కెరీర్ పరుగు, అస్థిరమైన కొలువులు, ఒత్తిళ్లు, కాలుష్యంతో దిగజారుతున్న ఆరోగ్యాలు, స్టామినా… 30 ఏళ్లు దాటినా జరగని పెళ్లిళ్లు… 30 దాటితే నిలవని గర్భాలు… ఎన్నో సమస్యలు… సంతానహీనత ఎప్పుడూ ఉన్నదే కానీ గతంలో మహిళలు గంపెడు మందిని కనేవాళ్లు, పెంచేవాళ్లు… ఇప్పుడు అంత వీజీ కాదు… అమ్మో ఒకరు చాలు అనేలా… అసలు లేకపోతేనేం అనేవాళ్లు కూడా… చేదునిజం ఏమిటంటే..? ఈ పిండాన్ని మోయడం ఏమిటి..? సర్జరీ చేయించుకుని కనడం ఏమిటి..? పాలివ్వడం ఏమిటి..? జెనెటిక్ చైల్డ్ కావాలంటే స్టోర్ చేసిన ఎగ్, జీవనభాగస్వామి స్పెరమ్ సమకూరిస్తే చాలదా..? కృత్రిమ గర్భధారణ క్లినిక్కులు బోలెడు… ఆ పిండాన్ని మోయటానికి అద్దె కడుపులు సరేసరి… ఇలా ఆలోచించేవాళ్లూ ఉన్నారు… అదేసమయంలో తల్లి కాలేని వాళ్ల మనోవేదన అనంతం… మొన్నామధ్య హైదరాబాదులోనే ఒక ఉద్యోగిని బిడ్డ ఏదో కారణంతో చనిపోయింది… బాధలో ఉన్న ఆమెకు హఠాత్తుగా స్ఫురించింది ఓ సంగతి… 18 ఏళ్ల క్రితం… అప్పట్లో ఎందుకు, ఏమనిపించిందో గానీ తన అండాన్ని ఎగ్ బ్యాంకులో భద్రపరిచింది… సంప్రదించింది… ఓ ఐవీఎఫ్ క్లినిక్కు వెళ్లింది… పండంటి మొగబిడ్డను పొందింది… ఇన్ని సీరియళ్లు, సినిమాలు, వెబ్ సీరీస్ గట్రా వస్తున్నయ్ కదా… ఎంతసేపూ మితిమీరిన హీరోయిజం ప్రధానంగా సినిమాలు… బూతు ప్రధానంగా వెబ్ సీరీస్… సీరియళ్లలో అత్తాకోడళ్ల తగాదాలు, కుట్రలు, హత్యాపథకాలు, ఆడబిడ్డల ఆరళ్లు, కన్నీళ్లు వంటి కాలం చెల్లిన క్షుద్రాంశాలే తప్ప ఇలాంటి అంశాల్ని ఎందుకు ప్రజెంట్ చేయరు..? జనం చూడరు అనేది ఓ పిచ్చి సాకు… రాసే దమ్ము, తీసే తెలివిడి మన బుర్రలకు లేదు అనేది నిజం… ఎందుకంటే..?
మాలా ఆయి విచ్చయ్‌చి (I want to be a Mother) అనే మరాఠీ సినిమా పదేళ్ల క్రితం వచ్చింది… సరోగసీ ఇష్యూ చుట్టూరా తిరుగుతుంది కథ… రకరకాల సరోగసీ చిక్కుల్ని ఆ కథ ద్వారా మనకు ఎక్కిస్తాడు రచయిత, దర్శకుడు… మరాఠీ, మళయాళం, తమిళం ఇండస్ట్రీలు భిన్న కథాంశాల్ని ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటయ్… ఆ మరాఠీ సినిమాను ఇప్పుడు మిమి పేరిట హిందీలో తీశారు… మంచి ప్రశంసల్ని పొందుతోంది… నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది… అయితే దర్శకుడికి ఏదో డౌట్ వచ్చి, సీరియస్ కంటెంట్ కదా, ప్రేక్షకుడికి ఎక్కుతుందా అనుకుని, కామెడీని రంగరించి, సరదాసరదాగా కథనాన్ని తీసుకుపోతాడు… సరోగసీ లీగల్ ఇష్యూస్ మాత్రమే కాదు, ఎమోషనల్ ఇష్యూస్‌ను కూడా టచ్ చేస్తుంది కథ… ఓ రాజస్థానీ యువతి, సినిమా తార కావాలని ఆశ… ఫోటోషూట్ డబ్బుల కోసం, ఇతరత్రా ఖర్చుల కోసం ఓ అమెరికన్ జంటకు బిడ్డను కనివ్వడానికి కంట్రాక్టు… ప్రాసెస్ అయిపోతుంది, కానీ కొన్నాళ్లకు పుట్టబోయే బిడ్డ ‘డౌన్ సిండ్రోమ్’ అని పరీక్షల్లో తేలుతుంది… అబార్షన్ చేయించుకో అని మిమీకి కాస్త డబ్బిచ్చి వెళ్లిపోతారు… మిమి గతేమిటి..? మిగతా కథ ఇక్కడ చెప్పను, కానీ సరదాగానే ఓ సీరియస్ కథను చెప్పడంలో దర్శకుడి విజయం ఉంది… గ్లామర్ పాత్రలు వేసుకునే కృతిసనన్‌ను కొత్తగా చూస్తాం ఇందులో… ఏఆర్‌రెహమాన్ సంగీతం…
Ads
సరోగసీ మీద ఏమేం సినిమాలు వచ్చాయో కూడా కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి పత్రికల్లో, సినిమా సైట్లలో, మెయిన్ స్ట్రీమ్ సైట్లలో కూడా… నిజానికి అవన్నీ నిజం కాదు… సరోగసీ మీద తెలుగు సినిమా కంట్రిబ్యూషన్ ఏమిటో తరువాత చెబుతాను కానీ వీళ్లు చెప్పే ఉదాహరణల గురించి చూద్దాం….
- Good Newwz అని 2019లో ఒక సినిమా వచ్చింది… అక్షయ్ కుమార్, కరీనాకపూర్, కైరా అద్వానీ, దిల్జిత్ ప్రధాన నటీనటులు… ఇది ప్రధానంగా కామెడీ డ్రామా తప్ప సరోగసీ, ఐవీఎఫ్ ఇష్యూస్ మీద సీరియస్ సినిమా కాదు… సేమ్ సర్‌నేమ్ ఉన్న ఇద్దరి వీర్యం తారుమారు కావడం అనే పాయింట్‌తో కథ రాసుకున్నారు…
- ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్ నటించిన ‘Vicky Donor’ మరో సినిమా… ఓ రొమాంటిక్ కామెడీ… 2012లో వచ్చింది… ఇది ఓ వీర్యదాత కథ… సరోగసీ జోలికి పోదు కథ…
- ‘I Am’ అని మరో సినిమా… నాలుగు చిన్న కథల అంథాలజీ ఫిలిమ్ ఇది… అందులో ఒకటి ఆఫియా… నందితాదాస్ నటించింది… ఇది ప్రధానంగా వీర్యదానం అంశం మీదే నడుస్తుంది…
- ‘Filhaal’… 2002లో వచ్చింది… గుల్జార్, రాఖీల బిడ్డ మేఘనా దర్శకత్వం… టాబు, సుస్మితసేన్ నటించారు… ఇది సరోగసీ సమస్యల్ని, బంధాల్ని, చిక్కుల్ని చర్చించిన సినిమాయే…
- ‘Chori Chori Chupke Chupke’… 2001లో వచ్చింది… సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా లీడ్ రోల్స్… సరోగసీ మీద కాస్త మెలోడ్రామా దట్టించిన ఈ సినిమా ప్రేక్షకుల్లోకి బాగానే వెళ్లింది… ఒక వేశ్య సరోగసీకి ఒప్పుకోవడం, తరువాత కొన్ని చిక్కులు సినిమా కథ…
- ‘Doosri Dulhan’… ఇది 1983లోనే తీయబడిన సినిమా… చోరీ చోరీ చుప్కే చుప్కే సినిమాకు ఈ కథే మూలం… షబనా ఆజ్మీ, షర్మిలా ఠాగూర్ లీడ్ రోల్స్… ఆ కాలంలో ప్రేక్షకులకు అంతగా తెలియనిది ఈ ‘అద్దె కడుపులు’ అంశం… అందుకే ఎక్కలేదు… ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన సినిమా ఇది… ‘ది బేబీ మేకర్’ అనే అమెరికన్ సినిమా దీనికి ప్రేరణ…
ఈ విశ్లేషకులందరూ విస్మరించిన ఓ తెలుగు సినిమా ఉంది… దాని పేరు ‘9 నెలలు’… 2001లోనే… అంటే ఇరవై ఏళ్ల క్రితమే తెలుగు ఇండస్ట్రీ ఈ అంశాన్ని టచ్ చేసింది… ఇప్పుడంటే అన్నీ చెత్త కథలు, రొటీన్ ఫార్ములా కథలు, హీరో సెంట్రిక్ ఇమేజీ సొల్లు… కానీ ఎయిటీస్, నైన్టీస్ ప్రాంతాల్లో భిన్న కథాంశాల్ని మన దర్శకులు ఎంచుకునేవాళ్లు, బాగానే ట్రీట్‌మెంట్ ఉండేది… ప్రత్యేకించి సుబ్బయ్య, టి.కృష్ణ, క్రాంతికుమార్ వంటి దర్శకులు… అప్పట్లో వెంకటేష్ కంట్రాక్టు మ్యారేజీ, రేప్ బాధితురాలితో పెళ్లి వంటి డిఫరెంట్ కథలకు కూడా వోకే చెప్పేవాడు… నటించేవాళ్లు ఉన్నారు, చూసేవాళ్లు ఉన్నారు… అప్పుడూ ఇప్పుడూ… తీసేవాళ్లు లేరు, అంతే… ఈ 9నెలలు సినిమా క్రాంతికుమార్ తీసిందే… సౌందర్య, విక్రమ్ లీడ్ రోల్స్… ఇక వాళ్ల గురించి చెప్పేదేముంది..? అద్దె కడుపు, దాని సోషల్ ఇష్యూస్ చుట్టూరా ఉంటుంది కథ… దర్శకుడు కామెడీని ఆశ్రయించలేదు, సబ్జెక్టు డీవియేషన్ అస్సలు ఉండదు… అదే సినిమాను కండెన్ సీతయ్య పేరిట తమిళంలోకి కూడా అనువదించారు… ఎన్నేళ్లయింది తెలుగులో భిన్న కథాంశాల్ని చూసి…!! అన్నట్టూ… 2013 లో సింగీతం తీసిన welcome Obama కూడా సరోగసీ based…!!!
Share this Article