అసలు విడుదల అవుతుందో లేదో కూడా తెలియని ఏదైనా చిన్న సినిమా గురించి కూడా ఫుంఖానుపుంఖాలుగా రాస్తుంది మన మెయిన్ స్ట్రీమ్ మీడియా… అంతా ‘కవరేజీ’ మహిమ… ఏ పత్రిక సినిమా పేజీ చూసినా అందుకే మీకు ‘ఎక్స్‌క్లూజివిటీ’ కనిపించదు… ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడు, లేకపోతే విలన్‌తో వరుసగా ఇంటర్వ్యూలు… అన్నింట్లోనూ సేమ్ సేమ్ కంటెంట్… ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఓటీటీలు కనిపిస్తున్నాయి మీడియాకు… అలాగే ప్రస్తుతం బ్రహ్మాండమైన రీచ్, ప్రేక్షకుల సంఖ్య ఉన్న టీవీ ప్రోగ్రాములు కూడా మన మీడియాకు పట్టవు… అంతెందుకు యూట్యూబులో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్నవాళ్లున్నారు… వాళ్లూ పట్టరు… అందుకే సినిమా వార్తలు కావాలంటే పాఠకులు సైట్లు, యూట్యూబ్ చానెళ్లను ఆశ్రయిస్తుంటారు అధికంగా… పెద్ద పత్రికల్లో వచ్చేవి ఇలా చూసి అలా పడేస్తారు… నవ్వుకుంటూ… సేమ్, మన టీవీలు…
ఇండియన్ ఐడల్ షో కొందరిని నచ్చకపోయినా సరే… దేశంలోకెల్లా టాప్ ఫైవ్ టీవీ ప్రోగ్రామ్స్‌లో ఒకటి ఇప్పుడు… ఈసారి ఇద్దరు విశాఖ అమ్మాయిలు చివరి పోటీలో ఉండటంతో సహజంగానే మనవాళ్ల ఆసక్తి పెరిగింది… ఇద్దరూ మంచి పాటగత్తెలు… కాకపోతే శిరీష భాగవతులు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది… షణ్ముఖప్రియ విన్నర్‌గా నిలుస్తుందా లేదా అనేది వేరే సంగతి… ఇప్పటికే ఆమె ఈ పోటీలో తన ప్రతిభ చూపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గెలుచుకుంది… కొందరు ట్రోలర్ల పైత్యం పక్కన పెడదాం కాసేపు… మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ షోను చాలామంది చూస్తున్నారు… ఈ స్థితిలో సాక్షి ఫ్యామిలీ పేజీ ఓ పెద్ద ఆర్టికల్ రాయడం కాస్త ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది కాసేపు… కానీ అది చదువుతుంటే కొన్ని పంటికింద రాళ్లు తగిలి ఆ ఆనందం ఆవిరైపోయింది… ఏదైనా ఇలాంటి ఆర్టికల్ రాస్తుంటే దానికి సంబంధించిన సమాచారం సరిగ్గా తెలుసుకుని రాయాలి… కానీ ఇది అల్లాటప్పాగా… తన భాషలో చెప్పాలంటే ‘సోల్’ లేకుండా రాసిపడేసినట్టు అనిపించింది… మచ్చుకు ఒకటీరెండు చెప్పుకుందాం…
Ads
- అరుణిమ అనే పేరును మూడునాలుగుసార్లు రాశారు… నిజానికి బెంగాల్‌కు చెందిన ఆమె పేరు అరుణిత… ఇప్పుడు దేశం మొత్తమ్మీద హిందీ సినిమా సంగీతాభిమానుల్లో మారుమోగుతున్న పేరు… మొహంలో కాస్త అమాయకత్వం, గొంతులో అంతులేని శ్రావ్యత… పూర్తి పేరు అరుణిత కంజీలాల్… పైగా పబ్లిసిటీ కోసం ఆమెకూ, ఉత్తరాఖండ్‌కు చెందిన మరో కంటెస్టెంటు పవన్ దీప్కూ నడుమ లవ్ అఫయిర్ అని ఆ టీవీవాడే ఏదో స్టార్ట్ చేస్తే, ఇక అదే రాస్తూ రాస్తూ మీడియా మరింతగా ఆమె పేరును జపిస్తోంది… నాలుగు కాలాల ఐటమ్ ఆమె సరైన పేరు తెలియకుండా రాసిపారేసింది సాక్షి..!!
- గతంలో శ్రీరామచంద్ర గెలిచాడు, ఇక తరువాత పేరు మన షణ్ముఖే కావాలని ఆశిద్దామని రాశారు మరోచోట… ఈ షో సీజన్ -5 శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు సర… కానీ సీజన్ -9ను గెలుచుకున్న రేవంత్ మాటేమిటి మరి..? అదే పోటీలో రోహిత్ సెకండ్ రన్నరప్… అంతకుముందు సీజన్-2లో కారుణ్య ఫస్ట్ రన్నరప్… ఈ రన్నర్లు సరే, విన్నర్నూ మరిచిపోతే ఎలా..? వదిలేస్తే ఎలా..?
- గతంలో ముగ్గురు గెలిచారు, ఈసారి నాలుగో మహిళ విన్నర్ ఉంటుందా అనే కోణంలో సాగింది వార్త… స్థూలంగా మ్యూజిక్ అనే కోణంలో చూస్తే తీసుకున్న ఈ లైన్ తప్పు… పైగా గతంలో జూనియర్స్ విభాగాన్ని (అంజనా పద్మనాభన్ జూనియర్స్- 1, అనన్య నంద జూనియర్స్- 2) తీసేస్తే, మెయిన్ సీజన్లలో ఒక్కతే మహిళ గెలిచింది… ఆమె పేరు సరైబీ దెబ్బమ్మ… సీజన్-4 గెలుచుకుంది…) సో, స్టోరీలో సోల్ లేకపోయినా సరే, తప్పుల్లేకుండా చూసుకోవాలి కదా…!!
Share this Article