ఓ సినిమా కథలాంటి కథే… స్ట్రెయిట్‌గా కథలోకి వెళ్లిపోదాం… ఆమె… పేరు దీపిక కుమారి… జార్ఖండ్, రాంచీలో పుట్టింది… తండ్రి ఆటోరిక్షా నడుపుకుంటాడు… తల్లి ఓ నర్స్… బొటాబొటీ సంసారం… అప్పుడప్పుడూ పస్తులు… చిన్న ఇల్లు… సినిమాలు, టీవీ మహాభారత్‌లో చూసి, తోటి పిల్లలతో కలిసి వెదురుతో బాణాలు తయారు చేసుకుని ఆడుకునేవాళ్లు… తన కజిన్ విద్యాకుమారి అప్పటికే ఆర్చర్… పలు పోటీల్లో పతకాలు సాధించేది… జార్ఖండ్ సీఎం అర్జున్ ముండా భార్య మీరా ముండా తన అర్జున్ అకాడమీలో ఆర్చర్లకు ట్రెయినింగ్ ఇప్పించేది… అందులో దీపిక కూడా చేరింది… తరువాత జంషెడ్‌పూర్‌లో టాటా వాళ్లు నడిపే అకాడమీలో చేరింది… నిజం చెప్పాలంటే, ఎంచక్కా మూడుపూటలా తిండి దొరుకుతుందనే ఆలోచనే ఆమె అక్కడ చేరడానికి ప్రధాన కారణం… క్రమేపీ ఆర్చరీ మీద ఆసక్తి పెరిగింది… సాధన పెరిగింది… రాను రాను ఇక అదే లోకమైపోయింది ఆమెకు… 12, 13 ఏళ్ల వయస్సు నుంచే పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనసాగింది… పతకాలు వస్తున్నయ్, ప్రతిభ మరింత పదును తేలుతోంది… సీన్ కట్ చేస్తే ఆమె ఇప్పుడు ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ మహిళా ఆర్చర్… ఇప్పుడు మరో వ్యక్తి దగ్గరకు వెళ్దాం ఓసారి…
పేరు అతను దాస్… పుట్టింది బెంగాల్, బారానగర్… తల్లిదండ్రులకు తనను ఏదైనా క్రీడాంశంలో తీర్చిదిద్దాలని కోరిక… 14 ఏళ్ల వయస్సులో… అంటే 2007-08 ప్రాంతంలో జంషెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో చేర్చారు… తనలోనూ మెరిట్ ఉంది… తోటి ఆర్చర్లకన్నా ప్రతిభ చూపిస్తున్నాడు… అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తీసుకొస్తున్నాడు… కథ సజావుగా సాగుతోంది… అక్కడే… 13, 14 ఏళ్ల క్రితం దీపికను తొలిసారిగా చూశాడు… సేమ్ అకాడమీ… సేమ్ ఆర్చరీ… పలుచోట్లకు వెళ్లే ఆర్చరీ టీమ్స్‌లో మెంబర్లు… ట్రెయినింగ్ దగ్గర, తినే దగ్గర, జాగింగ్ దగ్గర… వాట్ నాట్… ప్రతిచోటా కలిసి జర్నీ… కానీ ఒకరిని చూస్తే మరొకరికి చిరాకు… అతను దాస్‌కు హిందీ రాదు… దీపికకూ తనకూ నడుమ అది ఓ పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్… వచ్చీ రాని ఇంగ్లిషులోనే తెల్లారిలేస్తే గిల్లి కజ్జాలు… ప్రతి చిన్న విషయానికీ చిన్న పిల్లల్లా పంచాయితీలు… చివరకు ‘‘నా నీళ్ల సీసా నువ్వెందుకు తీసుకున్నవ్..?’’ అని కూడా తగాదా స్టార్టయ్యేది… పదేళ్లు… అలాగే కొట్టుకునేవాళ్లు…
Ads
వయస్సు పెరుగుతోంది… కాస్తోకూస్తో మెచ్యూరిటీ లెవల్స్ పెరుగుతున్నయ్… ప్రపంచమంతా ఆర్చరీల పోటీలకు వెళ్తున్నారు… వ్యక్తిగతంగా రాణిస్తున్నారు… ఇండియా గర్వించేలా పదును పెంచుకుంటున్నారు… కానీ పదేళ్లూ వాళ్ల మధ్య అదే గ్యాప్… 2016 ఒలింపిక్స్ టీంలోనూ ఉన్నారు… ఇద్దరూ అక్కడ ఫ్లాప్… తరువాత 2017లో మెక్సికోలో జరిగిన ఏదో పోటీలో కూడా అనుకోని ఫెయిల్యూర్… ఆ ఓటమి తరువాత, కొంచెం వాళ్ల నడుమ మాటలు పెరిగాయి… క్రమేపీ గ్యాప్ కాస్త తగ్గింది… కలిసి అక్కడే షాపింగ్‌కు వెళ్లేవాళ్లు.. అటూ ఇటూ తిరిగేవాళ్లు… తమ ఓటమి కారణాలతోపాటు, తమ నడుమ గిల్లికజ్జాలకు కారణాల్ని కూడా విశ్లేషించుకున్నారు… క్రమేపీ ఇద్దరి నడుమ లవ్ పెరిగింది… మన్మథబాణాలు పడ్డయ్… డేటింగ్ స్టార్ట్ చేశారు… కానీ తోటి ఆర్చర్లకు కూడా తెలియనిచ్చేవాళ్లు కాదు… 2018లో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది… ఇద్దరి టార్గెట్ టోక్యో ఒలింపిక్స్, అవి అయిపోయాక పెళ్లి చేసుకుందామని ఫిక్సయ్యారు… కానీ…
కరోనా కారణంగా ఒలింపిక్స్ లేటవుతున్నయ్… ఈ ఇద్దరి సాధన మందగించింది.,. ఎటుచూసినా కరోనా వాతావరణమే… ఇక వేచిచూడటం దేనికనే భావనతో గత ఏడాది జూన్‌లో పెళ్లిచేసుకున్నారు… లవ్ స్టోరీ సుఖాంతమే… కానీ వాళ్ల ప్రొఫెషనల్ గ్రోత్..? ఆమె నంబర్ వన్ ర్యాంకు ఎంజాయ్ చేస్తోంది… అతను తొమ్మిదో ర్యాంకు… ఇద్దరూ టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు… అప్పుడెప్పుడో 1972లో లియాండర్ పేస్ తండ్రి వీస్ పేస్ హాకీ టీం సభ్యుడిగా… తల్లి జెన్నిఫర్ బాస్కెట్ బాల్ పోటీదారుగా కలిసి ఒలింపిక్స్‌కు వెళ్లిన జంట… మళ్లీ ఇప్పుడు అతను దాస్, దీపిక… కానీ ఏమైంది..? ప్రపంచంలో ఎన్ని పోటీలు జరిగినా మెరుస్తున్న ఈ బాణాలు ఒలింపిక్స్ అనేసరికి డీలాపడుతున్నయ్… గురితప్పిపోతున్నయ్… ఇప్పుడూ అంతే…
ఈసారి ఒలింపిక్స్‌లో ఇద్దరూ దారుణంగా నిరాశపరిచారు… దీపిక అయితే గత మూడు ఒలింపిక్స్‌లో పోటీపడింది… ప్రతిసారీ ఓడిపోయింది… పదమూడేళ్ల సాధన, కెరీర్ ఆమెకు ఒలింపిక్స్‌లో మాత్రం సాయపడటం లేదు… కనీసం తన స్థాయికి తగిన ప్రదర్శన కూడా చేయలేకపోయింది..! అతను దాస్ కూడా అంతే కదా… రెండు ఒలింపిక్స్ల్లో పాల్గొంటే రెండుచోట్లా, రెండుసార్లూ ఫ్లాప్… ఎందుకలా..? అతను దాస్ ఓటమి తరువాత ఏవేవో సాకులు చెబుతున్నాడు కానీ… ప్రపంచానికి అవేమీ అక్కర్లేదు… చూడదు… రెగ్యులర్ కోచ్ లేడు, కౌన్సిలర్ లేడు అని ఏవో చెబుతున్నాడు… కానీ పదమూడేళ్ల కెరీర్ ఆ జంటది… వాళ్లే ఇతరులకు శిక్షణ ఇచ్చే రేంజ్… సరే, ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఏదో చెప్పి ఉంటాడు… ఇప్పుడు ఆమెకు 27, అతనికి 29… ఇంకా బోలెడు వయస్సుంది… కానీ సాకులు వెతక్కుండా… ఒలింపిక్స్ ఒత్తిడి నుంచి బయటపడి, వచ్చే ఒలింపిక్స్ కోసం సాధన చేయగలదా ఈ జంట… చూడాలి, ఆశించాలి… సరిగ్గా గురిచూస్తే ఇద్దరూ రెండు స్వర్ణాలు తీసుకురాగల సమర్థులు… కమాన్, పాత ఓటములు జానేదేవ్… కొత్త విజయం వైపు గురిచూడు దీపికాదాస్… టార్గెట్ బోర్డు మీద ఓ చిన్న యెల్లో సర్కిల్ కనిపిస్తోంది కదా, అదే చెట్టు మీద పిట్ట, పిట్ట కన్ను… షూట్…!!
Share this Article