నిజమే, ఓ మిత్రుడు చెప్పినట్టు…. సంగీత దర్శకుడు థమన్‌కు ఎలాగూ లేదు… కాపీ ట్యూన్లతో బతికేస్తుంటాడు… చివరకు కోట్ల మంది హిందూ భక్తులు పాడుకునే ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఓ ఐటం సాంగ్‌కు పల్లవిగా మార్చేశాడు… పర్లేదు, మన భక్తి పాటలే కదా… ఎవడు ఎలా ‘రంకు పట్టించినా’ అడిగేవాడెవడూ ఉండడు… పైగా ఈ పాటకు యూట్యూబ్‌లో 18 లక్షల వ్యూస్… ఒక్క పూటలో… హబ్బ, శ్రేయ ఘోషాల్ ఇరగదీసింది అంటూ వందల కామెంట్లు… ప్రశంసలు… దీనికి శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజిషన్… హీరో నాగశౌర్య సూపర్‌విజన్… హీరోయిన్ రీతూ వర్మతోపాటు ఆ టీమ్ ద్వారా డాన్స్ అనబడే గెంతులు… ఇవన్నీ సరే, నిర్మాతకు ఎలాగూ తలకాయ ఉండదు, డబ్బులు, సినిమా మార్కెట్ మీద ధ్యాస తప్ప… ఇలాంటి దర్శకులకు ఇంకెంత బూతు దట్టిద్దామా అనే యావ తప్ప మరోలోకం ఉండదు… టేస్టున్న దర్శకులు కదా… డాన్సర్లు, మాస్టర్లు, సింగర్లు ఎట్సెట్రా వాళ్ల మాటకు విలువ ఉండదు కాబట్టి పర్లేదు… థమన్ ఎలాగూ తెలుగు సినిమా సంగీతానికి పట్టిన ఓ కాపీ వైరస్… కానీ ఆ పాట రాసిన అనంత శ్రీరామ్ కలానికి ఏం పుట్టింది అనే విమర్శ ఎక్కువగా వినవస్తున్నది ఇప్పుడు… ఎందుకంటే..? తను ఫేస్‌బుక్‌లో పెట్టాడు… “5 గంటల్లో మిలియన్ వ్యూస్” అంటూ ఒక పోస్టు…! అంతేకాదు…
దర్శకులు సౌజన్యగారికి
మనస్పూర్తిగా ధన్యవాదాలు………. అని రాసుకొచ్చాడు మరో పోస్టు… రియల్లీ శ్రీరామ్‌ను చూస్తే జాలేస్తుంది… మరీ సిగ్గులేని సమర్థన… తనకు ఇలాంటి పిచ్చిపాటలు రాయడంలో ఎంత విద్వత్తు ఉన్నా సరే… ఈ సమర్థనతో ఈ అనంతుడికి అనంతమైన శరరాహిత్యం ఉన్నట్టు స్పష్టం అవుతోంది… అసలు వివాదం ఏమిటి..? ఒక భక్తి పాట పల్లవిని ఓ మాస్ సాంగ్‌కు వాడుకోవడం ఏమిటీ అని… తనేం చెబుతున్నాడు..? అజ్ఞాత రచయిత ఎవరో వాళ్లకు పాదాభివందనాలు అంటున్నాడు… ఇక్కడ కాపీ రైట్ సమస్య కాదు ఆచార్యవర్యా, ఒక భక్తి పాటను బూతీకరించడం… దాన్ని వదిలేసి ఎవరికీ ఈ పాదాభివందనాలు..? తెలుగు ప్రేక్షకులంటే మరీ ఇంత చిన్నచూపా శ్రీరామ్..? మరీ సుద్దాల అశోకతేజకు వారసుడిలా కనిపిస్తున్నావ్… నువ్వు ఘనంగా చెప్పుకున్న మిగిలిన పంక్తుల గురించీ చెప్పుకుందాం… ఎలాగూ థమన్‌కు నువ్వు తాతలాగా ఉన్నావు కదా…
మొన్న ఇంకెవరో ‘‘ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు’’ అనే సినిమాలో ఓ బూతు సీన్‌కు అనేక ఏళ్లుగా భక్తులు పాడుకునే భజగోవిందం పల్లవిని బ్యాక్ గ్రౌండ్‌గా పెట్టేశాడు… సోషల్ మీడియాలో పదిమందీ బూతులు తిట్టేసరికి, అరెరె, పొరపాటే అని లెంపలు వేసుకున్నాడు ఆ దర్శకుడు… ప్రొమో కట్ చేసేటప్పుడు, వేర్వేరుగా ఉన్న ఆడియో, వీడియోలను సింక్ చేయడంలో తప్పు జరిగింది అని కవర్ చేసుకొచ్చాడు… ఈ *వరుడు కావలెను* సినిమా టీంకు ఆ సోయి కూడా లేనట్టుంది… పైగా సమర్థనలు… వాళ్లకు తెలుసు కదా, సోషల్ మీడియాలో ఓ పదిమంది గగ్గోలు పెడతారు, రెండో రోజుకు అందరూ సైలెంట్ అయిపోతారు అని…! అసలు ఈ పల్లవిని వాడుకుంటే తప్పేమిటి అనే పాఠకులు ఓసారి ఈ దిగువ లింక్ చదవండి…
Ads
మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!
ఇక అనంత శ్రీరాముడి ఆ ‘‘మిగిలిన పంక్తుల’’ దగ్గరకొద్దాం… ముందుగా ఈ అద్భుత సాహిత్యాన్ని ఓసారి చదవండి… ఇదీ ఆ పాట…
దిగు దిగు దిగు నాగ నగో నా
దివ్యా సుందర నాగో నాగ
—-
నాగేటి సాలకాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలకాడ నాకేట్టి పనిరో
సంధాల సంతగాడ నాకేట్టి పనిరో
సాకిరేవు తగువు కాడ నాకేట్టి పనిరో
ఇరగబెట్టి మరగబెట్టి
మిగలబెట్టి తగలబెట్టి ఎలకపెట్టిన
నీ ఎవ్వారం చాలురో
—-
కొంపాకొచ్చి పోరోయ్… కోడెనాగ
కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా
సెంపా గిల్లి పోరోయ్ సెట్టినాగా
సంపుతాంది పైటే పడగలాగ
—-
ఊరి మీది గొడవలన్ని… నెత్తి మీదికెత్తుకుంటవ్
గొడుగు తోటి పొయ్యే దాన్ని… గుడిసె దాకా తెచ్చుకుంటవ్
అలకతోనే ఇల్లు అలికితేనే గాని… ఈ దిక్కు సూడవ్
పైసాక్కి పనికిరాని… కానీక్కి కలిసిరాని
కన్నె మోజు తీర్చలేని… సున్నాలు సాలురో
—-
గంప దించి రారోయ్ గడ్డునాగా
గంపేడాశ నాలో రంపమేగా
- ఇది ఎక్కడి మాండలికం శ్రీరామ్..? ఎక్కడైనా వాడుకలో ఉన్నదేనా లేక నువ్వే కొత్తగా క్రియేట్ చేసినవా..? నాకేట్టి నాకేట్టి అని ఎక్కడ వాడతారు..? ఓహో, నువ్వేదో రాస్తే, థమన్ ఏదో చెబితే, ఆ శ్రేయా ఘోషాల్ ఇంకేదో పాడిందా..?
- ఈ ఎలకపెట్టిన అంటే ఏమిటి..? ఓహో, వెలగబెట్టిన పదానికి వికృతియా..? అబ్బో, సూపర్… కానీ ఈ సెట్టినాగ అంటే సమజ్ కాలేదు ఆచార్యా..? కోడెనాగుల్లాగే సెట్టినాగులు అని మాంచి కసిమీద ‘‘కాటేసే’’ నాగుల రకాలు ఉంటాయా..?
- రీతూవర్మ మంచి కాక మీద ఉంది, రారా, జాగు చేయకురా, వెంటనే కాటేసిపోరా అని ఎవడినో పిలుస్తోంది సరే, ‘‘గొడుగు తోటి పొయ్యేదాన్ని గుడిసె దాకా తెచ్చుకుంటవ్’’ అన్నావు కదా, దానికి అర్థం ఏమిటి..? చాలామంది రచయితలు జుత్తుపీక్కుంటున్నారు… కాస్త నువ్వే వివరణ ఇవ్వాలి…. భలేవారే, సినిమా సాహిత్యానికి అర్థాలు ఏముంటయ్ అంటావా..? అయితే వాకే…
- సున్నాలు సాలురో… అంటే ‘‘కన్నెమోజు తీర్చలేని జీరోలు’’ అనేనా నీ అర్థం… సరే… మరి ఈ గడ్డునాగా అంటే ఏమిటి..? జిడ్డునాగులు, మడ్డినాగులు, ఎడ్డినాగులు, గుడ్డినాగులు గట్రా ఓ పదీఇరవై నాగుల్ని పుట్టించలేకపోయావా..? ఇంకా ఈ ‘‘నాగవిషం’’ బాగా పదునెక్కేది…!
- ఈ దిక్కుమాలిన పంక్తులను మెచ్చుకోవాలా..? అదేనా నీ అభ్యర్థన..? ఇదేనా నీ సమర్థన..? ఆ భక్తిపాట పల్లవిని నిస్సిగ్గుగా వాడుకోవడంకన్నా ఈ సమర్థన మరింత దరిద్రంగా ఉంది…!!
- సర్పయాగం అనే సినిమాలో వాణివిశ్వనాథ్ మీద ఓ పాట తీశారు, అందులోనూ ఈ పల్లవి ఉంది కదా అని కొందరి సమర్థన… అందులో ఉంది కాబట్టి దీనికి సర్టిఫికెట్టా..? లైసెన్సా..? అలాగే ఆమధ్య అల్లరి నరేష్ సినిమా బెండు అప్పారావ్ సినిమాలో కూడా వాడుకున్నారు కదా అని ఇంకొందరి సమర్థన… అది బూతు పాట కాదు…! అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు..!! #VaruduKaavalenu, #DiguDiguDiguNaaga, #NagaShaurya, #RituVarma, #Thaman
Share this Article