్శనిక పాత్రికేయుడు!
చో రామస్వామి… ‘భారతదేశంలో వచ్చిన విలువైన, నిజాయితీ నిండిన, నిక్కచ్చయిన, నిజమైన రాజకీయ విశ్లేషకుడు, ఉన్నతమైన పాత్రికేయుడు (ఉన్నతమైన పాత్రికేయుడు అంటేనే కమ్యూనిస్ట్, కాంగ్రెస్ తెలుగు పాత్రికేయుడు కాదు అనే) చో రామస్వామి’…
చో రామస్వామి ఒక జాతీయతా భావాల రాజకీయ దార్శనికుడు! 2005లోనే నరేంద్ర మోదీ దేశ భవిష్యత్ ప్రధాని కావాలి అని ఆశించి, గణించి, ప్రతిపాదించిన దార్శనికుడు చో.
నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఆవశ్యకతను 2005లోనే గుర్తించడం చో ఏ మేరకు ‘దేశ చింతన’ కలవారో తెలియజేస్తుంది; చో దార్శనికతను తెలియజేస్తుంది.
Ads
(నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడాన్ని ఆకాంక్షించిన తొలి దశ పరిశీలకులు, విశ్లేషకుల్లో సుబ్రమణియన్ స్వామి కూడా ఒకరు! సుబ్రమణియన్ స్వామి ఈనాటి మాటలు వింటున్నప్పుడు నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడాన్ని ఆకాంక్షించిన తొలిదశ వ్యక్తి ఆయన అని తెలియరావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సుబ్రమణియన్ స్వామి ప్రవర్తన, మాటలు సుబ్రమణియన్ స్వామి మార్క్. కానీ ఆయన దేశానికి చేసిన మేళ్లు ఉన్నాయి. ముఖ్యంగా సుబ్రమణియన్ స్వామి దేశానికి చేసిన పెనుమేలు సోనియా గాంధీని దేశ ప్రధాని కానివ్వకపోవడం. ఈ విషయాన్ని నేను 2020లో ఆంధ్రభూమిలో రాశాను)
విశేషమైన బహుముఖీన ప్రజ్ఞావంతుడు చో. నాటక, చలనచిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత చో. తమిళ్ష్ చలనచిత్రాలలో ఒక ప్రముఖ హాస్య నటుడిగా లబ్దకీర్తి చో.
‘తుగ్లక్’ అన్న తమిళ్ష్ రాజకీయ పత్రికను 1970 నుంచీ నడిపి జాతీయ స్థాయిలో విశిష్టమైన పాత్రికేయుడిగా వినుతికెక్కారు చో. జాతీయతా భావాల నిజ మేధావి చో.
చో భయం లేని వ్యక్తి! ఏ శక్తికీ ఏ సందర్భంలోనూ భయపడలేదు చో. అతి భయంకరమైన, అతి కిరాతకమైన శ్రీలంక టైగర్లకు కూడా జంకలేదు చో! 80వ దశాబ్దిలో తమిళ్ష్నాట ఎల్టీటీఈ నేత ప్రబాగరన్ పై ఒక విధమైన అభిమానం, సానుభూతి వ్యాపిస్తున్నా ఎల్టీటీఈ నేత ప్రబాగరన్నూ తీవ్రంగా విమర్శిస్తూ, ప్రబాగరన్ను దోషి, నేరస్థుడు అని వాస్తవాన్ని పదేపదే చెప్పేవారు చో. అదీ చో ధైర్యం!
ఒక దశలో, రాజీవ్ గాంధీ మరణానంతరం ఎల్టీటీఈ చోను చంపేస్తుందని అందరూ అనుకున్నారు. చోకు అది అతి తీవ్రమైన హెచ్చరికలు చేసింది. చో వెనక్కు తగ్గలేదు!
అన్నట్టుగానే ఎల్టీటీఈ తన నైసర్గిక రాక్షస ధోరణిలో చోను అతి కిరాతకంగా చంపే ప్రయత్నం చేసింది!
ఒక రోజున ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో రైలు దిగుతున్న చోపై టైగర్లు భయంకరమైన ఆసిడ్‌ను పెద్ద మొత్తంలో విరజిమ్మారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆసిడ్ అక్కడి పలువురు ప్రయాణికులపై పడింది; చోపై మాత్రమే పడలేదు; ఒక్క చుక్క ఆసిడ్ కూడా చో పై పడలేదు! చోకు ఏమీ కాలేదు.
“నా మరణం ప్రబాగరన్ చేతిలో అని నిర్ణయమైపోయుంటే దాన్ని ఎవరూ తప్పించలేరు, కాబట్టి నేను అతడికి భయపడను” అని చో బహిరంగంగా చెప్పారు.
చో దైవ భక్తిపరుడు. చో ఆధ్యాత్మిక అభినివేశం ఉన్న వ్యక్తి. చో హిందూత్వ వాది. హిందువుల డబ్బుతో పొట్టపోసుకున్న, పొట్టపొసుకుంటున్న తెలుగు పాత్రికేయుల్లో హిందూత్వ వాదులు ఎవరు? ఎంత మంది? వీధి జాగిలానికి ఉండే విశ్వాసమైనా ఉన్న తెలుగు పాత్రికేయులు తెలుగులో ఉండేవారా? ఇప్పుడు ఉన్నారా?
“ఎక్కడున్నాడు బ్రాహ్మణుడు?” శీర్షికతో బ్రాహ్మణ్యంపై విప్లవాత్మకమైన రచన చేశారు చో. చో గొప్ప చింతనా శీలి, గొప్ప చదువరి. తెలుగు సీనిఅర్ పాత్రికేయులకు ఈ చదువు, సరైన చింతన అన్నవి ఉంటాయి అన్న ఆలోచనైనా ఉందా? తెలుగు కవులకు, సాహితీ వేత్తలకే కాదు తెలుగు పాత్రికేయ మేధావులకు కూడా ‘చదువు’ ఉండదు అన్నది క్షేత్ర వాస్తవమే కదా?

తమిళ్ష్‌నాడులో ద్రావిడ విషంపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు చో. ‘వికార వ్యక్తి పెరియార్’ను తీవ్ర స్థాయిలో తూర్పారపట్టే వారు చో. కరుణానిధిని తీవ్ర స్థాయిలో తప్పుపడుతూనే ఉండే వారు చో. బహిరంగంగా పెరియార్, కరుణానిది వంటి వాళ్లను అపహాస్యం చేసేవారు చో. కరుణానిది బతికున్నన్నాళ్లూ అపహాస్యం చేస్తూనే ఉండేవారు చో.
ఇందిరా గాంధీని అతి తీవ్రంగా విమర్శించే వారు చో. తన ప్రఖ్యాత నాటకం ‘మొహమ్మద్ బీన్ తుగ్లక్’ ద్వారా ఇందిరా గాంధీ విధానాలను, చేతలను తుర్పారపట్టేవారు చో. నెహ్రూ రాజకీయ, ఆర్థిక విధానాలను విద్యాత్మకంగా తీక్ష్ణంగా విమర్శించారు చో.
కంచి పెద్ద శ్రీ చంద్రశేఖర సరస్వతి వారికి చో అంటే ప్రత్యేకమైన అభిమానం. “రాస్తున్న ప్రతి వ్యక్తీ చో అవుతాడా” అని చంద్రశేఖర సరస్వతి అన్నారు. ఈ మాట చో ఎంత గొప్ప వారో తెలియజేస్తుంది.
వీ.పీ.సింఘ్ ప్రధాని కానున్న సమయంలో దేశంలో ఆయన ప్రధాని అయితే జరుగబోయే దుష్పరిణామాల్ని ముందుగానే పసిగట్టగలిగిన ‘మహా పెరియవా’ చంద్రశేఖర సరస్వతి వారు చో మూలంగా ఆడ్వాణీ, సుబ్రమణియన్ స్వామి వంటివాళ్లు వీ.పీ. సింఘ్ ప్రధాని కాకుండా ఆపాల్సిన ఆవశ్యకతను, అందుకు కావాల్సిన సూచనలను పంచుకున్నారు. (ఈ విషయంగా ఇంతకన్నా ఎక్కువ వివరాలను ఉద్దేశ పూర్వకంగానే ఇవ్వడం లేదు)
చంద్రశేఖర సరస్వతి వారి ఆశంస, ఆలోచన ఆచరణలోకి రాలేదు. వీ.పీ. సింఘ్ ప్రధాని అయ్యాక దేశం అన్ని రకాలుగానూ ఏ మేరకు దెబ్బతిందో, హిందువులు ఎంత దారుణంగా దెబ్బతిన్నారో బాధాకరమైన చరిత్రగా నమోదై ఇవాళ్టికీ మనకు ఆవేదన కలిగిస్తూంటుంది.
చో రామస్వామి గొప్ప కళాభిజ్ఞత ఉన్న వారు. శివాజీ గణసన్ గొప్ప నటుడు అని తమిళ్ష్ లోకం ఆర్తనాదం చేస్తూంటుంది. శివాజీ నటనను చూస్తూ షూటింగ్ సమయాల్లోనే చో నవ్వేవారు! శివాజీ ఉడుక్కునే వారట. చో మహాకవి సుబ్రమణియ బారదియార్ అభిమాని.
చో కణ్ణదాసన్ అభిమాని. ఒక సందర్భంలో కణ్ణదాసన్ తనను విమర్శించినందుకు ఆయన పత్రికలో చోను ‘ఒక చిన్న పురుగు’ అని రాశారు. ఆ తరువాత చో తనను కలవాలనుకున్న కణ్ణదాసన్‌కు వెయ్యాల్సిన చురక వేశారు.
“కవిగా కణ్ణదాసన్ హిమ నగం; రాజకీయాల్లో కణ్ణదాసన్ ఒక మట్టిదిబ్బ” అన్నారు చో.
కణ్ణదాసన్ పత్రికా ముఖంగా చో పై తన మాటలకు నొచ్చుకుంటున్నట్టు ప్రకటన చేశారు. (కణ్ణదాసన్ ఒక పత్రిక సంపాదకుడు కూడా)
దేశానికి అవసరమైన మేధతో, గొప్ప పాత్రికేయుడు చో. తన తుగ్లక్ పత్రికలో ఆయన నిర్వహించిన ‘ప్రశ్న జవాలు’ శీర్షిక మేధ పరంగా దేశ ప్రసిద్ధం. పెద్ద సర్క్యూలేషన్ లేని తన తమిళ్ష్ పత్రికతో చో దేశవ్యాప్తంగా గొప్ప పాత్రికేయుడిగా ప్రశస్తమయ్యారు! ఈ పరిణామం చో నాణ్యతను తెలియజేస్తుంది. తెలుగులో చో స్థాయి మేలైన రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు ఉన్నారా?
అవినీతికి, వంచనకు, అబద్ధాలకు, తప్పుడుతనానికి, విదేశీ మతాల నేరాల విషయంలో నపుంసాత్మక మౌనానికి, దేశ ద్రోహానికి, దేశ వ్యతిరేకతకు, విద్వేష వాదానికి, జన విరోధ భావజాలానికి, విదేశీ మతాల నుంచి వచ్చే లబ్దికి, విదేశీ మాఫిఅలకు, కమ్యూనిజానికి, నక్సలిజానికి, కులోన్మాదానికి, ప్రజల్ని పెడతోవ పట్టించే పాత్రికేయానికి, హైందవ వ్యతిరేక పాత్రికేయానికి అతీతంగా ఉన్నతమైన పాత్రికేయుడు చో.
‘నాణ్యమైన మనిషి’ చో. చాల మంచి వ్యక్తి; ఉన్నతమైన వ్యక్తి చో. దేశావసరాల పరంగా గొప్ప పాత్రికేయుడు చో. తన పాత్రికేయంతో ‘అవినీతి ఆదాయం’ పొందని శ్రేష్ఠమైన పాత్రికేయుడు చో. రాజ్‌దీప్ సర్దేశాయ్, బర్ఖా, శేఖర్ గుప్త వంటి కొందరు జాతీయ పాత్రికేయులు తెలుగు ప్రముఖ, సీనిఅర్ పాత్రికేయులు చో కాలి దుమ్ము పాటి కూడా చెయ్యరేమో?
సంపాదకీయాలు, ఎడిట్ పేజ్ వ్యాసాలు, వార్తా కథనాలు దేశ వ్యతిరేకంగానే, ప్రజలకు వ్యతిరేకంగానే, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే, కేంద్ర ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి; ఉండాలి అన్న స్థితిలో అత్యంత అధమంగా ఉన్న ఇవాళ్టి తెలుగు పాత్రికేయం చో పాత్రికేయం తీరును, స్థాయిని పనితనాన్ని ఇకనైనా తెలుసుకుని సిగ్గుపడాలి; తనను తాను అసహ్యించుకోవాలి.
అర్థ శతాబ్ది కాలంలో చో వంటి జాతీయ స్థాయిలో పరిగణించబడ్డ మేలైన పాత్రికేయుడు తెలుగులో లేకపోవడం ఏమిటి? చో వంటి గొప్ప మేధ, దార్శనికత్వం, విశ్లేషణా పటిమ, చదువు, దేశ స్పృహ, మేలైన పరిశీలన ఉండే పాత్రికేయుడు తెలుగులో భవిష్యత్తులోనైనా వస్తాడా?
చో… ‘దమ్ముతో, పదునుతో ఒక దార్శనిక పాత్రికేయుడు చో’. ఈ నిజం తెలుగు నాసిరకం ఆపై ధూర్త, నపుంసక పాత్రికేయానికి అతీతంగా దేశంలో బలంగా నమోదైపోయింది. తెలుగు పాత్రికేయ మేధావుల్లో ఎవరికి, ఎంతమందికి చో గురించి సరైన ఆలోచన, అవగాహన ఉన్నాయి?
రాహుల్ గాంధీనే కాదు అభిజీత్ దిప్కేని కుడా తలకెక్కించుకున్న బుద్ధి, చదువు, సిగ్గు లేని వికార తెలుగు పాత్రికేయం చో రామస్వామి ఆదర్శంగా సరైన ‘తల’తో పనిచేసే పాత్రికేయం అయ్యే అవకాశం ఉందా?
రోచిష్మాన్
9444012279
Share this Article