సినిమా వార్తల దరిద్రం అందరికీ తెలిసిందే… సోషల్ మీడియా పైత్యం పెరిగాక పరిస్థితి మరింత దిగజారిందనేదీ నిజమే… కానీ చివరకు ఇంత భ్రష్టుపట్టిపోవాలా అనిపించింది ఒక వార్త చూస్తే…! అదీ సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ పత్రికకు సంబంధించిన వెబ్సైట్…!! ఎవరో జర్నలిజం బేసిక్స్, స్పిరిట్ తెలియకుండా, ఏ యూట్యూబ్ చానెలో, ఏ వెబ్సైటో పెట్టుకుని, ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు… కానీ చివరకు సాక్షి సైతం..! ఎహె, ఊరుకొండి సార్, పత్రికలు, టీవీల్లోనే బోలెడన్ని భజనలు, భక్తి పాటలు రాస్తుంటే, వినిపిస్తుంటే ఈ వార్తకు ఏమొచ్చింది అంటారా..? ఆలోచించాల్సిందే…!! అసలు వార్త ఏమిటీ అంటారా..? ఇదుగో ఇక్కడ చూడండి…
జగ్గూభాయ్ అనబడే ఓ సినిమా కేరక్టర్ ఆర్టిస్టు తన అసిస్టెంట్, తన డ్రైవర్‌తో కలిసి రోడ్ సైడ్ ఫుడ్ తిన్నాడట… ఆ ఫోటోను ఆయన షేర్ చేసుకున్నాడట… ఆయన సింప్లిసిటీ సూపర్ అంటూ జనం దాన్ని వైరల్ చేశారట… ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ జగ్గూభాయ్ అంటే ఎవరబ్బా అని కాసేపు అర్థం కాలేదు, ఓహో, జగపతిబాబును ఇప్పుడు జగ్గూభాయ్ అంటున్నారా అనుకుని సమాధానపడతాం మనమే… జగ్గూదాదా, జగ్గూచీచా, జగ్గూమగ్గూ… మన ఇష్టమే కదా పేర్లు పెట్టేసుకోవడం అనకండి… సదరు జగపతి ‘బాబు గారి’ ట్విట్టర్ అకవుంటే ఆ పేరుతో ఉంటుంది, ఐయామ్ జగ్గూభాయ్ అని…!! సర్లె, సినిమా నటులంటేనే డిఫరెంట్ కేరక్టర్లు కదా అనుకుంటే… ఇక్కడ అర్థం కానిది… అది రోడ్ సైడ్ ఫుడ్ ఎలా అయ్యింది..? అంటే, రోడ్డు పక్కన హోటల్ ఉంటే చాలు, అది రోడ్ సైడ్ ఫుడ్… అదేమైనా రోడ్ పక్కన ఇడ్లీ బండీయా..? రోడ్ పక్కన టిఫిన్ బడ్డీయా..? అఫ్కోర్స్, పెద్ద పెద్ద హోటళ్లకన్నా టేస్టులో, రేటులో అవే చాలా చాలా బెటర్, అది వేరే సంగతి…
Ads
ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతోంది… అది రోడ్డు పక్కన ఓ హోటల్ అని… మరి విశేషం ఏమిటి..? అసిస్టెంట్, డ్రైవర్‌తో కలిసి భోంచేయడమా..? అదేమైనా విశేషమా..? మనకు తెలియని రాష్ట్రానికో, ప్రాంతానికో వెళ్తాం… ఆకలవుతూ ఉంటుంది… ఆ హోటల్ కనిపించింది… శుభ్రంగానే కనిపిస్తోంది… ఫర్నీచర్ గట్రా పద్ధతిగానే ఉంది… సిటీల్లోని ఓ మోస్తరు భోజనశాలగానే కనిపిస్తోంది… ఓ ఫుల్ మీల్స్ అని ఆర్డరిస్తాం, తినేస్తాం… ఇది గొప్పా..? అంటే అక్కడ రోజూ తినేవాళ్లు అన్నాడీగాళ్లు… వీళ్లు అక్కడ తినడం పెద్ద గొప్పతనమా..? సోనూసూద్ స్థాయిలో ఓ ట్వీట్, అబ్బో, మా జగ్గూభాయ్ సింప్లిసిటీ అంటూ ఫ్యాన్ల కేకలు… (నిజంగానే జనానికి ఉపయోగపడే చిన్న పని చేస్తే, ఇంకెంత హడావుడి, హంగామా ఉండేదో… పర్లేదు, మన తెలుగు సినిమా ముఖ్యులకు అంత సద్బుద్ధి లేదు కాబట్టి పర్లేదు… ఆ వార్తల ప్రభంజనం నుంచి తప్పించుకున్నట్టే మనం…) ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్లలో ఇలాంటి బోలెడు పోస్టులు కనిపిస్తుంటాయి… నేనిప్పుడే నాలుగు ఇడ్లీలు లాగించాను, ఈరోజు చట్నీ మస్తుంది… వావ్, దోశెలు వేయడం నేర్చేసుకున్నాను… ఓహ్, బిర్యానీ కుమ్మేశా, కర్డ్ రైతా భలే కుదిరింది…. జగ్గూభాయ్ పోస్టుకు అంతకుమించిన వాల్యూ లేదు… సాక్షి రాసిన ఈ వార్తకు అంతకన్నా లేదు…!! సర్లెండి సార్, ప్రపంచంలోని టాప్ టెన్ ధనికుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ నడిపించే తెలుగు వెబ్సైట్ చూడండి, శిల్పాశెట్టి భర్త తీసే బూతు సినిమాలతో పోటీపడుతూ ఉంటుంది అంటారా..? అదీ నిజమే… అది మళ్లెప్పుడైనా చెప్పుకుందాం….
Share this Article