నిజంగా పవన్ కల్యాణ్ ఉత్థానపతనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది… అప్పుడెప్పుడో ఖుషీ, తరువాత బోలెడన్ని షాకులు… తరువాత పదేళ్లకు గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో మళ్లీ తన ఇమేజీ, పాపులారిటీ, డిమాండ్ రివ్వున ఎగిసింది… తరువాత రాజకీయాలు, గాడితప్పిన సినిమా కెరీర్… నాలుగేళ్లుగా కాటమరాయుడు, అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్‌సింగ్ ఫ్లాపులు… రాజకీయాలతోపాటు ఇక సినిమా కెరీర్ కూడా సంక్షోభంలో పడినట్టేనా అనే సందేహాలు… మొన్నటి ఎన్నికల్లో జనసేన అనూహ్య పరాజయం తరువాత పవన్ మళ్లీ వెండితెరే సేఫ్ అనుకుని ఆ బాటే పట్టాడుగా… ప్రజారాజ్యం వదిలేసుకున్న తన అన్నయ్య చిరంజీవిలాగే… దాంతో మొన్నామధ్య వచ్చిన వకీల్ సాబ్ సినిమా ఫలితం మీద అందరికీ సహజంగానే ఓ ఇంట్రస్టు ఏర్పడింది… పవన్ పాపులారిటీకి వకీల్ సాబ్ సినిమా ఓ పరీక్ష పెట్టింది… కానీ అమితాబ్ నటించిన ఒరిజినల్ సినిమాకు పవన్ ఇమేజీకి తగినట్టుగా పలు మార్పులు చేయడం, చాలామంది అప్పటికే హిందీలో సినిమా చూసేయడంతో… ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది… కొందరికి నచ్చింది, మరికొందరు పెదవి విరిచారు… ఇంకొందరు పర్లేదు అన్నారు… ఇక అందరి దృష్టీ టీవీ రేటింగ్స్ ఎంతవరకూ వస్తాయనే అంశం మీద పడింది… ఎందుకంటే, ఓటీటీలు చూసేవాళ్ల సంఖ్య చాలా స్వల్పం కాబట్టి, కానీ టీవీ అనేది ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటి థియేటర్ కదా…
19.12….. ఇదీ వకీల్ సాబ్ టీవీ రేటింగ్స్… సూపర్… అది లేడీస్ ఓరియెంటెడ్ సబ్జెక్టు కావడం, ఒకరకంగా నేరుగా టీవీల్లోకి రిలీజై వచ్చేయడంతోపాటు సహజంగానే పవన్ కల్యాణ్ మీద ఉండే అభిమానం… అన్నీ కలిసి ఆ రికార్డు రేంజ్ రేటింగ్స్ వచ్చినట్టున్నయ్… అయితే తెలుగు టీవీ ర్యాంకింగుల్లో ఇదే అత్యధికం కాదు, అసలు పవన్ కల్యాణ్ రేంజుకు ఇవి తక్కువ రేటింగ్సే అనే విశ్లేషణలూ ఉన్నయ్… కానీ ఎవరి వాదన ఎలా ఉన్నా… పవన్ కల్యాణ్‌కు ఈ భారీ రేటింగ్స్ ఓ పెద్ద రిలీఫ్… ఒక జనసేన నాయకుడిగా కాదు, ఒక సినిమా హీరోగా పవన్ కల్యాణ్‌ను ఇంకా జనం తిరస్కరించడం లేదనడానికి చిన్న తార్కాణం… ఆ సినిమాలో కాస్త హీరోయిజం ఛాయలు తగ్గించి, అమితాబ్ టైపులో గనుక ఒరిజినాలిటీని అలాగే కంటిన్యూ చేసి ఉంటే, అది పవన్ ఇమేజీకి ఇంకా దోహదపడేది… కానీ మన తెలుగు సినిమా హీరోయిజం దానికి అంగీకరించదు కదా… హీరోయే ముఖ్యం… ఎలాంటి కథనైనా సరే, హీరో చుట్టూ తిప్పీ తిప్పీ, హీరో భజన పడాల్సిందే…
Ads
నిజానికి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ థియేటర్ వినోదం లేదు… కారణాలు ఏమైనా ఇప్పుడప్పుడే థియేటర్లు పూర్తి స్థాయిలో గతంలోలా తెరుచుకునే చాన్స్ లేదు… తెరిచినా సరే, తండోపతండాలుగా వచ్చి చూసే జనమూ లేరు… ఓటీటీ వీక్షకుల సంఖ్య చాలా తక్కువ… ఈ స్థితిలో టీవీల్లో ప్రసారమయ్యే సినిమాలకు మంచి రేటింగ్స్ రావాలి, చాలా వాటికి వస్తున్నాయి కూడా… అదే రేంజులో చానెళ్లు కొత్త సినిమాల్ని కొంటున్నాయి కూడా… ఈ వకీల్ సాబ్‌కు కూడా జీతెలుగు భారీగానే ముట్టజెప్పింది… కానీ స్టార్ మాటీవీ వాడి రీచ్తో పోలిస్తే జీవాడి రీచ్ తక్కువ… ఇదే సినిమా మాటీవీలో రిలీజ్ అయిఉంటే రేటింగ్స్ ఇంకాస్త ఎక్కువగా ఉండేవి… సో, జనసేన, ఓటములు గట్రా రాజకీయాల్ని పక్కన పెడితే… ఒక సినిమా హీరోగా పవన్ కల్యాణ్ పట్ల జనం ఆదరణ ఏమీ పడిపోలేదు, మూసను వదిలేసి, ఉదాత్తమైన పాత్రల్ని చేస్తే పవన్‌కు ఇప్పట్లో ఢోకా ఏమీ లేదు… మరీ జనసేన పార్టీ తరహాలో గాకుండా… జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే హీరో కెరీర్‌ను పదిలంగా కాపాడుకోవచ్చునన్నమాట…!!
Share this Article