యడ్యూరప్పను ఎందుకు బీజేపీ ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసింది..? మీడియాలో బోలెడు విశ్లేషణలు వస్తున్నయ్…! అచ్చం నెహ్రూ కుటుంబంలాగే… సొంత ఇమేజీ ఉన్న నాయకుల్ని మోడీ సహించడం లేదనీ, అందుకే యెడ్డీ, చౌహాన్, వసుంధర, యోగి వంటి నేతలకు కావాలనే చిక్కులు క్రియేట్ చేస్తూ, పార్టీపై తన అధికారాన్ని మరింత కేంద్రీకృతం చేస్తున్నాడనే దాకా ఆ విశ్లేషణలు వెళ్లాయి… సరే, అవి అలా వదిలేద్దాం కాసేపు… యెడ్డీ తలూపక తప్పలేదు, కుర్చీ దిగకతప్పలేదు… మరి తన వారసుడు ఎవరు..? దీని మీద పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చినయ్… చివరకు మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై కొడుకు, యెడ్డీకి నమ్మకస్తుడు, నిన్నటిదాకా హోం మంత్రి బస్వరాజ్ బొమ్మైని కొత్త సీఎంగా ఎంపిక చేశారు… తనే ఎందుకు..? యెడ్డీ దిగిపోయాక కెలుకుడు స్టార్ట్ చేస్తే అదో తలనొప్పి.., కర్నాటక రాజకీయాల్లో – దాదాపు 90, 100 సీట్లలో గెలుపోటముల నిర్ణాయకశక్తిగా ఉన్న లింగాయత్‌లు తమకే సీఎం పోస్టు కావాలంటూ ఒత్తిడి… రిస్క్ తీసుకోదలుచుకోలేదు బీజేపీ… 78 ఏళ్ల యెడ్డీ పొలిటికల్ కెరీర్ ఇక ఖతం అయిపోయినట్టే అనుకోవాలి ఇక… తన ఇద్దరు కొడుకులూ రాజకీయాల్లో ఉన్నారు… ప్రత్యేకించి విజయేంద్ర కొన్నాళ్లుగా ‘యాక్టింగ్ సీఎం’ అయిపోయాడనే విమర్శలూ ఉన్నవే…
ప్రస్తుతం ఎంపిక కాబడిన బస్వరాజ్ బొమ్మై వయస్సు కూడా అరవై దాటింది… విద్యాధికుడు… తెలివైనవాడే… తండ్రి ఒకప్పుడు కర్నాటక ముఖ్యమంత్రిగా చేశాడు… ఆయన పేరు దేశరాజకీయాల్లో అనేకసార్లు ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది… ప్రత్యేకించి హంగ్ అసెంబ్లీలు, గవర్నర్ల నిర్ణయాలు, పోషించాల్సిన పాత్ర, 356 ఆర్టికల్, కేంద్ర అధికారం, రాష్ట్రపతి పరిమితులు అంశాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ బొమ్మై కేసు గుర్తు చేస్తుంటారు అందరూ… నిజానికి ఆయనది చాలా ఇంపార్టెంట్ కేసు… ఓసారి మనమూ గుర్తుచేసుకోవాలి… 1988-89 నడుమ ఈయన సీఎం… జనతాదళ్ పార్టీ… 1989లో బొమ్మై నుంచి కొందరు ఎమ్మెల్యేలు దూరమయ్యారు… ఈయన మైనారిటీలో పడిపోయాడని గవర్నర్ అంటాడు… బలనిరూపణకు చాన్స్ ఇవ్వండి అని బొమ్మె అడిగాడు, కానీ గవర్నర్ ససేమిరా అన్నాడు… అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం బొమ్మై ప్రభుత్వాన్ని ఆర్టికల్ 356 ఉపయోగించి రద్దు చేసింది… రాష్ట్రపతిపాలన పెట్టింది… అప్పట్లో రాష్ట్రాల ప్రభుత్వాల రద్దు తరచూ జరిగేదే…
Ads
బొమ్మై హైకోర్టుకు వెళ్లాడు, న్యాయం దొరకలేదు, సుప్రీం తలుపు తట్టాడు… ఏళ్లు గడిచాయి… చివరకు 1994లో సుప్రీం కోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం ఓ చరిత్రాత్మక తీర్పు చెప్పింది… 1) రాష్ట్రపతి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అదే అల్టిమేట్ డెసిషన్ ఏమీ కాదు… 2) కేంద్ర కేబినెట్ చెబితే సరిపోదు, ఈ రద్దును ఉభయసభలూ అంగీకరించాలి… 3) రాష్ట్రపతి నిర్ణయమైనా సరే, జుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది… 4) ఒకవేళ ఉభయసభలూ రాష్ట్రపతి నిర్ణయాన్ని ఆమోదించకపోతే, రెండు నెలల్లో రద్దు నిర్ణయం రద్దవుతుంది….. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్టికల్ 356 ప్రయోగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన స్థితి క్రియేటైంది… రాష్ట్రపతి చేతులు కట్టేసింది… 1999లో వాజపేయి ప్రభుత్వం రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి, తరువాత నాలుక కర్చుకుని, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది… పర్ సపోజ్, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బెంగాల్లోని మమత ప్రభుత్వాన్నో, మహారాష్ట్రలో ఠాక్రే ప్రభుత్వాన్నో, మరో ప్రభుత్వాన్నో ఆర్టికల్ 356 సాయంతో రద్దు చేసిందీ అనుకుందాం… కానీ మోడీకి రాజ్యసభలో మెజారిటీ లేదు… అందుకని… ఈ రద్దు పద్దుల జోలికి వెళ్లకుండా… పార్టీలు చీల్చడం, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి లాగేయడం వంటి ‘‘ప్యూర్ వ్యాపార ధోరణి’’ని ఆశ్రయించిందన్నమాట…!! అన్నట్టు… బొమ్మైది వారసత్వ ఎంపిక అని గాయిగత్తర చేస్తున్నవాళ్లు ఓ విషయం మరిచిపోయారు… బీజేపీ అదే చేయాలనిపిస్తే, బొమ్మై దేనికి..? ఎంచక్కా యెడ్డీ కొడుకు, యాక్టింగ్ సీఎం విజయేంద్రనే సీఎంను చేసేవాళ్లుగా..!!
Share this Article