సత్యదేవ్..! అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం షార్ట్ ఫిలిమ్ మేకర్‌గా ప్లస్ చిన్నాచితకా వేషాలతో మొదలైంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రయాణం… ఇప్పుడు తనే హీరో… తనొక్కడే ఒక సినిమాను పూర్తిగా మోయగలడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ… ఎదుగుతూనే ఉన్నాడు… కరోనా రానీ, దాని తాత రానీ… వీలైతే థియేటర్, లేదంటే ఓటీటీ… మొత్తానికి రెండేళ్లుగా సత్యదేవ్ పరుగుకు మాత్రం తిరుగు లేదు…! చేతలు దక్కిన పెద్ద పెద్ద హీరోలతో పోలిస్తే నయమే కదా… తిమ్మరుసు సినిమాను చూస్తుంటే అనిపించేది ఇదే… కరోనా సీజన్ మొదలయ్యాక ఎక్కువగా ప్రేక్షకుల్ని పలకరించిన హీరో తనే… చివరకు నెట్‌ఫ్లిక్స్‌లో ఓ అంథాలజీ సీరీస్‌లో కూడా ఉన్నాడు… మరో రెండుమూడు సినిమాలు కూడా చేతిలో ఉన్నట్టున్నయ్…
నిజానికి తెలుగు హీరో అనగానే అర్హతలేమిటి అని ఆలోచిస్తే… డాన్సుల పేరిట పిచ్చి గెంతులు వేయగలగాలి… మొహంలో భావాలు పలకొద్దు… నటనకు కాస్త దూరదూరంగానే మెదలాలి… పిచ్చి పిచ్చిగా ఫైట్ సీన్లలో డిష్యూం డిష్యూం అనేయాలి… తెలుగు సినిమా హీరోయిన్ అనబడే ‘జడపదార్థంతో కలిసి రొమాన్స్ సీన్లు చేయాలి… ఫాఫం… సత్యదేవ్ తిమ్మరుసు సినిమాలో అవేవీ కనిపించవు… కంట్రాస్ట్… తనేమో నటించగలడు కానీ ఈ స్టెప్పులు, ఫైట్లు, రొమాన్సుల్లో బిగదీసుకుపోతాడు… తెలుగు సినిమా అంటే మర్యాద కోసం ఓ హీరోయిన్ కేరక్టర్ ఉండాలి కాబట్టి ప్రియాంక జువాల్కర్ను పెట్టారు… హీరోకు ప్రియురాల్ని చేశారు… మరీ క్రైం థ్రిల్లర్‌లో హీరోకు ఒక ఫైటయినా లేకపోదే బాగోదు అని మొహమాటంతో ఓ చిన్న ఫైట్ పెట్టారు… అంతే… పాటల్లేవ్, పిచ్చి పిచ్చి గెంతుల్లేవ్, కావాలని ఇరికించిన దిక్కుమాలిన రొమాన్స్ సీన్స్ లేవ్… (ఐనా శ్రీకృష్ణదేవరాయలు అయితే యుద్దాలు, ప్రణయాలు, తిమ్మరుసుకు దేనికి..?)
Ads
స్ట్రెయిట్ స్టోరీ నెరేషన్… దానికి తగిన సత్యదేవ్ యాక్టింగ్… అదీ నచ్చేది మనకు… ఇది ఏ సినిమాకు రీమేక్, ఏ సినిమాకు ఫ్రీమేక్ అనేది కాసేపు వదిలేస్తే… రివ్యూయర్లు పదే పదే వాడే పడికట్టు పదం, సోకాల్డ్ కమర్షియల్ వాల్యూస్ లేకపోయినా సరే… కథ, కథనం, సత్యదేవ్ నటన కలిసి సినిమాను గట్టెక్కించినట్టే…! అక్కడక్కడా పంటికింద రాళ్లలా తగిలే లాజిక్ రహత ట్విస్టులు, కథనంలో ల్యాగ్, ఫైనల్ ట్విస్టులో మనకు కలిగే ఒకింత నిరాశ కొంత సినిమాను దెబ్బతీసినా… ఇంకా కరోనా భయంతో జనం థియేటర్ల వైపు రావడం లేదు కాబట్టి వసూళ్లు దడదడలాడించకపోయినా… ఓవరాల్‌గా ఈ సినిమా సత్యదేవ్‌ను మరో మెట్టు ఎక్కించేదే… ఓటీటీ, టీవీ రైట్స్ మంచి ధర పలికితే గనుక సినిమా ఆర్థికంగా ఒడ్డున పడినట్టే..!
నిజానికి కథ మరీ కొత్తదేమీ కాదు… అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కుని జైలుపాలైన ఓ అమాయకుడు, తనను నిర్దోషిగా నిరూపించాలని తపన పడే ఓ లాయర్, సొంత దర్యాప్తు, తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటపడుతూ, చివరకు ఊహించని ఓ విలన్‌ను రివీల్ చేయడం… అక్కడక్కడా కాస్త కామెడీ… అయితే సినిమాలో నచ్చేది ఏమిటంటే… కథను స్ట్రెయిటుగా నడిపించడం… పనికిమాలిన ఉపకథలతో సబ్జెక్టు ఎక్కడా డీవియేట్ కాదు… దాంతో ప్రేక్షకుడికి పెద్ద రిలీఫ్… ఒకేరోజు నాలుగైదు సినిమాలు విడుదల అయ్యాయి కదా… ఈ సినిమా ఒక్కటే వాటిల్లో కాస్త చూడబుల్… కాబట్టి డబుల్ మాస్క్‌తో థియేటర్‌కు ధైర్యంగా వెళ్లగలిగితే వోకే… మరీ ఉర్రూతలూగించకపోవచ్చు, కానీ సబ్ స్టాండర్డ్ అయితే కాదు…!!
Share this Article