…………….. By….. మిమిక్రీ శ్రీనివాస్….. భాష వేరు.., అధికార భాష వేరు.., అధికారుల భాష వేరు… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హిందీ అధికార భాష… కొన్ని పదాలు విచిత్రంగా అనిపిస్తాయి తెలుగు వాడికి… నా మట్టుకు నాకు తెలుగు వాళ్ళు రూపొందించుకున్న పదాలే ఆంగ్ల భాషకు సరైన అర్థాన్నిచ్చేవిగా తోస్తాయి… ఉదాహరణకు ఆంగ్ల భాషలోని “జనరల్” అన్న శబ్దానికి హిందీ వాళ్ళు ” सामान्य” (సామాన్య్) అని పదాన్ని వాడుతున్నారు… తెలుగు వాడికి – మాన్య- సామాన్య- అసామాన్య పదాలతో పరిచయం వుండడం వల్ల జనరల్ అన్న పదం సామాన్యంగా తోచదు. అందుకే “సాధారణ” అంటాడు… కన్సల్టేషన్ ని హిందీ వాడు ” परामर्श ” (పరామర్శ్) అంటాడు… తెలుగు వాడు ఎప్పుడు ఎవరిని ఎందుకు పరామర్శిస్తాడో మనందరికీ తెలుసు కదా… తెలుగు వాడు సంప్రదించు అంటాడు… ఇక టెంపరరీ పదాన్ని ” अस्थायी” (అస్ఠాయీ) గా హిందీ వాడు మార్చుకున్నాడు… తెలుగు వాడు పెట్టుకున్న సమాన పదం “తాత్కాలిక”…. నిజానికి ఇదే అసలు అర్థానికి దగ్గరగా వుంటుంది…
ఇక కమ్యూనికేషన్ ని హిందీ వాళ్ళు “संचार ” (సంచార్) అంటారు… అది వింటే మనకు అర్థమయ్యేది అటో ఇటో ఎటో తిరగడం… దేశ సంచారం చేయడం అనే పదం మనకు వాడుకలో వుంది కదా… సమాచారం కాస్తా సంచార్ అయి పోయినట్టుంది… ఇక క్రైమ్ ని హిందీ వాడు “अपराध” (అపరాధ్) అంటాడు… తెలుగువాళ్ళకు అపరాధ శబ్దం వున్నా, నేరం అనే మాట బాగా పరిచయం అయ్యింది… అదే తెలుగు “నేరం” తమిళ తంబికి “நேரம் ” సమయం అని అర్థమౌతుంది… ఇలా ఎన్నో విషయాలు అధికార భాష గురించి చెప్పుకోవాల్సినవి వున్నాయి.
Ads
మన తెలుగు గొప్పదే, కానీ పరిస్థితులకు అనుగుణంగా, పద సంపద విస్తరించుకోలేకపోతున్నాం, సాధారణంగా వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం, ‘ముగ్గురు ఖైదీలు జైలు నుంచి పరారీ… ఇది తెలుగేనా..? అలాగే చాలా పదాలు తప్పు అర్థంలో వాడుకలో స్థిరపడ్డాయి… ఉదాహరణకు రాజీనామా… నిజానికి రాజీనామా అంటే ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థలు రాజీ కుదుర్చుకుని రాసుకునే ఒప్పందపత్రం… కానీ మనం ఉద్యోగాన్నో పదవినో వదులుకోవడం అనే అర్థంలో వాడుతున్నాం.., ఇక ముద్దాయి… ఈ పదం నిందితుడు అనే అర్థంలో మనం వాడుతున్నాం, నిజానికి ఎవరైతే ఆరోపణ లేవనెత్తుతారో వారు ముద్దాయిలు, ముద్దా అంటే ఆంగ్ల భాషలోని ఇష్యూ అని అర్థం…
ఏక్ భాషా కీ బోలీ దూస్రీ భాషాకీ గాలీ అంటుంటారు… అంటే ఒక భాషలో ఒక మాట మరొక భాషలో తిట్టు కావచ్చును అని అర్థం… సాధారణంగా రైల్వే స్టేషన్లలో చూస్తుంటాం. ఇంగ్లిష్ టాయిలెట్ ని హిందీ లో ప్రసాధన్ అని రాస్తారు. నిజానికి ప్రసాధనీ అనే పదం సంస్కృత భాషకు చెందినది.
ప్రసాధ్యంతే కేశాః అనయేతి ప్రసాధనీ అని అమరకోశం చెబుతుంది. ప్రసాధని అంటే మనం తల దువ్వుకునే దువ్వెన అని అర్థం. ఉర్దూలో ఎవరినైనా ఇంట్లోకి ఆహ్వానించడానికి “తష్రీఫ్ లాయియే” అనే వాక్యముంది. అలాగే ఆసీనులు కండి అనే మాటకు “తష్రీఫ్ రఖియే” అనే పదాలు వాడుతారు… నిజానికి తష్రీఫ్ అంటే ఆంగ్లభాషలోని “సీట్”… తెలుగులో చెబితే అసహ్యంగా వుంటుంది… అనేకసార్లు మనం హిందీ నాయకుల ప్రసంగాల్లో ఆగ్రహ్ అనే పదాన్ని వింటుంటాం… మనకేమో అది ఆగ్రహం… కానీ హిందీలో దాన్ని విజ్ఞప్తి అనే అర్థంలో వాడుతుంటారు… వేర్వేరు భాషల దాకా ఎందుకు..? మన తెలుగులోనే ఆంధ్రాలో, తెలంగాణలో వేర్వేరు అర్థాలు వచ్చే పదాలు బోలెడు… ఉదాహరణకు… రంది… ఆంధ్రాలో దీన్ని యావ అనే అర్థంలో వాడితే, తెలంగాణలో చింత అనే అర్థంలో వాడతారు… భాషల వారీగా పదాల అర్థాల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉండాలి… అప్పుడే తరువాత తరాలకు ఏ పదాల్ని ఎక్కడ ఎలా పలకాలో తెలుస్తుంది… కానీ అది జరుగుతోందా..?!
Share this Article