మొన్నటి సీజన్లో ముక్కు అవినాష్, ఇప్పుడు ముక్కు విష్ణుప్రియ… బిగ్‌బాస్ రాబోయే సీజన్ గురించి ఒకాయన సరదాగా చేసిన కామెంట్ ఇది… బిగ్‌బాస్ మీద టీవీక్షకుల్లో ఆసక్తి పెరుగుతున్నది… సెప్టెంబరులో స్టార్ట్ చేస్తున్నట్టుగా మాటీవీ ప్రకటించడంతో ఇక కంటెస్టెంట్లు ఎవరనే ఇంట్రస్టు, ఆ వార్తలు, ఊహాగానాల హైప్ పెరుగుతున్నది… తదుపరి హోస్ట్ ఎవరు, ఎవరు అని బోలెడు వార్తలు రాసుకున్నాయి కదా సైట్లు, యూట్యూబ్ గొట్టాలు… వాటికీ తెరపడింది… ఏ అన్నపూర్ణ స్టూడియోలో ఈ బిగ్‌బాస్ సెట్లు వేస్తారో.., ఆ అన్నపూర్ణ ఓనర్, ఆ నాగార్జునే మళ్లీ హోస్ట్… తనకూ పెద్ద పనేమీ లేదు… తన సినిమాలకూ ప్రేక్షకుల్లేరు… కాబట్టి ఎంచక్కా సొంత స్టూడియోలోనే ఈ బిగ్‌బాస్ కథ నడిపించవచ్చు… మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకునే పరిస్థితి వస్తే, వెంటనే వచ్చి ఆదుకోవడానికి సమంత, మరీ అవసరమైతే చైతూ ఉండనే ఉన్నారు… వాస్తవంగా బిగ్‌బాస్ అవసరం ఇప్పుడు మాటీవీకి, నాగార్జునకు మాత్రమే కాదు… తెలుగు టీవీ ప్రేక్షకులకూ ఉన్నట్టుంది… ఎందుకంటే..?
థర్డ్ వేవ్ వస్తున్నదహో వంటి పిచ్చి ప్రచారాలు, చుట్టూ కరోనా భయాల నడుమ… స్టే హోమ్, స్టే సేఫ్ నినాదాల నడుమ… బతుకు భయం భయంగా సాగుతున్నదే తప్ప ఇళ్లలో ఉండే వృద్ధులు, మహిళలకు వేరే వినోదం అంటూ లేకుండా పోయింది… వర్క్ ఫ్రమ్ హోం కాబట్టి చాలామంది మగపుంగవులూ ఇళ్లు కదలడం లేదు… అందరికీ ఏకైక వినోదం టీవీ మాత్రమే… థియేటర్లకు వెళ్లాలంటే భయం… ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల్లో పస లేదు, పంచ్ లేదు, చూడబుల్ కంటెంటే లేదు… ఈటీవీ పెడితే అదే క్యాషులు, అదే వావ్‌లు, అదే ఢీలు… చొప్పదంటు ప్రశ్నలు, కిట్టీ పార్టీల తరహాలో నసపెట్టేస్తున్నయ్… జబర్దస్త్ కూడా అసలు స్కిట్లు మానేసి, వాళ్లలోవాళ్లే జోకులు, సెటైర్లు వేసుకుంటూ ఏదో కథ నడిపించేస్తున్నారు… భీకరమైన సీరియళ్లలో ఆడవాళ్ల కుట్రలు, హత్యాపథకాలు, వేధింపులు, క్రూరత్వాలు సరేసరి…
Ads
సో, ప్రేక్షకులకు పిచ్చాపాటీ చర్చల కోసం, ఓ పిచ్చిలో పడి కొట్టుకుపోవడం కోసం తాత్కాలికంగా బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో కావాలి… అనుకుంటాం గానీ, ఎవరెన్ని తిట్టుకున్నా సరే ఇలాంటి షోలు మన చుట్టూ ఆవరించుకునే అనేకానేక ఇతర తల్నొప్పులు, చికాకులు, రొటీన్ విసుగుల నుంచి డైవర్ట్ చేస్తాయి… దిక్కుమాలిన షో, దరిద్రపు షో, బూతుల షో అనుకుంటూనే జబర్దస్త్ చూడటం లేదా ప్రేక్షకులు… అలాగే… స్క్రిప్టెడే అయినా సరే, మనకు తెలిసిన చిన్నపాటి సెలబ్రెటీలు ఒక ఇంట్లో తిట్టుకుంటూ, తన్నుకుంటూ, పోటీలుపడుతూ, డాన్సులు చేస్తూ, గిల్లికజ్జాలు పెట్టుకుంటూ… అదొక వినోదం… ఇలాంటి షోలతో ప్రజా ప్రయోజనం ఏమిటీ అనడక్కండి… జస్ట్, ఇది వినోదం… అదే ప్రయోజనం… ఇది మాటీవీ వాడికీ అవసరమే… స్టార్ మ్యూజిక్ ఫ్లాప్, కామెడీ స్టార్స్ ఫ్లాప్, డాన్స్ షో ఫ్లాప్… ఏ రియాలిటీ షో చేపట్టినా ఫ్లాపే… వాడికీ నాన్-ఫిక్షన్ కేటగిరీలో ప్రేక్షకులు కావాలి, రేటింగ్స్ కావాలి… దానికి బిగ్‌బాసే మార్గం… అందుకే రిస్క్, ఖర్చుకు వెరవకుండా వెంటనే అయిదో సీజన్‌కు రెడీ అయిపోయాడు…
గతంలోలాగా ఇప్పుడు కంటెస్టెంట్లకు ముందస్తు క్వారంటైన్లు అవసరం లేదు, అందరికీ వేక్సినేషన్ తప్పదు… మరీ మొన్నటి సీజన్లాగా ఆంక్షల నడుమ నిర్వహణ అక్కర్లేదు… ఇప్పటికైతే అగ్రిమెంట్ల దాకా రాలేదు గానీ కొందరి పేర్లు మాత్రం ఖాయమైపోయాయి… అఫ్కోర్స్, చివరకొచ్చేసరికి కొన్నిపేర్లు ఎగిరిపోవచ్చు కూడా… ఈనెల 29 నుంచి షూటింగ్ స్టార్ట్ అంటున్నారు కాబట్టి ఇంకా టైముంది… ఇప్పటివరకు ఖరారైనవాళ్లలో యాంకర్ విష్ణుప్రియ… నెక్కిలీసు గొలుసు దుర్గారావు… టాటూ ఎక్స్పర్ట్, కమెడియన్, యాంకర్ లోబో… టాప్ మేల్ యాంకర్లలో ఒకడైన రవి… 7 ఆర్ట్స్ సరయూ (యూట్యూబ్ ఆర్టిస్టు బహుశా)… టీవీ నటి, యాంకర్ సిరి హన్మంతు… మరో నటి లహరి… ఎప్పటిలాగే టీవీ9 నుంచి ఒకరు ఉంటారు కదా, ఈసారి ప్రత్యూష… ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఫైనలైనవాళ్లు వీళ్లే…!!
Share this Article