ఎన్నో ఏళ్లు శ్రమిస్తారు, సాధన చేస్తారు, కలలు కంటారు… ప్రతి ఆటగాడూ చేసేదీ అదే… తీరా ఓ గెలుపు సాధించాక ఒక్కసారిగా బోరుమంటారు… ఫలించిన కలలు కన్నీళ్లై, కంటిరెప్పల చెలియలికట్టలు దాటేసుకుని, వద్దూవద్దన్నా బయటికి వరదగా వచ్చేస్తయ్… గర్విస్తయ్… అప్పట్లో ఓ సందర్భంలో ఓ పతకం మెడలో వేళ, నేపథ్యంగా భారత జాతీయ గీతం వినిపిస్తుంటే మన పరుగుల తల్లి హిమదాస్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం గుర్తుందా..? మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి ఉద్వేగమే… మనసుల్ని కదిలించే దృశ్యమే కనిపించింది… ఆమె పేరు హిడిలీన్ డియాజ్… టోక్యో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణాన్ని సాధించినప్పుడు ఆమె అక్కడే బోరుమని ఏడ్చేసింది… తమ పతాకానికి సెల్యూట్ చేసింది, తమ జాతీయ గీతం పాడింది… ఈ కన్నీళ్లు ఎంత గొప్పవీ అంటే… ఎంతటి ప్రఖ్యాత రచయిత అయినా సరే, బాష్యం రాయలేనంత…! ఎందుకంటే..? ఆమె మాతృదేశం ఫిలిప్పీన్స్… 97 ఏళ్ల తమ ఒలింపిక్స్ చరిత్రలో ఆ దేశానికి ఇదే తొలి స్వర్ణం… మరి ఆమె కంటి వెంట వచ్చిన ప్రతి నీటిచుక్కకూ ఎంత గర్వం..? సహజమే కదా…
55 ఏళ్ల కేటగిరీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో సోమవారం స్వర్ణాన్ని సాధించింది ఈమె అసలు పేరు హిడిలీన్ ఫ్రాన్సిస్కో డియాజ్… వయస్సు 30 ఏళ్లు… ఆరుగురు సంతానంలో ఈమె నంబర్ అయిదు… తండ్రి ఎడ్వర్డో మొదట మూడు చక్రాల రిక్షా తొక్కేవాడు… తరువాత రైతుగా మారాడు, చేపలు పట్టాడు… అంటే అర్థమైంది కదా ఎంతటి సాధారణ కుటుంబం నుంచి వచ్చిందో… కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కోర్సులో చేరి, ఈ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీసుకూ, ఆ చదువుకూ లంకె కుదరక, సమన్వయం దొరక్క చివరకు కాలేజీయే మానేసింది… తరువాత రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాక మరోచోట చదువు పూర్తిచేసింది… ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్‌లో కొలువు… కానీ ఈ ప్రాక్టీస్ మానలేదు, ఆమె కల ఒలింపిక్స్ స్వర్ణం… అదీ దేశానికి తొలి స్వర్ణం… ఎలాగైతేనేం, కల నెరవేరింది… దేశం తన బిడ్డను చూసుకుని మురిసిపోయింది… ఇదే అన్ని స్వర్ణాలకూ ఈ స్వర్ణానికీ నడుమ తేడా… అదీ చైనాకు చెందిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ లియావో కియూన్ను రెండోస్థానానికి నెట్టేసి మరీ…!!
Ads
ఏడాదిన్నరగా కోవిడ్ ఆంక్షల కారణంగా మలేషియాలో శిక్షణ, ప్రాక్టీసులో ఉందామె… బయట ఎక్కడా కనిపించలేదు… మరిప్పుడు ఏం చేస్తావమ్మా అనడిగితే… ఇక నేను నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను మిగిలిన జీవితాన్ని, చాలా త్యాగాలు చేశాను, చాలా కష్టాలు పడ్డాను అంటోంది… ఆల్ రెడీ ఆమె ఓ మాజీ వెయిట్ లిఫ్టర్, కోచ్‌తో డేటింగులో ఉంది… హైడీగా పిలుస్తారు ఆమెను తోటి దేశవాసులు… సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది… ఇప్పుడు ఆమెకు ప్రెసిడెంటు రోడ్రిగో డ్యుటెర్టోతోపాటు ఎయిర్ చీఫ్ మార్షల్, వైస్ ప్రెసిడెంట్ అందరూ వీరాభిమానులు అయిపోయారు… ట్వీట్ల అభినందనల్లో ఆమె తేలియాడుతోంది… గ్రేట్ స్పిరిట్, అచీవ్మెంట్… కంగ్రాట్స్ హైడీ…!!
Share this Article