ఈసారి బిగ్‌బాస్ సీజన్ అంతా అభిజిత్ వర్సెస్ బిగ్‌బాస్ అన్నట్టుగానే సాగుతోంది… హౌస్ లోపల అఖిల్‌తో ఎప్పుడూ ఏదో కాన్ఫ్రంటేషన్… ఇక లోలోపల బిగ్‌బాస్‌తోనే ఘర్షణ… కానీ ఎప్పుడూ తను రాజీపడలేదు… తన ఆలోచనల మేరకు తను అడుగులు వేస్తున్నాడు… ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లిపోవడానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాడు ఎప్పుడూ… దాదాపు 12 సార్లు నామినేషన్లలో ఉన్నాడు… ప్రతిసారీ భారీగా ప్రేక్షకుల మద్దతు లభిస్తూనే ఉంది… ఇప్పుడు మళ్లీ మరోకోణంలో బిగ్‌బాస్ చెప్పిన టాస్కును తనంతట తనే ఓరకమైన వైరాగ్యంతో వదిలేశాడు… పాల్గొనకపోతే మళ్లీ నాగార్జున వచ్చి ఏదో తిడతాడు… అందుకని ఇటు పార్టిసిపేట్ చేసినట్టు కాదు, అటు వదిలేసినట్టూ కాదు… ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా బిగ్‌బాస్‌కు మళ్లీ సవాల్ విసిరాడు… కాకపోతే ఈసారి చిరాకుతో…
కంటెస్టెంట్లు అందరూ తమ ఆటతీరును తామే అంచనా వేసుకుని, ఆయా ర్యాంకులు తామే ఇచ్చేసుకుని, ఆ ర్యాంకులపై నిలబడాలట… ఎక్కువ ర్యాంకు కావాలనుకుంటే వేరే కంటెస్టెంట్లను బతిమిలాడి, బామాలి, ఆ ర్యాంకును పొందాలన్నమాట… ఫస్ట్ ర్యాంకుపై నిలబడితే సీజన్ మొత్తానికి బెస్ట్ పర్ఫార్మర్ అట… ఆరో స్థానంలో నిలబడినవాడు వరస్ట్ పర్ఫార్మర్ అట… మరిక ప్రేక్షకుల వోట్లు దేనికి..? వాళ్లలో వాళ్లే తేల్చేసుకుంటే, ఈ వోటింగు పద్దతి దేనికి..?
Ads
పోనీ, ఇదేమైనా తేలేదా..? ఎవరికివారు తామే బెస్ట్ పర్ఫార్మర్ అనుకుంటారు… మంచి ర్యాంకు కావాలనే కోరుకుంటారు… ఒకరకంగా మానసికంగా అలిసిపోయిన కంటెస్టెంట్లు ఇక పోటీలు పడి, వాదనలు పెట్టుకుని, గొడవలకు దిగే ఓపిక కూడా లేదు… అరియానా, హారిక మాటల్లోనూ అదే వ్యక్తమైంది… సొహెయిల్ కూడా… అభిజిత్ ఇవన్నీ వాదించలేక… ఛల్, పోతేపోనీ అనుకుని, తను అక్కడికి వచ్చేలోపు ఆరో ర్యాంకు మాత్రమే ఖాళీగా ఉండటంతో దానిపైనే నిలబడ్డాడు…
దాన్ని సమర్థించుకోవడానికో, వేరేవాళ్లను అడిగి బెటర్ ర్యాంకు తీసుకోవడానికో కూడా ప్రయత్నించలేదు… అంటే టాస్కులో గెలుపు కోసం ప్రయత్నించకపోవడం… అంటే బిగ్‌బాస్ ఉద్దేశాన్ని తేలికగా తీసిపారేయడం… మళ్లీ నాగార్జునతో బిగ్‌బాస్ టీం ఏం తిట్టిస్తుందో చూడాలి… మళ్లీ నాగార్జునను అభిజిత్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారో చూడాలి… కానీ తక్షణం మాత్రం బిగ్‌బాస్ వరస్ట్ పర్ఫార్మర్ కాబట్టి జైలులో ఉండు అంటూ పంపించారు… అభిజిత్ జైలుపాలయ్యాడు… ఇక్కడా మైండ్ లెస్ ధోరణే బిగ్‌బాస్‌ది… ఎందుకంటే..?
అసలు వరస్ట్ పర్ఫార్మర్ అని నిర్ణయించాల్సింది ప్రేక్షకులు… సరే, తనంతట తనే చెప్పుకున్నాడు అభిజిత్… ఇక శిక్ష దేనికి..? అది తప్పు ఎలా అవుతుంది..? వరస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అసమర్థత అవుతుంది తప్ప నేరం కాదు కదా… ఏమిటో తలతిక్క బిగ్‌బాస్… పైగా రేపు ఎలాగూ నాగార్జున వీకెండ్ షో కోసం బయటికి రావల్సిందేగా… అంటే ఒకరోజు జైలుశిక్షా..? రోజురోజుకూ చీప్ చేసేస్తున్నారు గేమ్‌ను… వెరసి అభిజిత్‌కు ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి పాపులారిటీ రాగా, ఇప్పుడు మరింత సింపతీ సంపాదించి పెడుతున్నాడు బిగ్‌బాస్ తనంతటతానే… కొంపదీసి పరోక్షంగా అభిజిత్‌కు సాయం చేయడం లేదు కదా… ఇలా…!!
ఇక ఫినాలే మెడల్ పోటీ గురించి కూడా ఓసారి చెప్పుకోవాలి… అఖిల్, సొహెయిల్ ఓ ఉయ్యాల మీద కూర్చుని, ఊగాలి… ఎవరు ముందుగా దిగిపోతే వాళ్లు ఓడిపోయినట్టు… వాళ్లు పోటీపడి, ఎదుటివాడు దిగిపోయేలా చేయాలి లేదా కన్విన్స్ చేయాలి… తొండి ఆటతో ఎదుటోడిని కిందకు నూకేసినా సరే, బిగ్‌బాస్ ఆబ్జెక్ట్ చేయడు… కానీ వాళ్లిద్దరూ మంచి జాన్ జిగ్రీ దోస్తులు, ఆ క్షణం వరకూ ఒకరికొకరు సాయం చేసుకున్నారు… అందుకని ఒక రోజు గడిచాక, ఇక ఓపిక చచ్చిపోయి, త్యాగాలకు సిద్ధపడ్డారు…
అరేయ్, నన్ను కిందకు నెట్టెయ్, నువ్వు ఫినాలేకు వెళ్లిపోరా అన్నాడు అఖిల్… దాంతో కదిలిపోయిన సొహెయిల్ తనే ఊయల దిగిపోయి… అఖిల్‌ను ఫినాలేకి పంపించేశాడు… మంచి స్నేహస్ఫూర్తి… బాగుంది… కానీ అప్పుడే నేరుగా అఖిల్ ఫస్ట్ ఫైనలిస్టు అయిపోడు… ప్రేక్షకులు గనుక తనను రిజెక్ట్ చేస్తే, ఎలిమినేట్ చేస్తే ఆ ఫినాలే మెడల్ ఎందుకూ పనికిరాదు… బిగ్‌బాస్ ఆ క్లారిటీ కూడా ఇచ్చాడు… సో, ప్రేక్షకుల దయ, అఖిల్ ప్రాప్తం… సరే, ఇన్నాళ్లూ బాగానే ఆడుతూ వస్తున్నాడు కాబట్టి ప్రేక్షకులు సేవ్ చేస్తారేమో… అవినాష్, మోనాల్, హారిక, అరియానాల్లో ఎవరో ఒకరు ఈసారి బలి కాకతప్పదేమో…!!
Share this Article